Hormuz: హోర్ముజ్‌కు బైపాస్.. కొత్త చమురు పైప్‌లైన్‌లపై గల్ఫ్ దేశాల ఫోకస్
హోర్ముజ్ జలసంధిపై ఆధారాన్ని తగ్గించేందుకు గల్ఫ్ దేశాలు కొత్త చమురు పైప్‌లైన్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నాయి.
Gulf Nations Speed Up Oil Pipelines to Bypass Hormuz
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధిపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో మధ్యప్రాచ్య చమురు ఉత్పత్తి దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భవిష్యత్తులో హోర్ముజ్ జలసంధిపై ఆధారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చమురు పైప్‌లైన్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నాయి.
ప్రభుత్వ అధికారులు, చమురు సంస్థలు, మార్కెట్ విశ్లేషకుల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఏడు ప్రధాన పైప్‌లైన్ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉండగా, మరికొన్ని ప్రణాళికల్లో ఉన్నాయి. వీటి ద్వారా చమురును ఎర్ర సముద్రం (Red Sea), సూయజ్ కాలువ (Suez Canal), ఒమన్ గల్ఫ్ తీరంలోని పోర్టులకు తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇరాన్‌పై యుద్ధ పరిస్థితులు నెలకొనే ముందు రోజుకు సుమారు 1.5 కోట్ల బ్యారెళ్ల చమురు హోర్ముజ్ జలసంధి గుండా ప్రపంచ మార్కెట్లకు చేరేది. అయితే భవిష్యత్తులో ఆ చమురులో పెద్ద భాగాన్ని హోర్ముజ్‌ను దాటకుండా ఇతర మార్గాల ద్వారా ఎగుమతి చేసే లక్ష్యంతో గల్ఫ్ దేశాలు బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి.
యూఏఈ, సౌదీ భారీ ప్రాజెక్టులు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన అబుదాబి జాతీయ చమురు సంస్థ 3 బిలియన్ డాలర్ల వ్యయంతో 300 కిలోమీటర్ల కొత్త పైప్‌లైన్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఫుజైరా పోర్టుకు రోజుకు అదనంగా 12 లక్షల బ్యారెళ్లకు పైగా చమురు తరలించే సామర్థ్యం పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇక సౌదీ అరేబియా ఇప్పటికే ఏర్పాటు చేసిన ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ద్వారా అబ్‌కైక్ నుంచి ఎర్ర సముద్ర తీరంలోని యన్‌బు పోర్టుకు చమురును తరలిస్తోంది. ప్రస్తుతం ఈ పైప్‌లైన్ దాదాపు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది.
ఇరాక్ కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
హోర్ముజ్ జలసంధిపై అధికంగా ఆధారపడుతున్న ఇరాక్ కూడా కొత్త ఎగుమతి మార్గాలపై దృష్టి పెట్టింది. బస్రా నుంచి టర్కీలోని సేహాన్ పోర్టు, అలాగే సిరియాలోని బనియాస్ పోర్టు వరకు పైప్‌లైన్ నిర్మాణంపై ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు జోర్డాన్‌లోని అకాబా పోర్టుకు కూడా చమురును తరలించే మార్గాలపై చర్చలు కొనసాగుతున్నాయి.
హోర్ముజ్‌కు ప్రత్యామ్నాయాలు ఉన్నా.. ముప్పు మాత్రం కొనసాగుతుంది
హోర్ముజ్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని నిపుణులు చెబుతున్నారు. యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఎర్ర సముద్ర మార్గంలో ఇప్పటికే దాడులు జరపడంతో కొత్త పైప్‌లైన్ మార్గాల భద్రత కూడా సవాల్‌గా మారిందని హెచ్చరిస్తున్నారు.
పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ సాక్స్ అంచనా ప్రకారం 2028 చివరి నాటికి కొత్త పైప్‌లైన్‌ల ద్వారా రోజుకు 73 లక్షల బ్యారెళ్ల చమురు హోర్ముజ్‌ను దాటకుండా ఎగుమతి చేసే సామర్థ్యం ఏర్పడే అవకాశం ఉంది.




