Gaza Floods: గాజాలో వరద బీభత్సం.. 70 వేల కుటుంబాలు వీధిపాలు

గాజాలో భారీ వర్షాలు, వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 70 వేలకుపైగా నిరాశ్రయ కుటుంబాల గుడారాలు నీట మునిగిపోవడంతో వేలాది మంది చలిలో నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు.

CR Reddy
Published on: 9 Nov 2026 7:12 AM IST
Gaza Floods
X

Gaza Floods

Gaza Floods: గాజాలో యుద్ధం కారణంగా ఇప్పటికే నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ప్రకృతి మరో రూపంలో కష్టం వచ్చిపడింది. శీతాకాలం ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలు, ఆ తర్వాత వచ్చిన వరదలు వేలాది కుటుంబాలను రోడ్డున పడేశాయి. 70 వేలకుపైగా కుటుంబాలు నివసిస్తున్న గుడారాలు నీటిలో మునిగిపోయాయి లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు చలిగాలులు కూడా తోడయ్యాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది.

70 వేల కుటుంబాల గుడారాల్లోకి వరద నీరు

గాజా పౌర రక్షణ విభాగం అధికార ప్రతినిధి మహమూద్ బసల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తుఫాను కారణంగా ఒక్క రాత్రిలోనే సహాయం కోసం 1,500కు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. గుడారాల్లోకి నీరు చేరడం, గోడలు కూలిపోయే ప్రమాదం ఉందంటూ బాధితులు అధికారులను సంప్రదించారు. అయితే అవసరమైన పరికరాలు, వాహనాలు, ఇతర వనరులు అందుబాటులో లేకపోవడంతో సహాయక బృందాలు పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. గుడారాల్లోని పరుపులు, దుప్పట్లు, వెచ్చని దుస్తులు తడిసిపోవడంతో చలిలో పిల్లలను ఎలా కాపాడుకోవాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

12 గంటల్లోనే 60 మిల్లీమీటర్ల వర్షం

గాజా నగరంలో కేవలం 12 గంటల్లో 60 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇది అక్కడి ఏడాది మొత్తం కురిసే వర్షపాతంలో దాదాపు 15 శాతానికి సమానం. బలమైన గాలులకు కొన్ని గుడారాలు ఎగిరిపోయాయి. మరికొన్ని చిరిగిపోయాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్న భవనాల గోడలు తుఫాను ప్రభావంతో కూలిపోయాయి. రెండు గోడలు కూలి, వాటిపై ఇనుప రేకులు పడటంతో ఐదుగురు పాలస్తీనియన్లు గాయపడినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ తుఫాను కారణంగా దాదాపు 30 లక్షల డాలర్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.

270 శిబిరాల్లోకి వరద ముప్పు

గాజా నగరంలో దాదాపు 10 లక్షల మంది ప్రజలు, నిరాశ్రయులు నగరంలోని 30 శాతం ప్రాంతంలోనే నివసిస్తున్నట్లు మున్సిపల్ ప్రతినిధి హోస్నీ ముహన్నా తెలిపారు. దీంతో ఇప్పటికే దెబ్బతిన్న మౌలిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. నగరంలోని 270 శిబిరాలు, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాల్లోకి వరద నీరు చేరే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. యుద్ధంలో డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో ప్రస్తుతం దాని సామర్థ్యం 20 శాతానికి పడిపోయింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలకు మరింత ప్రమాదం పొంచి ఉంది. నీరు నిలిచిపోవడంతో అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

2 లక్షల తాత్కాలిక ఇళ్లు కావాలి

గాజాలో ప్రస్తుతం దాదాపు 2 లక్షల తాత్కాలిక ఇళ్లు, భారీ యంత్రాలు అత్యవసరంగా అవసరమని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. 2025 అక్టోబర్ 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ముందుగా సిద్ధం చేసిన తాత్కాలిక ఇళ్లను గాజాలోకి తీసుకురావడానికి ఇజ్రాయెల్ అనుమతించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. చలికాలానికి అవసరమైన దుప్పట్లు, దుస్తులు, గుడారాలు, నిర్మాణ సామగ్రి, సహాయక వస్తువులు చేరాలంటే సరిహద్దు మార్గాలను పూర్తిగా తెరవాలని కోరుతున్నారు. యుద్ధంలో దెబ్బతిన్న ఇళ్లను బాగుచేసేందుకు అవసరమైన వస్తువులపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయని పేర్కొంటున్నారు.

19.8 లక్షల మందికి ఆశ్రయం అవసరం

పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి సంస్థ UNRWA జూన్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం.. గాజా జనాభాలో దాదాపు 94 శాతం మందికి, అంటే 19.8 లక్షల మందికి ఆశ్రయం సహా అత్యవసర సాయం అవసరం. వీరిలో 58 శాతం మంది తీవ్ర స్థాయిలో లేదా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు సంస్థ తెలిపింది. మరోవైపు, అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం UNOCHA కూడా వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో 9.5 లక్షల మంది నిరాశ్రయులు నివసిస్తున్నట్లు హెచ్చరించింది. వీరిలో 4 లక్షల మందికి పైగా అత్యధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ఉన్నారు. 2023 అక్టోబర్‌లో ప్రారంభమైన యుద్ధం గాజాలో ఇళ్లు, రహదారులు, మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీసింది. కాల్పుల విరమణ తర్వాత కూడా పునరావాసం, పునర్నిర్మాణం అవసరాలకు తగినంత సహాయం అందకపోవడంతో ప్రజల కష్టాలు కొనసాగుతున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.