H-1B Rules: అమెరికా కీలక ప్రతిపాదన.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు!

H-1B Rules: ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Sept 2026 4:00 AM IST
H-1B Rules
X

H-1B Rules: అమెరికా కీలక ప్రతిపాదన.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు!

H-1B Rules: అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న హెచ్-1బి (H-1B) వీసాదారులకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఉద్యోగం కోల్పోయిన విదేశీ కార్మికులకు కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 60 రోజుల సడలింపు గడువును (Grace Period) పూర్తిగా రద్దు చేయాలని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదించింది. "విచక్షణతో కూడిన 60 రోజుల గడువు తొలగింపు" పేరుతో రూపొందించిన ఈ నిబంధన త్వరలోనే ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురితం కానుంది.

ఈ నూతన ప్రతిపాదన అమల్లోకి వస్తే... హెచ్-1బి, ఎల్-1 వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులు వీసా గడువు ముగియక ముందే జాబ్ కోల్పోతే, అమెరికాలో ఉండటానికి ఎలాంటి ప్రత్యేక అనుమతి లేని పక్షంలో తక్షణమే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగం కోల్పోయిన వెంటనే దేశంలో ఉండే హోదాను వారు కోల్పోతారు. 2016లో ప్రవేశపెట్టిన ఈ 60 రోజుల వెసులుబాటును తొలగించడం వల్ల స్థానిక ఐటీ రంగానికి సేవలు అందిస్తున్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.

అయితే, ఈ తాజా ప్రతిపాదనపై 60 రోజుల పాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలను సేకరించనున్నట్లు DHS తెలిపింది. 2021 నుంచి 2025 మధ్య ఉద్యోగం కోల్పోయి లేదా కంపెనీలు మారిన 3.28 లక్షల మంది విదేశీయులలో కేవలం 5.77 శాతం మందికి మాత్రమే కొత్త పిటిషన్లు దాఖలయ్యాయని, అందుకే నాన్-ఇమ్మిగ్రెంట్ హోదాను నిర్దిష్ట ఉపాధికే పరిమితం చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్