Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో మొదలైన మైనింగ్ వేట... రంగంలోకి దిగిన ఫ్రాన్స్
ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ ఏర్పాటు చేసిన సముద్ర మైన్స్‌ను తొలగించేందుకు ఫ్రాన్స్ రంగంలోకి దిగింది. చమురు షిప్పుల పునరుద్దరణకోసం ప్రయత్నాలు చేస్తోంది.
Strait of Hormuz: అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నౌకల రక్షణ కోసం ఫ్రాన్స్ నేరుగా రంగంలోకి దిగింది. గల్ఫ్ రీజియన్‌లో వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించడానికి, సముద్ర గర్భంలో దాగి ఉన్న మైన్స్ ఏరివేయడానికి తమ నౌకాదళాన్ని పంపినట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ఈ జలసంధిలో మైనింగ్ వేట ప్రారంభం కావడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సరికొత్త మలుపుగా భావిస్తున్నారు.
ఫ్రాన్స్ మిలిటరీ మోహరింపు ... లైనప్ ఇదే!
గత జూన్ 17న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య 14-అంశాల అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ.. క్షేత్రస్థాయిలో నౌకలకు ఇంకా పూర్తి భద్రత లభించలేదు. దీంతో ఒమన్ సుల్తాన్ 'హైథమ్ బిన్ తారిక్ అల్ సైద్' తో జరిపిన కీలక చర్చల అనంతరం మాక్రాన్ ఈ మిలిటరీ యాక్షన్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఫ్రాన్స్ ఈ ఆపరేషన్ కోసం రెండు అధునాతన మైన్‌హంటర్స్, వాటికి రక్షణగా రెండు యుద్ధ నౌకలు, ఒక ప్రత్యేక మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మిడిల్ ఈస్ట్‌కు తరలించింది. హోర్ముజ్ జలసంధి పరిధిలోకి వచ్చే తమ ప్రాంతీయ జలాల్లో ఫ్రాన్స్, బ్రిటన్ దళాలు పనిచేయడానికి ఒమన్ ప్రభుత్వం అంగీకరించడం గమనార్హం.
బ్రిటన్-ఫ్రాన్స్ సంయుక్త హెచ్చరిక
ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌లు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. హోర్ముజ్ జలసంధి అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన ప్రాంతమని, ఇక్కడ అంతర్జాతీయ నౌకల స్వేచ్ఛను అడ్డుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ ప్రాంతంలో మరింత పెద్ద ఎత్తున మల్టిపుల్ మిలిటరీ మిషన్‌ను మోహరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పశ్చిమ దేశాల కూటమి ఇరాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచానికి చమురు సరఫరా చేసే ఈ మార్గంపై పట్టు కోసం సాగుతున్న ఈ అంతర్జాతీయ చదరంగం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.




