Population: చరిత్రలోనే తొలిసారి.. పిల్లల కంటే ముసలోళ్లే ఎక్కువ.. నివేదికలో షాకింగ్ నిజాలు
Population: మానవ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక విచిత్రమైన, ఆందోళనకరమైన మార్పు చోటుచేసుకుంది.
Population
Population:అమెరికా సెన్సస్ బ్యూరో విడుదల చేసిన తాజా గణాంకాలు ప్రపంచదేశాలను తీవ్ర ఆలోచనలో పడేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా చిన్న పిల్లల కంటే వయోధికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ మార్పు కేవలం ఐరోపా, అమెరికా వంటి సంపన్న దేశాలకే పరిమితం కాకుండా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోకి విస్తరించింది. 2025 నాటికి ప్రపంచంలో 65 ఏళ్లు దాటిన వారు 85.2 కోట్లు ఉండగా, 2060 నాటికి ఈ సంఖ్య ఏకంగా 200 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఈ వ్యవధిలో భూగోళంపై పెరిగే మొత్తం జనాభాలో 55 శాతానికి పైగా వాటా వృద్ధులదే కానుండటం గమనార్హం.
ఫర్టిలిటీ ట్రాప్లో భారత్, చైనా
జనాభాను స్థిరంగా ఉంచడానికి ప్రతి మహిళకు సగటున 2.1 సంతానోత్పత్తి రేటు అవసరం. అయితే ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 71 శాతానికి పైగా ప్రజలు ఈ మార్కు కంటే తక్కువ జననాల రేటు ఉన్న దేశాల్లోనే నివసిస్తున్నారు. పది సంవత్సరాల క్రితం ఇది కేవలం 45 శాతంగానే ఉండేది. ఆసియాలోని అతిపెద్ద దేశాలైన భారత్, చైనాలలో సంతానోత్పత్తి రేటు 2.1 కంటే కిందికి పడిపోయింది. ఫలితంగా ఈ దేశాల్లో కూడా భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గిపోయి ముసలివారి శాతం విపరీతంగా పెరగనుంది. చిన్న తరాలు పెద్ద తరాల స్థానాన్ని భర్తీ చేయలేకపోయే ఫర్టిలిటీ ట్రాప్లో ప్రపంచం చిక్కుకుంటోంది.
తీవ్రంగా మారనున్న ఆర్థిక, సామాజిక సవాళ్లు
దేశంలో శ్రామిక శక్తి తగ్గడం, ఆస్పత్రి వైద్య సేవలు, పింఛన్లు, కేర్ టేకర్ల అవసరాలు పెరగడం వంటివి ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన భారాన్ని మోపనున్నాయి. పనిచేసే యువత తగ్గితే పన్నుల ఆదాయం తగ్గి, ముసలివారి సంక్షేమం కోసం వెచ్చించే ఖర్చులు రెట్టింపు అవుతాయి. ఫలితంగా అనేక దేశాలలో శ్రామికుల కొరత స్పష్టంగా కనిపించనుంది. కుటుంబ వ్యవస్థల్లో కూడా పిల్లల అల్లరి కంటే పెద్దల సంరక్షణే ప్రధాన అంశంగా మారబోతోంది.
భారంగా కాకుండా వరంగా మార్చుకోవచ్చా?
పెరుగుతున్న ఆయుర్దాయాన్ని కేవలం ఒక ఆర్థిక సమస్యగానే చూడాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ప్రాధాన్యం ఇస్తూ, వారి అనుభవాన్ని వినియోగించుకునేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తే వయోధికులను దేశ ఆర్థిక బలంగా మార్చవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగాలు, పరిశ్రమల్లో సరైన సంస్కరణలు తెస్తే ఈ మార్పును ఒక అవకాశంగా మలుచుకోవచ్చని ప్రముఖ జనాభా విశ్లేషకులు సూచిస్తున్నారు.




