Global Energy Crisis: భయపెడుతున్న గ్లోబల్ రిపోర్ట్ః మరింత తీవ్రమౌతున్న ఇంధన సంక్షోభం
అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూతపడటం ప్రపంచ ఇంధన చరిత్రలోనే అత్యంత ఘోరమైన సంక్షోభానికి దారితీసింది.
Global Energy Crisis: అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూతపడటం ప్రపంచ ఇంధన చరిత్రలోనే అత్యంత ఘోరమైన సంక్షోభానికి దారితీసింది. ముఖ్యంగా భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలతో పాటు మరికొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ దెబ్బకు కుప్పకూలే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరిస్తోంది.
అగ్రరాజ్యాల వద్ద నిల్వలు.. పేద దేశాల్లో కొరత
ప్రస్తుతం ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ లోని 32 సభ్య దేశాల వద్ద ఉన్న 120 కోట్ల బారెళ్ల అత్యవసర నిల్వలను బయటకు తీస్తున్నాయి. అయితే, ప్రపంచ జనాభాలో కేవలం 16 శాతం ఉన్న ఈ దేశాల వద్ద నిల్వలు పుష్కలంగా ఉంటే, మిగిలిన 70 శాతానికి పైగా జనాభా నివసించే దేశాల పరిస్థితి దారుణంగా ఉంది. పాకిస్తాన్‌లో చమురు నిల్వలు కేవలం ఐదు నుంచి ఏడు రోజులకు మాత్రమే సరిపోతాయి. ఇక ఇండోనేషియా, వియాత్నంలో నెలరోజులకు సరిపడా నిల్వలు ఉన్నట్టుగా సమాచారం. అయితే, చైనాలో ఏకంగా 140 కోట్ల బ్యారెట్ల చమురు నిల్వలు ఉన్నాయి. చమురును ఉత్పత్తి చేసే అమెరికా, సౌదీ అరేబియా కంటే అధికం అని చెప్పవచ్చు. ఇటు భారత్ కూడా రెండు మూడు నెలలకు సరిపడా చమురు నిల్వలను కలిగి ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ చౌక ధరకు చమురు లభిస్తుందో అక్కడి నుంచి చమురును పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నది. నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారీ బావులను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది.
ఎందుకు ఈ వివక్ష?
ధనిక దేశాలు తమ అవసరాల కోసం కనీసం 90 రోజుల నిల్వలను 'స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్' రూపంలో ఉంచుకుంటాయి. కానీ, పేద దేశాలకు ఇది ఒక 'విలాసం' లాంటిది. అప్పుల ఊబిలో ఉన్న దేశాలు బిలియన్ల డాలర్లు పెట్టి చమురును నిల్వ చేయడం కంటే, ఆహార దిగుమతులకు, సబ్సిడీలకే ప్రాధాన్యత ఇస్తాయి. ఫలితంగా, అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు ఈ దేశాలే ముందుగా బలి అవుతున్నాయి. చమురు సంక్షోభం కారణంగా ఆసియా దేశాల ఆర్థిక వృద్ధి రేటును 5.1% నుండి 4.7%కి తగ్గించడం దీని తీవ్రతను తెలియజేస్తోంది. ఎంతోకొంత అభివృద్ధి చెందిన ఆసియా దేశాలతో పోలిస్తే ఆఫ్రికా దేశాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
పరిష్కారం ఏమిటి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, చమురుపై ఆధారపడటం తగ్గించడమే ఏకైక మార్గం. చమురుపై ఆధారపడటం తగ్గించి సోలార్, విండ్ పవర్ వంటి రంగాలపై ప్రధానంగా దృష్టిసారించాలి. ఆఫ్రికా దేశాల్లో ఎంత తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సోలర్ పవర్‌ను అక్కడ ఎక్కువగా వినియోగిస్తే చమురు దిగుముతుల అవసరాలు తగ్గిపోతాయి. అంతేకాదు, చమురు సంక్షోభం సమయంలో ప్రాంతీయ సహకారం కూడా ఉండాలి. దక్షిణాసియా, ఏషియన్ దేశాలు కలిసి ఉమ్మడిగా చమురు నిల్వలలను ఏర్పాటు చేసుకొని సంక్షోభం సమయంలో సహకరించుకుంటే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చు. అదేవిధంగా అనవసరమైన సబ్సిడీలను వీలైనంత వరకు తగ్గించి ఇంధన పొదుపుపై దృష్టిసారించాలని నిపుణులు చెబుతున్నారు.




