France Heatwave: విచిత్రంః హీట్‌వేవ్‌ దెబ్బకు ఫ్రాన్స్‌లో మద్యం బ్యాన్‌...షాపింగ్‌ మాల్స్‌లో బిగ్‌ఫైట్‌

147 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఫ్రాన్స్‌లో ఎండలు మండిపోతున్నాయి. సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుడుతండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏసీల కోసం కొట్లాటలు జరుగుతున్నాయి.

Balachander
Published on: 27 Jun 2026 12:01 PM IST
France Heatwave: విచిత్రంః హీట్‌వేవ్‌ దెబ్బకు ఫ్రాన్స్‌లో మద్యం బ్యాన్‌...షాపింగ్‌ మాల్స్‌లో బిగ్‌ఫైట్‌
X

France Heatwave: ప్రస్తుతం ఐరోపా ఖండం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశాన్ని ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజధాని పారిస్ నగరంలో ఈ ఒక్క వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటడం గమనార్హం. క్రీ.శ. 1872 నుండి 2019 వరకు అంటే 147 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం అంతర్జాతీయ పర్యావరణ శాస్త్రవేత్తలను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు అల్లాడిపోతుండటంతో దేశంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.

ఏసీల కోసం బిగ్‌ఫైట్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో

ఎండల తీవ్రత భరించలేక ఫ్రాన్స్ పౌరులు ఏసీలు, కూలర్ల కోసం షాపింగ్ మాల్స్‌కు పరుగులు తీస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఒక ప్రముఖ షాపింగ్ కాంప్లెక్స్‌లోకి వందలాది మంది కస్టమర్లు ఒకేసారి దూసుకువెళ్లి, అక్కడ ఉన్న ఎయిర్ కండిషనర్ యూనిట్లను దక్కించుకోవడానికి ఒకరినొకరు నెట్టుకుంటూ, ఘర్షణకు దిగారు. మార్కెట్లో ఏసీల కొరత ఏర్పడుతుందనే భయంతో జనం పడరాని పాట్లు పడుతున్న దృశ్యాలు ఐరోపాలో ప్రస్తుత అత్యవసర పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ... పారిస్‌లో వీకెండ్ మద్యం నిషేధం!

హీట్‌స్ట్రోక్, గుండెపోటు కేసుల కారణంగా పారిస్ నగరంలోని ఆసుపత్రులు ఇప్పటికే రోగులతో నిండిపోయాయి. మెడికల్ సిస్టమ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి పారిస్ అధికార యంత్రాంగం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వారాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని, అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత మద్యం విక్రయాలను తాత్కాలికంగా నిషేధించింది. జూన్‌ 26 మధ్యాహ్నం నుంచి జూన్‌ 27 శనివారం ఉదయం 7 గంటల వరకు బహిరంగ మద్యపానంపై నిషేధం విధించారు. అదేవిధంగా శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం ఉదయం వరకు కూడా ఇదే నియమం వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇళ్ల లోపల మద్యం సేవించడానికి మినహాయింపు ఇచ్చారు. గ్లోబల్ వార్మింగ్ అనేది కేవలం పేద దేశాల సమస్య మాత్రమే కాదు, సంపన్న ఐరోపా దేశాల ఆర్థిక, సామాజిక మూలాలను సైతం అది ఎలా దెబ్బతీయగలదో చెప్పడానికి ఫ్రాన్స్‌లోని ఈ సంక్షోభమే ఓ ఉదాహరణ.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story