Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు? సామాన్యుడిపై భారీ భారం
Fuel Price Hike: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరడంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు? సామాన్యుడిపై భారీ భారం
Petrol and Diesel: దేశంలో ఇంధన ధరల సెగ మరోసారి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో రాజుకుంటున్న యుద్ధ జ్వాలలు భారత ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకప్పుడు బ్యారెల్‌కు 70 డాలర్ల వద్ద ప్రశాంతంగా ఉన్న ముడి చమురు ధర, ఇప్పుడు ఏకంగా 120 డాలర్ల మార్కును దాటేసి ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. ఈ మార్గం గుండా సరఫరా నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఈ అనిశ్చితి వల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.
ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వినియోగదారులపై భారం పడకుండా ధరలను స్థిరంగా ఉంచుతున్నప్పటికీ, తెర వెనుక కథ వేరేలా ఉంది.ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు నెలకు దాదాపు రూ. 30,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ. 20 నుంచి 24 వరకు నష్టాన్ని కంపెనీలే భరిస్తున్నాయి. డీజిల్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇంతటి భారీ ఆర్థిక ఒత్తిడిని కంపెనీలు ఎక్కువ కాలం భరించడం అసాధ్యమన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణ. అందుకే, ఇంధన ధరల సవరణ అనివార్యమని అధికారులు సంకేతాలిస్తున్నారు.
పెరగనున్న భారాలు..
మే 15 నాటికి ధరల పెంపుపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, అంతర్జాతీయంగా ధరలు తగ్గకపోతే సామాన్యుడిపై భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం..లీటరుకు రూ. 4 నుంచి 5 వరకు పెరిగే అవకాశం ఉంది. వంట సిలిండర్ ధర రూ. 40 నుంచి 50 వరకు పెరగవచ్చని అంచనా. ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ ఇప్పటికే బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా వంటి దేశాల నుంచి ముడి చమురు దిగుమతులను విస్తరించడం ద్వారా సరఫరాలో అంతరాయం కలగకుండా చూస్తోంది. అలాగే దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచడం, ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వంటి చర్యలపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.




