Cyber Attack: ఫ్రిజ్‌లను హ్యాక్ చేసిన కేటుగాళ్లు..టెంపరేచర్ 50 డిగ్రీలకు పెంచిన హ్యాకర్లు
Cyber Attack: టెక్నాలజీ మన జీవితాలను ఎంత సులభం చేస్తుందో, అదే సాంకేతికత కొన్నిసార్లు తీవ్రమైన ముప్పును కూడా తెచ్చిపెడుతుంది.
Fridge Hacking
Cyber Attack: టెక్నాలజీ మన జీవితాలను ఎంత సులభం చేస్తుందో, అదే సాంకేతికత కొన్నిసార్లు తీవ్రమైన ముప్పును కూడా తెచ్చిపెడుతుంది. తాజాగా ఫ్రాన్స్‌లో జరిగిన ఒక వింతైన సైబర్ దాడి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. హ్యాకర్లు అత్యంత తెలివిగా ఒక సూపర్ మార్కెట్లోని డిజిటల్ సిస్టమ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే అక్కడ ఉన్న ఫ్రిజ్‌ల ఉష్ణోగ్రతను ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెంచేశారు. ఈ దారుణమైన ఘటనతో విలువైన ఆహార పదార్థాలు పూర్తిగా పాడైపోయాయి.
ఆరు ప్రముఖ సూపర్ మార్కెట్లే లక్ష్యం
ప్రముఖ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సైబర్ దాడిలో ఫ్రాన్స్‌లోని 6 ప్రముఖ సూపర్ మార్కెట్ బ్రాండ్లు టార్గెట్ అయ్యాయి. దేశంలోని అత్యంత పెద్ద రిటైల్ దిగ్గజమైన ఈ-లెక్లర్క్తో పాటు కారెఫర్, మోనోప్రిక్స్, ఆచన్, ఇంటర్మార్చ్ వంటి పెద్ద పెద్ద స్టోర్లలో ఉన్న సుమారు 150కి పైగా ఫ్రిజ్‌లు ఈ దాడికి గురయ్యాయి. హ్యాకర్లు ఈ రెఫ్రిజిరేషన్ సిస్టమ్‌లను బలవంతంగా డీఫ్రాస్ట్ చేయడంతో ఫ్రిజ్‌ల లోపలి వేడి అసాధారణంగా పెరిగిపోయింది. ఫ్రిజ్‌లుగా ఉండాల్సినవి కాస్తా కేవలం 6 గంటల్లోనే ఓవెన్‌లా మారిపోయాయి.
ఇతర యూరోపియన్ దేశాలకు పాకిన టెన్షన్
ఫ్రాన్స్‌లో జరిగిన ఈ ఘటన కేవలం అక్కడితో ఆగలేదు. డెన్మార్క్, నెదర్లాండ్స్, బెల్జియం వంటి దేశాలు కూడా తమ ప్రాంతాల్లో ఇదే తరహా ఫ్రిజ్ హ్యాకింగ్ ఘటనలు జరిగినట్లు ప్రకటించాయి. దీని వెనుక ఏ దేశం ప్రమేయం ఉందనే కోణంలో అధికారులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సైబర్ దాడి వెనుక రష్యా హస్తం ఏమైనా ఉందా అనే అనుమానంతో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆరా తీస్తున్నాయి. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి కార్యాలయం ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు యూరప్‌లోని ఇతర పెద్ద దేశాల సహాయం కోరింది.
పాత సాఫ్ట్వేర్ లోపాలే కారణమా?
ఈ సైబర్ దాడికి సంబంధించి డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ సంస్థ డెన్ఫోర్స్ స్పందిస్తూ.. హ్యాకింగ్‌కు గురైన రెఫ్రిజిరేటర్లు అన్నీ పాత ఫర్మ్వేర్పై నడుస్తున్నట్లు వెల్లడించింది. తాము కొద్ది నెలల ముందే దీనికి సంబంధించిన భద్రతా హెచ్చరికలను కస్టమర్లకు జారీ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఏకకాలంలో ఆరు గంటలకు పైగా సిస్టమ్ హ్యాకర్ల కంట్రోల్లో ఉండటంతో సూపర్ మార్కెట్ నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత టన్నుల కొద్దీ ఆహార పదార్థాలను బయట పడేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో బాధ్యత వహిస్తూ సంబంధిత కంపెనీల యజమానులు ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాలు ఎంత సౌకర్యవంతంగా ఉంటాయో, వాటి భద్రతలో చిన్న పొరపాటు జరిగితే ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఈ సంఘటన నిరూపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు రిటైల్ దిగ్గజాలు మరింత కఠినమైన భద్రతా చర్యలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.




