Gulf Power Play: గల్ఫ్‌లో సరికొత్త ఆట... టెహ్రాన్, యూఏఈ మధ్య దోబూచులాట
గల్ప్‌దేశాల మధ్య ఇప్పుడు సరికొత్త ఆట మొదలైంది. ఒపెక్ వేదికగా వేగంగా పావులు కదుపుతున్నాయి దేశాలు. ఒపెక్ కూటమిలో పెద్ద తలకాయగా ఉన్న యూఏఈ తప్పుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
Gulf Power Play: గల్ప్‌దేశాల మధ్య ఇప్పుడు సరికొత్త ఆట మొదలైంది. ఒపెక్ వేదికగా వేగంగా పావులు కదుపుతున్నాయి దేశాలు. ఒపెక్ కూటమిలో పెద్ద తలకాయగా ఉన్న యూఏఈ తప్పుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొదటిది కూటమిలో సౌదీ అరేబియా కీలకంగా వ్యవహిరిస్తుండటం. రెండోది... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు కారణమైన ఇరాన్ కూడా ఒపెక్ కూటమిలో భాగంగా ఉండటం, ఒపెక్ నిర్ణయాల్లో భాగస్వామి కావడం. ఈరెండింటిని దృష్టిలో ఉంచుకొని యూఏఈ ఈ కూటమి నుంచి బయటకు వచ్చింది.
సౌదీతో విబేధం
గల్ఫ్ దేశాలన్నీ అరబ్ దేశాలే. ముస్లింల పరిపాలిత దేశాలే. కానీ, ఈ దేశాల మధ్య కూడా విబేధాలు ఉన్నాయి. ఒకరంటే మరొకరికి పడదు. ముఖ్యంగా యూఏఈ, సౌదీ అరేబియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. యూఏఈ అభివృద్ధి చెందిన దేశంగా, ఫ్యాషన్ ప్రపంచాన్ని, క్రీడా ప్రపంచాన్ని ఆకర్షించే దేశంగా గుర్తింపు తెచ్చుకుంటే, సౌదీ అరేబియా ఆధ్యాత్మిక దేశంగా గుర్తింపు పొందింది. యూఏఈలో రాజధాని అబుదాబి, దుబాయ్ సిటీల గురించి చెప్పక్కర్లేదు. ఫ్యాషన్ రంగానికి, వ్యాపారానికి పెట్టింది పేరు. కానీ, సౌదీకి, యూఏఈకి మధ్య చాలా కాలంగా శతృత్వం ఉంది. 2015 వరకు రెండు దేశాల మధ్య సయోద్య ఉన్నప్పటికీ, యెమన్ కారణంగానే ఈ రెండింటి మధ్య శతృత్వం ఏర్పడింది. యెమన్‌లో సమైఖ్య ప్రభుత్వానికి సౌదీ మద్దతుగా నిలిస్తే, దక్షిణ యెమన్‌లోని ఏర్పాటు వాదానికి యూఏఈ మద్దతు పలికింది. ఆ తరువాత ఆర్థికం, ప్రాంతీయ, విదేశాంగ విధానం, ఇజ్రాయిల్‌తో సంబంధాలు, చివరకు చమురు ఉత్పత్తి విధానాల్లోనూ రెండింటి మధ్య తరచుగా రగడ జరుగుతూనే ఉంది.
ఇరాన్‌తో వైరం
ఇరాన్‌తో మొదటి నుంచి యూఏఈకి వైరం ఉంది. కానీ, చమురు ఉత్పత్తి చేస్తున్న కూటమిలో ఇరాన్‌ను చేర్చుకోవడం యూఏఈకి ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ, వ్యూహాత్మకంగా ఇరాన్ ఒపెక్ కూటమిలో చేరింది. అయితే, పశ్చిమాసియాలో ఉద్రికత్తలకు కారణం ఇరాన్ అని యూఏఈ గట్టిగా నమ్ముతోంది. అంతేకాదు, యూఏఈపై సుమారు 2200 డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది ఇరాన్. దీంతో యూఏఈలోని రువైస్ రిఫైననీ, ఫుజైరా పోర్టు, హబ్షన్ గ్యాస్ క్షేత్రాలు దెబ్బతిన్నాయి. దీంతో ఇరాన్‌ను పూర్తిస్థాయిలో శత్రువుగా భావించింది యూఏఈ. శతృవైన ఇరాన్ ఒపెక్ కూటమిలో ఉండటం ఇష్టంలేకపోవడంతో పాటు, ఆధునీకరించిన రిఫైనరీలు, పోర్టులు ఖాళీగా మారుతుండటంతో... ఒపెక్ నుంచి బయటకురావలని నిర్ణయించుకుంది. ఇజ్రాయిల్‌లో బంధాన్ని మరింతబలోపేతం చేసుకుంటోంది. ఐరన్ డోమ్‌ను ఇజ్రాయిల్ యూఏఈకి అందించింది అంటే ఈ రెండు దేశాల మధ్య మైత్రి ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.
వ్యూహాత్మకంగా చమురును ఉత్పత్తి చేసి పెద్ద సంఖ్యలో ఎగుమతి చేయాలని చూస్తున్నది యూఏఈ. అయితే, ఈ చమురు రవాణా జరగాలి అంటే హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లాలి. కానీ, చమురును పైప్‌లైన్ ద్వారా ఒమన్ తీరంలోని ఫుజైరా పోర్టుకు తరలిస్తే... అక్కడి నుంచి హోర్ముజ్ అవసరం లేకుండా రవాణా చేయవచ్చు. పైప్‌లైన్ ద్వారా ఫుజైరా పోర్టుకు తరలించాలంటే ఖర్చుతో కూడుకున్నదే అవుతుంది. హోర్ముజ్ జలసంధి నుంచి ఎగుమతి చేయాలంటే ఇరాన్ అడ్డుకుంటుంది. టోల్ కట్టమని కూర్చుంటుంది. చమురు నుంచి యుద్ధం వరకు ఇరాన్, యూఏఈ మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది.




