Hormuz Strait : 24 గంటల్లో దాటింది కేవలం 15 నౌకలే.. హోర్ముజ్ జలసంధిలో స్తంభించిన రవాణా

Hormuz Strait : హోర్ముజ్ స్ట్రెయిట్‌ను ఇరాన్ దిగ్బంధించడంతో ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. మంగళవారం రాత్రి 8 గంటల లోపు మార్గాన్ని తెరవకుంటే ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

CR Reddy
Published on: 6 April 2026 8:09 AM IST
Hormuz Strait
X

Hormuz Strait 

Hormuz Strait : పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హోర్ముజ్ స్ట్రెయిట్ (Hormuz Strait) ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారింది. గత కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, పరిస్థితి ఎప్పుడైనా చేయి దాటిపోయేలా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గం ద్వారా జరిగే చమురు వ్యాపారంలో దాదాపు 20 నుంచి 25 శాతం వాటా ఒక్క హోర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. అయితే, ప్రస్తుతం ఇక్కడ రాకపోకలు దాదాపు 90 శాతం పడిపోయాయి. గత 24 గంటల్లో కేవలం 15 నౌకలు మాత్రమే ఈ మార్గాన్ని దాటగలిగాయి. అది కూడా ఇరాన్ అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే వాటిని అనుమతించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం పొంచి ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్‌కు చివరి హెచ్చరిక జారీ చేశారు. "మంగళవారం రాత్రి 8:00 గంటలకు (ఈస్టర్న్ టైమ్) ఇరాన్‌లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే.. అంతా ఒకేసారి జరుగుతుంది" అంటూ భీకర పోస్ట్ చేశారు. అంటే, మంగళవారం రాత్రి కల్లా హోర్ముజ్ మార్గాన్ని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, కీలక వంతెనలను అమెరికా సైన్యం బాంబులతో నేలమట్టం చేస్తుందని ఆయన పరోక్షంగా వెల్లడించారు. ఇరాన్ నాయకులను ఉద్దేశించి "పిచ్చివాళ్లారా.. దారి ఇవ్వండి, లేదంటే నరకం చూస్తారు" అంటూ ట్రంప్ హెచ్చరించడం సంచలనంగా మారింది.

ఈ ఉద్రిక్తతలకు బీజం ఫిబ్రవరి 28న పడింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త సైనిక దాడుల్లో ఇరాన్ అతలాకుతలమైంది. ఈ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతో సహా పలువురు ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద 1,340 మందికి పైగా మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. తమ దేశంపై జరిగిన ఈ అన్యాయానికి ఇరాన్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటోంది. డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్, జోర్డాన్, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ నిరంతరం దాడులు చేస్తూనే ఉంది.

ఒకవేళ యుద్ధం గనుక ముదిరితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హోర్ముజ్ మార్గాన్ని ఇరాన్ పూర్తిగా మూసివేస్తే చమురు సరఫరా నిలిచిపోయి, పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో టెన్షన్ నెలకొంది. ఇరాన్ చేస్తున్న ప్రతిదాడి అమెరికా సహనాన్ని పరీక్షిస్తోంది. ఈ వివాదం శాంతియుతంగా పరిష్కారమవుతుందా లేక మంగళవారం రాత్రి ప్రపంచం మరో యుద్ధాన్ని చూడబోతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

CR Reddy

CR Reddy

Next Story