Donald Trump : అమెరికా గుత్తాధిపత్యానికి 'ది ఎండ్'.. ట్రంప్‌ను కోలుకోలేని దెబ్బకొట్టిన 3 దేశాలు
Donald Trump : రష్యా, చైనా, ఇరాన్ కూటమి వ్యూహాల వల్ల అమెరికా గ్లోబల్ గుత్తాధిపత్యం ముగింపు దశకు చేరింది. ట్రంప్ విఫల విధానాల వల్ల ఇరాన్, ఉక్రెయిన్ ముఖద్వారాల్లో అమెరికా ఒంటరైంది.
Donald Trump
Donald Trump : ప్రపంచాన్ని దశాబ్దాలుగా శాసిస్తూ సూపర్ పవర్‌గా వెలుగొందిన అమెరికా హవా ఇప్పుడు ముగింపు దశకు చేరుకుందా? అంటే అంతర్జాతీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విఫల గ్లోబల్ పాలసీల వల్ల అమెరికా అగ్రరాజ్య హోదా మసకబారుతోంది. ఒక యుద్ధం, రెండు రంగాలు, ముగ్గురు పవర్‌ఫుల్ లీడర్లు.. అమెరికా ఆధిపత్యాన్ని సమాధి చేసేందుకు తెర వెనుక ఒక భారీ వ్యూహాన్ని అమలు చేశారు. రష్యా, చైనా, ఇరాన్ దేశాలు చేతులు కలపడం వల్ల గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అమెరికా పెడుతున్న షరతులను గానీ, ఇస్తున్న బెదిరింపులను గానీ ఇరాన్, రష్యాలు అస్సలు ఖాతరు చేయడం లేదు.
ట్రంప్‌ను బలిపశువును చేసిన ఇరాన్
ఇరాన్ పై దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, వాస్తవానికి ఇరాన్ జోలికి వెళ్లడానికి అమెరికా భయపడుతోంది. ఎందుకంటే, తెరవెనుక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీలు కలిసి అమెరికాకు ఒక పెద్ద అంతర్జాతీయ చక్రవ్యూహాన్ని సిద్ధం చేశారు. ఇటీవలి 40 రోజుల ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల తర్వాత, అరబ్ దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమెరికా పట్ల ఉన్న భయం పూర్తిగా పోయింది. ఒకప్పుడు అమెరికా మాటకు ఎదురుచెప్పని దేశాలు సైతం.. ఇప్పుడు ట్రంప్ బెదిరింపులకు భయపడటం లేదు.
ఉక్రెయిన్, ఇరాన్ వేర్వేరు కావు..
పైన చూడటానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇటు ఇరాన్ అమెరికా వివాదం వేర్వేరుగా కనిపిస్తున్నా, లోపల మాత్రం ఇవి రెండూ ఒకే యుద్ధంగా మారిపోయాయి. అమెరికాకు బుద్ధి చెప్పడానికి రష్యా తన అత్యున్నత మిలిటరీ ఇంటెలిజెన్స్‌ను ఇరాన్‌కు ఉచితంగా ఇస్తోంది. దీనివల్ల అమెరికా ఫైటర్ జెట్లు ఏ ఎత్తులో వస్తాయి, వాటి దాడి ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇరాన్ కమాండర్లకు ముందే తెలిసిపోతోంది. దీనికి ప్రతిఫలంగా ఇరాన్ తన అత్యంత ప్రమాదకరమైన షాహెడ్ డ్రోన్లను రష్యాకు భారీగా సరఫరా చేస్తోంది. వీటి సాయంతోనే పుతిన్ ఉక్రెయిన్ భూభాగాన్ని క్షిపణులతో దహనం చేస్తున్నారు. అంటే ఒకరికొకరు సాయం చేసుకుంటూ అమెరికా కూటమిని చావుదెబ్బ కొడుతున్నారు.
చైనా నుంచి ఆయుధాల ముడిసరుకు..
ఈ ముగ్గురి కూటమిలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అత్యంత చాణక్యంగా వ్యవహరిస్తున్నారు. నేరుగా యుద్ధంలోకి రాకుండా.. రష్యా, ఇరాన్ దేశాలు అత్యాధునిక ఆయుధాలు, క్షిపణులు తయారు చేసుకోవడానికి అవసరమైన కీలక విడిభాగాలు, చిప్స్, ముడిసరుకును చైనా నుంచే రహస్యంగా సప్లై చేస్తున్నారు. చైనా ఇస్తున్న ఆర్థిక, సాంకేతిక మద్దతుతోనే రష్యా, ఇరాన్‌లు సరికొత్త ఆయుధాల డిపోలను సిద్ధం చేసుకున్నాయి. ఫలితంగా, మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అత్యంత కీలకమైన అంతర్జాతీయ వాణిజ్య మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను కూడా అమెరికా తన అదుపులోకి తీసుకోలేక, ఇరాన్ ముందు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది.
నాటో దేశాలను దూరం చేసుకున్న ట్రంప్..
అమెరికా ఇలా ఒంటరిగా మారడానికి స్వయంగా ట్రంప్ తీసుకున్న సొంత నిర్ణయాలే కారణం. నాటో కూటమి, ఐరోపా దేశాలపై ట్రంప్ మొదటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారి నుంచి రక్షణ నిధులు డిమాండ్ చేస్తూ సంబంధాలను చెడగొట్టుకున్నారు. ఫలితంగా ఇరాన్‌తో జరిగిన ఈ ఘర్షణల్లో నాటోలోని ఏ ఒక్క శక్తివంతమైన దేశం కూడా అమెరికాకు మద్దతుగా రాలేదు. అటు ఉక్రెయిన్ విషయంలో రష్యా ఏకపక్షంగా దూసుకుపోతుంటే.. జెలెన్స్కీని బెదిరించడం మినహా ట్రంప్ ఏమీ చేయలేకపోతున్నారు. ఈ అంతర్జాతీయ వైఫల్యాల వల్ల డొనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్ అమెరికాలోనే ఘోరంగా పడిపోయింది. యుద్ధం వల్ల అమెరికా గెలవకపోగా.. ఇరాన్, ఉత్తర కొరియా లాంటి దేశాల ధైర్యం మరింత పెరిగిందని, కిమ్ జోంగ్ ఉన్ లాంటి వాళ్లు కూడా ఇప్పుడు అమెరికాపై యుద్ధానికి సై అంటున్నారని స్వయంగా అమెరికా ప్రజలే ట్రంప్ పై తిరగబడుతున్నారు.




