Gulf Railway Project: ఒకే రైల్వే లైన్‌తో 6 దేశాలు కనెక్ట్.. 2030 నాటికి గల్ఫ్‌లో కొత్త రవాణా విప్లవం

హోర్ముజ్ జలసంధి వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు భారీ రైల్వే ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నాయి.

CR Reddy
Published on: 28 Nov 2026 8:38 AM IST
Gulf Railway Project: ఒకే రైల్వే లైన్‌తో 6 దేశాలు కనెక్ట్.. 2030 నాటికి గల్ఫ్‌లో కొత్త రవాణా విప్లవం
X

Gulf Railway Project: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాలను కొత్త రవాణా మార్గాల వైపు ఆలోచించేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద భద్రతాపరమైన ఆందోళనలు పెరగడంతో ఈ ప్రాంత దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ఆరు గల్ఫ్ దేశాలను అనుసంధానించే భారీ రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. సుమారు 1,768 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ గల్ఫ్ రైల్వే నెట్‌వర్క్ 2030 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణికుల రాకపోకలతో పాటు సరుకు రవాణాకు కూడా కొత్త మార్గం అందుబాటులోకి వస్తుంది.

ఆరు దేశాలను కలపనున్న గల్ఫ్ రైల్వే

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)లో సభ్యులుగా ఉన్న కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE), ఒమన్ దేశాలను ఈ రైల్వే నెట్‌వర్క్ అనుసంధానించనుంది. కువైట్ నుంచి ప్రారంభమయ్యే రైలు మార్గం సౌదీ అరేబియా మీదుగా ఖతార్, యూఏఈ, ఒమన్ వరకు విస్తరించనుంది. బహ్రెయిన్‌ను సౌదీ అరేబియాతో అనుసంధానించే మార్గం కూడా ఇందులో భాగంగా ఉంది. ఈ రైల్వే లైన్ల ద్వారా ప్రధాన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ఓడరేవులు, సరుకు రవాణా కేంద్రాల మధ్య కనెక్టివిటీ పెరగనుంది. దీంతో ఆరు దేశాల మధ్య ప్రయాణం, వ్యాపారం మరింత సులభమయ్యే అవకాశం ఉంది.

గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణికుల రైళ్లు

ఈ ప్రాజెక్టులో ప్రయాణికుల రైళ్లు, సరుకు రవాణా రైళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ప్రయాణికుల రైళ్లు గంటకు గరిష్ఠంగా 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ప్రణాళిక రూపొందించారు. సరుకు రవాణా రైళ్ల వేగం గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉండనుంది. 2030 డిసెంబర్ నాటికి ఈ నెట్‌వర్క్ ద్వారా ఏటా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో ఏడాదికి 20 కోట్ల టన్నుల సరుకును రవాణా చేయగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. 2045 నాటికి ప్రయాణికుల సంఖ్య 80 లక్షలు దాటడంతో పాటు సరుకు రవాణా 27.1 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

హోర్ముజ్ జలసంధికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాదు

గల్ఫ్ దేశాలు ఈ రైల్వే ప్రాజెక్టును చేపట్టడానికి ప్రధాన కారణాల్లో ప్రాంతీయ భద్రతా ఆందోళనలు కూడా ఉన్నాయి. హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు లేదా నౌకా రవాణాకు ఆటంకాలు ఏర్పడితే సరఫరాపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రాంతీయ రవాణా వ్యవస్థకు మరో మార్గాన్ని సిద్ధం చేసుకోవాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. అయితే ఈ రైల్వే నెట్‌వర్క్ హోర్ముజ్ జలసంధికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాదు. సముద్ర మార్గాల ద్వారా జరిగే అంతర్జాతీయ చమురు, గ్యాస్ రవాణాను ఇది పూర్తిగా భర్తీ చేయలేదు. కానీ గల్ఫ్ దేశాల మధ్య సరుకుల రవాణాకు అదనపు మార్గంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్ మధ్య రైల్వే అనుసంధానం పెరగడం వల్ల ఓడరేవులు, వాణిజ్య కేంద్రాల మధ్య రవాణా సులభమవుతుంది.

16 బిలియన్ డాలర్లతో భారీ నిర్మాణం

ఈ ప్రాజెక్టును గల్ఫ్ రైల్వే అథారిటీ పర్యవేక్షిస్తోంది. 2009 డిసెంబర్‌లో GCC సుప్రీం కౌన్సిల్ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. 2021 డిసెంబర్‌లో గల్ఫ్ రైల్వే అథారిటీ ఏర్పాటైంది. ప్రాజెక్టు మౌలిక సదుపాయాల నిర్మాణానికి సుమారు 15.4 నుంచి 16 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మొత్తం రైల్వే మార్గంలో సౌదీ అరేబియాలో 672 కిలోమీటర్లు, యూఏఈలో 461 కిలోమీటర్లు, ఒమన్‌లో 330 కిలోమీటర్లు, ఖతార్‌లో 141 కిలోమీటర్లు, కువైట్‌లో 111 కిలోమీటర్లు, బహ్రెయిన్‌లో 53 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 55.92 శాతం పనులు పూర్తయినట్లు అందిన సమాచారం చెబుతోంది. నిర్ణీత గడువులో పనులు పూర్తయితే 2030 డిసెంబర్ నాటికి ఆరు దేశాల మధ్య రైలు సేవలు ప్రారంభం కానున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.