Hamam al-Hammami: ప్లై దుబాయ్ కుట్ర వెనుక అసలు కోణం ఏమిటి? హమామ్ అల్-హమ్మామి ఎవరు?
ఫ్లైదుబాయ్ కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి ఎవరు? కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి ఆరోపణలు, అతడి గత ఉద్యోగం, భద్రతా ఆందోళనలు, నియామకంపై లేవనెత్తుతున్న ప్రశ్నలు తదితర విషయాలను తెలుసుకుందాం.
Hamam al-Hammami: ఫ్లైదుబాయ్ విమానంలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ దాడి ఘటన ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒమన్ పౌరుడిని హమామ్ అల్-హమ్మామిగా గుర్తించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఘటనను ఉగ్రవాద కోణంలోనూ పరిశీలిస్తున్న నేపథ్యంలో.. అసలు అతడు ఎవరు? అతడి గతం ఏంటి? గతంలో భద్రతాపరమైన అనుమానాలు ఉన్న వ్యక్తి ఫ్లైదుబాయ్ కాక్‌పిట్ వరకు ఎలా చేరుకున్నాడు? ఇప్పుడు ప్రధానంగా ఇవే ప్రశ్నలు దర్యాప్తు సంస్థల ముందున్నాయి.
హమామ్ అల్-హమ్మామి ఎవరు?
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం హమామ్ అల్-హమ్మామి ఒమన్ పౌరుడు. అతడు యూఏఈలో ఒమన్ తండ్రి, సిరియా తల్లికి జన్మించినట్లు CNNను ఉటంకిస్తూ పలు సంస్థలు వెల్లడించాయి. అతడు కొంతకాలం సిరియాతో పాటు ఒమన్ వెలుపల కూడా గడిపినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే అతడి వ్యక్తిగత నేపథ్యం, సిరియాలో ఉన్న సమయంలో ఎదురైన ప్రభావాలు వంటి అంశాలపై అధికారిక దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అతడి విద్యా నేపథ్యాన్ని పరిశీలిస్తే.. బ్రిటన్‌లోని Buckinghamshire New Universityలో మూడు సంవత్సరాల డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సు ద్వారా ఏవియేషన్ మేనేజ్‌మెంట్ చదివి 2023లో పట్టా పొందినట్లు CNN నివేదించింది. అతడి పేరుతో ఉన్న లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ కూడా ఇదే విషయాన్ని సూచించినట్లు సమాచారం. అయితే ఆ ప్రొఫైల్ ఇప్పుడు తొలగించబడింది.
ఏడు సంవత్సరాలు ఒమన్ ఎయిర్‌లో..
హమామ్ దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఒమన్ ఎయిర్‌లో పనిచేసినట్లు అతడి పేరుతో ఉన్న ప్రొఫైల్ ఆధారంగా నివేదికలు పేర్కొంటున్నాయి. 2024లో కో-పైలట్ శిక్షణ సమయంలో అతడి వద్ద తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్ గుర్తించబడిందని ABC Newsను ఉటంకిస్తూ పలు సంస్థలు తెలిపాయి. దీంతో అతడిని ఫ్లైట్ ట్రైనింగ్ నుంచి తప్పించి, విమానయానానికి సంబంధించిన మరో పరిపాలనా బాధ్యతల్లో ఉంచినట్లు సమాచారం. CNN, ABC News, Wall Street Journal నివేదికల్లో ఈ వ్యవహారంపై భిన్నమైన తేదీలు, వివరాలు కనిపిస్తున్నాయి.
మరి ఫ్లైదుబాయ్ ఎలా నియమించింది?
ఇదే ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకమైన ప్రశ్నగా మారింది. ఒమన్‌లో అతడిపై విమానయానానికి సంబంధించి ఆంక్షలు విధించినట్లు Wall Street Journal, Associated Press నివేదికలు చెబుతున్నాయి. ఆ తర్వాత కూడా అతడు ఫ్లైదుబాయ్‌లో ఉద్యోగం సంపాదించాడు. అతడు ఫ్లైదుబాయ్‌లో సుమారు ఎనిమిది నెలలుగా పనిచేస్తున్నట్లు ఒక ఇజ్రాయెల్ అధికారి CNNకు తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఒమన్‌లోని ఆంక్షలకు సంబంధించిన సమాచారం ఫ్లైదుబాయ్ నియామక ప్రక్రియలో ఎంతవరకు పరిశీలించబడింది? ఆ సమాచారాన్ని ఇతర దేశాల భద్రతా సంస్థలకు పంచారా? హమామ్‌కు అంతర్జాతీయ విమానాల్లో పనిచేసేందుకు అవసరమైన భద్రతా తనిఖీలు ఎలా జరిగాయి? వంటి ప్రశ్నలకు ఇప్పటివరకు పూర్తి సమాధానం లేదు.
దాడి వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. విమానం తీవ్రంగా కిందికి దిగిన సమయంలో మచ్చర్ గాయపడినా కాక్‌పిట్ తలుపు తెరిచి సహాయం అందేలా చేశాడు. ప్రయాణికులు, సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని టబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ దాడి వెనుక ఉగ్రవాద ఉద్దేశం ఉందా? ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్నదా? లేక మరేదైనా వ్యక్తిగత లేదా సిద్ధాంతపరమైన కారణమా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. యూఏఈ అధికారులు ఈ ఘటనను ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనను పూర్తిగా ఒక నిర్ధారిత “కుట్ర”గా చెప్పడం కంటే, గతంలో భద్రతాపరమైన ఆందోళనలు ఎదుర్కొన్న వ్యక్తి అంతర్జాతీయ విమాన కాక్‌పిట్ వరకు ఎలా చేరుకున్నాడు? అనే ప్రశ్నకు సమాధానం కనుగొనడం దర్యాప్తులో అత్యంత కీలకమైన అంశంగా కనిపిస్తోంది. హమామ్ గతం, అతడి ఆన్‌లైన్ కార్యకలాపాలు, ఉద్యోగ చరిత్ర, నియామక సమయంలో జరిగిన భద్రతా తనిఖీలు.. ఇవన్నీ కలిపి పరిశీలించిన తర్వాతే అసలు ఉద్దేశం, బాధ్యతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




