Gunfire: హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి, డజన్ల మందికి గాయాలు

అమెరికాలో హాలోవీన్ వీకెండ్ సందర్భంగా పలు నగరాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. డల్లాస్‌లో జరిగిన మూడు వేర్వేరు కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 15 మంది గాయపడ్డారు.

CR Reddy
Published on: 2 Nov 2026 6:22 AM IST
US Halloween Shootings
X

US Halloween Shootings

Gunfire: అమెరికాలో హాలోవీన్ వీకెండ్ వేడుకలు విషాదంగా మారాయి. పండగ సంబరాల సమయంలో దేశంలోని పలు నగరాల్లో వరుసగా కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తం ఆరు నగరాల్లో జరిగిన ఈ ఘటనల్లో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, డజన్ల మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో హింస తీవ్రంగా కనిపించింది. అక్కడి డీప్ ఎలమ్ ప్రాంతంలో జరిగిన మూడు వేర్వేరు కాల్పుల ఘటనల్లో నలుగురు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. సంగీత కార్యక్రమాలు, రెస్టారెంట్లు, రాత్రి వేళ వినోద కేంద్రాలకు పేరున్న ఈ ప్రాంతంలో కాల్పులు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

గంటన్నర వ్యవధిలో మూడు ఘటనలు

డల్లాస్‌లో శనివారం రాత్రి సుమారు గంటన్నర వ్యవధిలో మూడు వేర్వేరు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయా? లేక వేర్వేరు కారణాలతో జరిగాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డల్లాస్ పోలీస్ చీఫ్ డేనియల్ కొమోక్స్ మాట్లాడుతూ.. కొన్ని అరెస్టులు చేసినట్లు వెల్లడించారు. అయితే ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? వారిపై ఏ ఆరోపణలు నమోదు చేశారు? అనే వివరాలు వెల్లడించలేదు. కాల్పులు ఎందుకు జరిగాయనే విషయం కూడా ఇంకా స్పష్టతకు రాలేదు.

ఫుట్‌బాల్ మ్యాచ్ తర్వాత బర్మింగ్‌హామ్‌లో కాల్పులు

అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్‌లోనూ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. లీజియన్ ఫీల్డ్ స్టేడియం వెలుపల వార్షిక మ్యాజిక్ సిటీ క్లాసిక్ ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మ్యాచ్ ముగిసి ప్రేక్షకులు, కుటుంబ సభ్యులు చాలామంది అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కాల్పులు జరిగినట్లు పోలీస్ చీఫ్ మైఖేల్ పికెట్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీస్ ప్రతినిధి డి'రెల్ ఫ్రీమన్ వెల్లడించారు. ఘటనా స్థలంలో పలు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

యూనివర్సిటీ సమీపంలో ఆరుగురికి బుల్లెట్ గాయాలు

డెలావేర్ రాష్ట్రంలోని నెవార్క్ నగరంలో డెలావేర్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో శనివారం అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారందరినీ సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఇల్లినాయిస్ రాష్ట్రంలోని బ్లూమింగ్టన్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో 19 ఏళ్ల యువతి మరణించింది. మరో మహిళ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఫేయెట్‌విల్లేలోనూ కాల్పులు.. దర్యాప్తు ముమ్మరం

అర్కాన్సాస్ రాష్ట్రంలోని ఫేయెట్‌విల్లే నగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో మరో ఆరుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలతో హాలోవీన్ వీకెండ్ సందర్భంగా అమెరికాలో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వేర్వేరు నగరాల్లో జరిగిన కాల్పుల వెనుక కారణాలు ఏమిటి? నిందితులు ఎవరు? ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలపై స్థానిక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.