Pandemic Warning 2026 : కరోనాను మించిన ఘోరకలి.. ప్రపంచం వినాశనానికి అంచున ఉందా?

Pandemic Warning 2026 : WHO, వరల్డ్ బ్యాంక్ మద్దతుతో జీపీఎంబీ ‘ఏ వరల్డ్ ఆన్ ది ఎడ్జ్’ నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ సహకారం తగ్గడం వల్ల కొత్త వైరస్ వస్తే కరోనాను మించిన విధ్వంసం తప్పదని హెచ్చరించింది.

CR Reddy
Published on: 21 May 2026 7:12 AM IST
Pandemic Warning 2026
X

Pandemic Warning 2026 

Pandemic Warning 2026 : కోవిడ్ మహమ్మారి సృష్టించిన మారణహోమం నుంచి ప్రపంచం ఇంకా కోలుకోకముందే, మానవాళిని వణికించే మరో షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ బ్యాంక్ సంయుక్త మద్దతుతో పనిచేసే గ్లోబల్ ప్రిపేర్డ్‌నెస్ మానిటరింగ్ బోర్డ్ (GPMB) తాజాగా ఏ వరల్డ్ ఆన్ ది ఎడ్జ్ పేరుతో ఒక అత్యంత ఆందోళనకరమైన నివేదికను విడుదల చేసింది. కరోనా తర్వాత ప్రపంచ దేశాలు గుణపాఠాలు నేర్చుకుని ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తాయని అంతా భావించారు. కానీ, అందుకు భిన్నంగా అంతర్జాతీయ సహకారం పూర్తిగా అట్టడుగుకు పడిపోయిందని, వ్యాక్సిన్ల పంపిణీలో వివక్ష పెరిగిందని ఈ నివేదిక బట్టబయలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో గనుక మరో కొత్త వైరస్ దాడి చేస్తే, మునుపటి కంటే కోట్లాది రెట్లు ఎక్కువ విధ్వంసం తప్పదని శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

ఆఫ్రికాలో ఎబోలా కొత్త స్ట్రెయిన్ అరాచకం

ఈ అంతర్జాతీయ హెచ్చరికలు వస్తున్న తరుణంలోనే ఆఫ్రికా ఖండం నుంచి మరో ప్రమాదకర వార్త వెలుగుచూసింది. మధ్య ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా దేశాలలో బుండిబుగ్యో అనే అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన ఎబోలా కొత్త స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఎంతవరకు ప్రాణాలు తీయగలదనే దానిపై శాస్త్రవేత్తలకే ఇంకా పూర్తి స్పష్టత లేదు. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఏటా వన్యప్రాణుల నుంచి మనుషులకు సోకే బర్డ్ ఫ్లూ ముప్పు పెరుగుతోందని, ఎప్పుడు ఏ మూల నుంచి 'హంటావైరస్' లాంటి మహమ్మారులు దాడి చేస్తాయో చెప్పలేమని నిపుణులు భయపడుతున్నారు.

అడవుల నరికివేత, విమాన ప్రయాణాలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, అడవుల నరికివేత కారణంగా వన్యప్రాణులు తమ ఆవాసాలను కోల్పోయి మనుషుల నివాస ప్రాంతాలకు దగ్గరవుతున్నాయి. దీనివల్ల జంతువుల శరీరాల్లో ఉండే వింత వైరస్‌లు మనుషుల్లోకి ఈజీగా దూకే అవకాశాలు రెట్టింపు అయ్యాయి. దీనికి తోడు విపరీతంగా పెరిగిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, వలసల కారణంగా.. ప్రపంచంలో ఏదో ఒక మారుమూల గ్రామంలో పుట్టే సరికొత్త వైరస్ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఖండాలు దాటి ప్రపంచమంతటా విస్తరించేలా గ్లోబల్ కనెక్టివిటీ మారిపోయింది.

