Zimbabwe: జింబాబ్వే లిథియం గనులపై విదేశీయుల కన్ను... తలరాత మారుతుందా?
జింబాబ్వే లిథియం గనులపై విదేశీ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. చైనా ఆధిపత్యం, పెరుగుతున్న ఎగుమతులు, స్థానిక ప్రజలకు కలిగే లాభాలు, భౌగోళిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉన్నదో తెలుసుకుందాం.
Zimbabwe: భవిష్యత్ ప్రపంచాన్ని శాసించబోయే 'వైట్ గోల్డ్' గా పిలవబడే లిథియం నిల్వలకు జింబాబ్వే ప్రధాన కేంద్రంగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ సాంకేతికతకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో, ఆఫ్రికాలోనే అతిపెద్ద లిథియం నిల్వలు ఉన్న జింబాబ్వేపై చైనా వంటి అగ్రదేశాల కన్ను పడింది. అయితే, ఈ విదేశీ పెట్టుబడులు ఆ దేశ ఆర్థిక రంగాన్ని మారుస్తున్నాయా లేదా అనేదే అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
చైనా ఆధిపత్యం ... వందల మిలియన్ డాలర్ల పెట్టుబడులు
జింబాబ్వేలోని లిథియం మైనింగ్ ప్రాజెక్టులలో చైనా కంపెనీలదే పూర్తి హవా నడుస్తోంది. హరారే సమీపంలోని అర్కాడియా మైన్, మస్వింగో ప్రావిన్స్‌లోని బికిటా మినరల్స్, సాబి స్టార్, కమతివి వంటి ప్రధాన గనులు చైనా సంస్థల ఆధీనంలో ఉన్నాయి. చైనాకు చెందిన గ్లోబల్ బ్యాటరీ మినరల్స్ దిగ్గజం 'జెజియాంగ్ హువాయో కోబాల్ట్' సంస్థ అర్కాడియా గని వద్ద సుమారు 400 మిలియన్ డాలర్ల వ్యయంతో అధునాతన ప్రాసెసింగ్ ప్లాంట్‌ను నిర్మించింది. ముడి ఖనిజాన్ని నేరుగా ఎగుమతి చేయడంపై జింబాబ్వే ప్రభుత్వం నిషేధం విధించడంతో, ఇక్కడే ప్రాసెసింగ్ చేసి 'లిథియం సల్ఫేట్' రూపంలో 2026 ఏప్రిల్లో మొదటిసారిగా విదేశాలకు విజయవంతంగా ఎగుమతి చేశారు. ఇది ఆఫ్రికా ఖండంలోనే ఒక మైలురాయిగా నిలిచింది.
పెరిగిన ఆదాయం.. కానీ ఒకే దేశంపై ఆధారపడటం ప్రమాదకరమా?
ప్రభుత్వ కఠిన నిర్ణయాల వల్ల జింబాబ్వే ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. మినరల్స్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఆఫ్ జింబాబ్వే గణాంకాల ప్రకారం... 2026 మొదటి త్రైమాసికంలో ఖనిజాల విక్రయాలు 983.85 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఎగుమతి పరిమాణం 27 శాతం పెరగ్గా... ఎగుమతుల విలువ 79 శాతానికి పెరిగింది. లిథియం ఎగుమతి ద్వారా 2025 మొదటి త్రైమాసికంలో 84.19 మిలియన్ డాలర్లు ఉండగా...2026నాటికి అది 178.64 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే, జింబాబ్యే కేవలం చైనా మార్కెట్‌పైనే ఆధారపడింది. దీని వలన దీర్ఘకాలంలో దౌత్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో మారని స్థానికుల బతుకులు
ఒకవైపు బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతున్నా, గనుల చుట్టుపక్కల ఉండే స్థానిక ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్స్ గవర్నెన్స్ ప్రతినిధుల ప్రకారం, రోడ్లు ధ్వంసమవ్వడం, విద్యుత్ కొరత, ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి సమస్యలతో స్థానికులు కొట్టుమిట్టాడుతున్నారు. బికిటా మినరల్స్ వంటి సంస్థలు తాము ప్రజల కోసం 30 మిలియన్ డాలర్ల పవర్ లైన్ ప్రాజెక్టు, మిలియన్ డాలర్ల విలువైన హెల్త్ ఫెసిలిటీ నిర్మించామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా పారదర్శకత రావాల్సి ఉంది. కేవలం ముడి వనరులను విదేశీయులకు ధారాదత్తం చేయకుండా, కార్మికుల హక్కులను కాపాడుతూ, స్థానిక పారిశ్రామికీకరణను బలోపేతం చేసినప్పుడే జింబాబ్వే తలరాత మారుతుంది.




