ప్రపంచ దేశాలకు ఐఈఏ సంచలన హెచ్చరిక.. 'రెడ్ జోన్' లోకి చమురు మార్కెట్లు.. త్వరలోనే పెట్రో గండం!

Global Energy Crisis: ప్రపంచ దేశాలకు అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) సంచలన హెచ్చరిక జారీ చేసింది. చమురు మార్కెట్లు 'రెడ్ జోన్' లోకి వెళ్తున్నాయని, జులై-ఆగస్టు నాటికి తీవ్ర ఇంధన సంక్షోభం తప్పదని స్పష్టం చేసింది.

Arun Chilukuri
Published on: 22 May 2026 11:50 AM IST
Global Energy Crisis
X

ప్రపంచ దేశాలకు ఐఈఏ సంచలన హెచ్చరిక.. 'రెడ్ జోన్' లోకి చమురు మార్కెట్లు.. త్వరలోనే పెట్రో గండం!

Global Energy Crisis: ప్రపంచవ్యాప్తంగా ఇంధన నిల్వలు వేగంగా క్షీణిస్తుండటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకరమైన 'రెడ్ జోన్' లోకి వెళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) సంచలన హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే సీజన్‌లో అంతర్జాతీయంగా ప్రయాణాల డిమాండ్ భారీగా పెరగనుండటం, అదే సమయంలో చమురు సరఫరా నిలిచిపోవడంతో మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉందని ఐఈఏ చీఫ్‌ ఫాతిహ్‌ బిరోల్‌ స్పష్టం చేశారు. లండన్‌లో నిర్వహించిన ‘ప్రపంచ ఇంధన భద్రత ప్రత్యేక సదస్సు’లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

పశ్చిమాసియాలో, ముఖ్యంగా ఇరాన్ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు మరియు యుద్ధ వాతావరణం కారణంగానే ఈ అంతర్జాతీయ ఇంధన సంక్షోభం తలెత్తిందని ఫాతిహ్‌ బిరోల్ విశ్లేషించారు. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే.. గ్లోబల్ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) ని ఎలాంటి షరతులు లేకుండా, పూర్తిగా తిరిగి తెరవడమే ఏకైక పరిష్కార మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ప్రపంచ సరఫరాను శాసించే ఈ జలసంధిని యథాతథంగా తెరవడంలో విఫలమైతే.. గ్లోబల్ చమురు సరఫరా లింక్ పూర్తిగా కట్ అవుతుందని, దీనివల్ల వివిధ దేశాల్లో ఉన్న అత్యవసర చమురు నిల్వలు (Emergency Oil Reserves) అట్టడుగు స్థాయికి పడిపోతాయని ఆయన వివరించారు.

సంక్షోభానికి దారితీస్తున్న ప్రధాన కారణాలు:

కరిగిపోతున్న మిగులు నిల్వలు: ఈ ఇంధన సంక్షోభం ప్రారంభంలో ప్రపంచ దేశాల వద్ద అవసరానికి మించి మిగులు చమురు నిల్వలు ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల అవి వేగంగా అడుగంటుతున్నాయి.

సమ్మర్ డిమాండ్ ఎఫెక్ట్: రాబోయే వేసవి కాలంలో ప్రయాణాలు విపరీతంగా పెరగనుండటంతో ఇంధనానికి డిమాండ్ ఊహించని రేంజ్‌లో భారీగా పెరగనుంది.

ఐఈఏ చీఫ్ హెచ్చరిక:

సరఫరా నిలిచిపోవడం, డిమాండ్ విపరీతంగా పెరగడం అనే ఈ రెండు కారణాల వల్ల రాబోయే జులై లేదా ఆగస్టు నెలల నాటికి ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.

భారత్‌పై పడనున్న ప్రభావం:

అంతర్జాతీయంగా ముదురుతున్న ఈ ఇంధన సంక్షోభం కారణంగా భారత్ లాంటి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు పెరిగితే.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల భారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది రవాణా రంగంపై ప్రభావం చూపి, పరోక్షంగా ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల)కు దారితీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story