Global Oil Prices Drop: కుప్పకూలిన చమురు ధరలు... ఊపిరి పీల్చుకున్న ప్రపంచం

Global Oil Prices Drop: పశ్చిమాసియాలో ఉత్కంఠగా కొనసాగిన ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఓ విధంగా ఆందోళనకు గురిచేశాయి.

Balachander
Published on: 8 April 2026 8:47 AM IST
Global Oil Prices Drop
X

Global Oil Prices Drop: కుప్పకూలిన చమురు ధరలు... ఊపిరి పీల్చుకున్న ప్రపంచం

Global Oil Prices Drop: పశ్చిమాసియాలో ఉత్కంఠగా కొనసాగిన ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఓ విధంగా ఆందోళనకు గురిచేశాయి. అయితే, ఒక్కసారిగా వచ్చిన శాంతి సదేశం గ్లోబల్‌ ఇంధన మార్కెట్‌కు ఊరటనిచ్చింది. రెండు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుదేలయ్యాయి.

భారీగా తగ్గిన ధరలు

రెండు వారాల శాంతి ఒప్పందంతో చమురు ధరలు దిగొచ్చాయి. సుమారు 15 శాతం వరకు ధరలు పడిపోయినట్టు సమాచారం. ఇటీవల బ్యారెల్‌ ధర 100 డాలర్లకు పైగా వెళ్లగా...పలు దేశాల్లో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఇప్పుడు శాంతి ఒప్పందం తరువాత 15 శాతం తగ్గడంతో ఆయా దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. చమురుకు జీవనాడిగా భావించే హోర్ముజ్‌ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో ఈ మార్గం ద్వారా 20 శాతం చమురు రవాణా జరిగేందుకు మార్గం సుగమమైంది. యుద్ధభయంతో నిలిచిపోయిన ఆయిల్‌ ట్యాంక్‌ నౌకలు తిరిగి ప్రయాణం కొనసాగించనున్నాయి. నిలిచిపోయిన రవాణా తిరిగి ప్రారంభమైంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మార్కెట్లు ఒక్కసారిగా సానుకూలంగా మారాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 15.19% తగ్గి బ్యారెల్‌కు 92.67 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ 15.02% తగ్గి 96.03 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ తగ్గుదల కేవలం మార్కెట్ రియాక్షన్ మాత్రమే కాదు… ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక తాత్కాలిక ఊరటగా మారింది.

పాక్‌ మధ్యవర్తిత్వం

ఈ ఒప్పందం వెనుక పాకిస్థాన్ మధ్యవర్తిత్వం కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య సంభాషణలు సాగి, కనీసం రెండు వారాల పాటు దాడులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో ఇరాన్ నౌకలకు సురక్షిత మార్గం కల్పిస్తామని హామీ ఇవ్వడం మరింత విశ్వాసాన్ని పెంచింది. ఫిబ్రవరి నుంచి చమురు మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. ఏప్రిల్ నాటికి రోజుకు 9 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి దెబ్బతింటుందని అంచనాలు వెలువడ్డాయి. దీంతో ధరలు మరింత పెరుగుతాయని భావించిన సమయంలో ఈ కాల్పుల విరమణ వార్త మార్కెట్‌ను స్థిరపరిచింది.

ద్రవ్యోల్భణంపై ప్రభావం

ఇది కేవలం చమురు ధరలకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై, రవాణా ఖర్చులపై, ద్రవ్యోల్బణంపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు ఇది ఒక శుభ సూచికం. ఎందుకంటే మన దేశం తన అవసరాల కోసం ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటుంది. అయితే, ఈ శాంతి పూర్తిగా స్థిరపడిందని అనుకోవడం తొందరపాటు అవుతుంది. ఇది కేవలం రెండు వారాల తాత్కాలిక ఒప్పందం మాత్రమే. ఈ కాలంలో పరిస్థితులు ఎలా మారుతాయన్నది కీలకం. చర్చలు సజావుగా సాగితే ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. కానీ మళ్లీ ఉద్రిక్తతలు పెరిగితే మార్కెట్ తిరిగి అస్తవ్యస్తం కావచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ పరిణామం ప్రపంచానికి ఒక చిన్న ఉపశమనం మాత్రమే. శాంతి నిలకడగా కొనసాగితేనే దీని అసలు లాభాలు అందరికీ చేరుతాయి. అంతవరకు… ఇంధన మార్కెట్‌పై ప్రపంచం కన్నేసి ఉండాల్సిందే.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story