ధనిక దేశాల బండారం బట్టబయలు

కరోనా సంక్షోభ సమయంలో ధనిక దేశాలు వ్యాక్సిన్లను భారీగా కొనుగోలు చేసి దాచుకోగా, పేద దేశాలు నెలల తరబడి శవాల దిబ్బలుగా మారినా మందుల కోసం ఎదురుచూశాయి. ఇప్పుడు ఎంపాక్స్ వైరస్ విషయంలోనూ అదే పచ్చి నిజం పునరావృతమైంది. ఆఫ్రికాలోని పేద దేశాలకు ఎంపాక్స్ వ్యాక్సిన్లు చేరడానికి ఏకంగా రెండేళ్ల సమయం పట్టిందంటే, అంతర్జాతీయ సమాజంలో పేద దేశాల ప్రజల ప్రాణాలకు ఎంత తక్కువ విలువ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చని నివేదిక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యాక్సిన్ అసమానత రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ముంచడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆరోగ్య సంక్షోభం మాత్రమే కాదు

రాబోయే మహమ్మారులు కేవలం మనుషుల ప్రాణాలు తీయడమే కాకుండా, దేశాలలో తీవ్రమైన రాజకీయ అస్థిరతను, ప్రజాస్వామ్య వ్యవస్థల పతనాన్ని శాసిస్తాయని ఈ నివేదిక హెచ్చరించింది. కోవిడ్ సమయంలో సోషల్ మీడియా వేదికగా వ్యాపించిన ఫేక్ న్యూస్, వ్యాక్సిన్లపై జరిగిన దుష్ప్రచారం వల్ల ప్రజలకు ప్రభుత్వాలపై, సైంటిస్టులపై నమ్మకం పోయింది. భవిష్యత్తులో వచ్చే కొత్త వైరస్ గనుక వస్తే, అది ప్రజల్లో అవిశ్వాసాన్ని మరింత పెంచి, సామాజిక విభజనలు సృష్టించి, దేశాల సార్వభౌమత్వాన్ని, ఆర్థిక వ్యవస్థలను నిలువునా కూల్చగలదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మన హెల్త్ సిస్టమ్ సరిపోతుందా?

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ అందక హాస్పిటల్స్ ముందు రోగుల ప్రాణాలు పోవడం, శ్మశానాల్లో స్థలం లేక రాత్రింబగళ్లు సాగిన దహనాల భయానక దృశ్యాలు భారతీయుల మదిలో ఇంకా సజీవంగానే ఉన్నాయి. అయినప్పటికీ, దేశ ఆరోగ్య వ్యవస్థలో ఇంకా భారీ లోపాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత, బలహీనమైన డిసీజ్ సర్వైలెన్స్ (వ్యాధి పర్యవేక్షణ) వ్యవస్థలు, ఎమర్జెన్సీ ఫండ్స్ విడుదలలో జాప్యం పెద్ద మైనస్‌లుగా మారాయి. మన దేశంలో ఉన్న భారీ జనాభా, కిక్కిరిసిన నగరాలు, అంతరాష్ట్ర వలసల కారణంగా భారతదేశం భవిష్యత్ మహమ్మారులకు అత్యంత సులభంగా గురయ్యే ప్రమాదం ఉంది.

వైరస్ గుర్తింపునకు AI టెక్నాలజీ

ఈ నివేదికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంపై ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. సోషల్ మీడియా పోస్టులు, ఆసుపత్రుల రిపోర్టులు, అంతర్జాతీయ ప్రయాణాల డేటాను ఏఐ ద్వారా విశ్లేషించి.. ఒక కొత్త వైరస్ ఎక్కడ పుట్టింది, ఎలా వ్యాపిస్తుందో ముందే అంచనా వేయవచ్చు. కానీ, ఈ అడ్వాన్స్‌డ్ ఏఐ టెక్నాలజీ కూడా కేవలం ధనిక దేశాల సొత్తయితే పేద దేశాలు మరింత నష్టపోతాయి. అంతేకాకుండా, మహమ్మారి సమయంలో సమాజంలో లేనిపోని భయాలను సృష్టించేందుకు, తప్పుడు సమాచారాన్ని క్షణాల్లో వైరల్ చేయడానికి కూడా ఏఐ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని నివేదిక నిష్కర్షగా తేల్చేసింది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా అడుగులు వేయకపోతే మానవాళికి అంతిమ ఘడియలు తప్పవు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story