Future Weapons: ప్యూచర్ వెపన్స్...యుద్ధం వస్తే మనుగడ కష్టం
సాంకేతిక విప్లవం యుద్ధ తంత్రాన్ని మార్చేస్తోంది. డ్రోన్లు, లేజర్ ఆయుధాలు, కృత్రిమ మేధతో పనిచేసే రోబోటిక్ సైన్యం భవిష్యత్తులో మానవ మనుగడకే సవాలుగా మారనున్నాయి.
Future Weapons: గత రెండు మూడు నెలలుగా ప్రపంచ దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు మాట్లాడుతున్న మాట యుద్ధం. పశ్చిమాసియా యుద్ధం తరువాత ప్రతి ఒక్కరిలో తెలియని భయం అలుముకుంది. ఇలాంటి యుద్ధాలు మరికొన్ని జరిగితే...లేదా రాబోయే రోజుల్లో భారీ యుద్ధాలు సంభవిస్తే మనిషి పరిస్థితి ఏంటి? మనుగడ సాగించగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిని మనం సాంకేతిక కోణంలో ఆలోచించాలి. సాంకేతిక విప్లవం యుద్ధ తంత్రాన్ని మార్చేస్తోంది. డ్రోన్లు, లేజర్ ఆయుధాలు, కృత్రిమ మేధతో పనిచేసే రోబోటిక్ సైన్యం భవిష్యత్తులో మానవ మనుగడకే సవాలుగా మారనున్నాయి.
"ఈ శతాబ్దం యుద్ధాలది కాదు" అని ప్రపంచ నాయకులు వేదికల మీద చెబుతున్నా, తెర వెనుక మాత్రం ప్రతి దేశం అత్యాధునిక మారణాయుధాల తయారీలో నిమగ్నమై ఉంది. ఒకప్పుడు యుద్ధం అంటే కత్తులు, ఫిరంగులు.. ఆ తర్వాత క్షిపణులు, విమానాలు. కానీ ఇప్పుడు సీన్ మారింది. టెక్నాలజీ పుణ్యమా అని శబ్ద వేగాన్ని మించి ప్రయాణించే హైపర్ సోనిక్ క్షిపణులు, కంటికి కనిపించకుండానే శత్రువును ఖతం చేసే లేజర్ ఆయుధాలు యుద్ధ రంగంలోకి వచ్చేశాయి. ఇవే ఇప్పుడు భయాన్ని కలిగిస్తున్నాయి. మరణమృదంగాన్ని మోగించే ఈ ఆయుధాలపై నియంత్రణ అవసరమని నిపుణులు చెబుతున్నారు.
టెక్నాలజీ మాయాజాలం.. మారణహోమం!
ప్రస్తుతం ప్రపంచ దేశాలు కేవలం సంఖ్యాబలంపై కాకుండా, సాంకేతిక బలంపై ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే రోబోటిక్ ఆయుధాలు మనుషుల ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకోగలవు. అగ్రరాజ్యాలు తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ఇతర దేశాలను ప్రభావితం చేస్తున్నా, ఇప్పుడు చిన్న దేశాలు సైతం స్వయం శక్తి కోసం ప్రయత్నిస్తున్నాయి. వెనుకబడిన దేశాలుగా ముద్రపడ్డ ఆఫ్రికా ఖండం సైతం నేడు సొంత వనరులను వెలికితీస్తూ ప్రపంచంతో పోటీ పడుతోంది.
వినాశనం ముంగిట మానవాళి
సంప్రదాయ యుద్ధం నుంచి మందుగుండు వినియోగించే స్థాయికి ఎదిగిన దేశాలు రాబోయే 100 ఏళ్లలో యుద్ధం ఏ విధంగా మారుతుందో తలచుకుంటేనే భయం వేస్తుంది. రాబోయే రోజుల్లో యుద్ధం వస్తే అది కేవలం రెండు దేశాల మధ్య పోరాటంలా ఉండదు. క్షణాల్లో దేశాలను తుడిచిపెట్టే వినాశకర ఆయుధాలు అప్పటికి అందుబాటులోకి వస్తాయి. వేల సంఖ్యలో డ్రోన్లు ఒకేసారి దాడి చేయవచ్చు. కంప్యూటర్ కీబోర్టు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయవచ్చు. శాటిలైట్లను ధ్వంసం చేసి సమాచార వ్యవస్థను కట్ చేయవచ్చు. తద్వారా ఆ దేశం వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. ఇలాంటి ఎన్నో విధ్వంసకరమైన ఆయుధాలు ప్రపంచదేశాలు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఒక్కమాట చెప్పాలంటే ఏ దేశం మరో దేశానికి బానిస కాదు. కానీ వనరుల వేట, ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో యుద్ధం వస్తే సామాన్య ప్రాణుల కంటే మానవ మనుగడే కష్టమవుతుంది. మనం సృష్టించిన టెక్నాలజీ మనల్నే మింగేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాంతి మంత్రం పఠించకపోతే, వచ్చే శతాబ్దపు ఆయుధాలు మనిషిని చరిత్ర పుటల్లో మిగిల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏం చేయాలన్నది మన చేతుల్లోనే ఉంది. చేయిదాటక ముందే అడ్డుకట్టవేయడం మంచిది.




