Guinea Landslide: కొండచరియల్లా విరిగిపడ్డ చెత్త కుప్పలు..30 మంది సజీవసమాధి
Guinea Landslide: గిని రాజధాని కోనాక్రీలో ఊహించని భయంకర ప్రమాదం సంభవించింది.
Guinea Landslide
Guinea Landslide: గిని రాజధాని కోనాక్రీలో ఊహించని భయంకర ప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి నగరంలోని అతిపెద్ద చెత్త డెంపింగ్ యార్డు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిద్రిస్తున్న పేదల గుడిసెలపై ఈ చెత్త కొండచరియల్లా విరుచుకుపడటంతో 30 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కోనాక్రీ నగరంలో ఉన్న దార్ ఎస్ సలామ్ అనే ప్రధాన చెత్త డెంపింగ్ యార్డు వద్ద ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో భారీ వర్షం ప్రారంభమైంది. విపరీతమైన నీటి ఉధృతికి అక్కడ ఏళ్లుగా పేరుకుపోయిన రాకాసి చెత్త కుప్పలు ఒక్కసారిగా జారిపడ్డాయి. ఆ కొండచరియల దాడికి సమీపంలో ఉన్న పేదల గుడిసెలు, తాత్కాలిక నివాసాలు పూర్తిగా మట్టి, చెత్త కుప్పల కింద సమాధి అయిపోయాయి. గాఢ నిద్రలో ఉన్న బాధితులకు కోలుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
ముమ్మరంగా సహాయక చర్యలు
సమాచారం అందుకున్న తక్షణమే మిలిటరీ ఇంజనీరింగ్ విభాగం, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మట్టి, చెత్త కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు జేసీబీలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే అధికారులు ఆదివారమే ఈ డెంపింగ్ యార్డును శాశ్వతంగా మూసివేసేందుకు సిద్ధమైన సమయంలోనే ఈ విషాదం జరగడం గమనార్హం.
నోటీసులు ఇచ్చినా తప్పని ప్రమాదం
డెంపింగ్ యార్డు ప్రమాదకరంగా మారడంతో దాని చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు అధికారులు ముందే ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. ఆ హెచ్చరికలతో చాలా కుటుంబాలు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయాయి. అయినప్పటికీ కొందరు పేదలు అక్కడ నివసిస్తుండటంతో ఈ ఘోరం జరిగింది. మిగిలిన అన్ని కుటుంబాలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని ఆ దేశ ప్రాంతీయ పాలన శాఖ మంత్రి డీనాబూ టురే వెల్లడించారు.
ఖనిజాల గనిలో పేదరికం కోరలు
గిని దేశం బాక్సైట్ నిల్వల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇనుము, బంగారం, వజ్రాలు వంటి అత్యంత విలువైన ఖనిజ సంపద ఈ దేశ సొంతం. అయినప్పటికీ ప్రపంచ బ్యాంక్ నివేదికల ప్రకారం ఇక్కడ 43.7 శాతం మంది ప్రజలు తీవ్ర పేదరికంలోనే మగ్గుతున్నారు. సరైన నివాస వసతులు లేక ఇలాంటి ప్రమాదకరమైన చెత్త డెంప్‌ల వద్ద గుడిసెలు వేసుకుని బతుకుతుండటం శోచనీయం. భారీ వర్షాలు, సరైన నిర్వహణ లేని చెత్త డెంపింగ్ యార్డులు పేదల ప్రాణాలను ఎలా తీస్తాయో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. అక్కడి ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంతో పాటు నివాసాలు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.




