Hantavirus Fear: ప్రపంచాన్ని భయపెడుతున్న హంటా వైరస్‌...మరో కోవిడ్‌ కానుందా?

2020 అంటే మనకు గుర్తుకు వచ్చేది కోవిడ్‌. ఈ వైరస్‌ ధాటికి ప్రపంచం మొత్తం దాదాపుగా స్థంబించిపోయింది. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా లాక్‌డౌన్‌లు, ఆన్‌లైన్‌ ద్వారా పనులు, చదువులు కొనసాగాయి.

Balachander
Published on: 12 May 2026 10:08 AM IST
Hantavirus Fear: ప్రపంచాన్ని భయపెడుతున్న హంటా వైరస్‌...మరో కోవిడ్‌ కానుందా?
X

Hantavirus Fear: 2020 అంటే మనకు గుర్తుకు వచ్చేది కోవిడ్‌. ఈ వైరస్‌ ధాటికి ప్రపంచం మొత్తం దాదాపుగా స్థంబించిపోయింది. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా లాక్‌డౌన్‌లు, ఆన్‌లైన్‌ ద్వారా పనులు, చదువులు కొనసాగాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు హుటాహుటిన యాంటి వైరస్‌ మందును కొనుగొన్నారు. ఆరేళ్లు గడిచినా ఇంకా కోవిడ్‌ చేదు జ్ఞాపకాల నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇంతలోనే ఇప్పుడు హంటా వైరస్‌ పేరుతో మరో కొత్త మహమ్మారి ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఇది కోవిడ్‌ మాదిరిగా గాలిద్వారా వ్యాపిస్తుందా? అసలు దీని లక్షణాలేంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏమిటీ హంటా వైరస్?

హంటా వైరస్ అనేది కొత్తగా పుట్టుకొచ్చిన వ్యాధి ఏమీ కాదు. ఇది దశాబ్దాలుగా ఉనికిలో ఉంది. ప్రధానంగా ఎలుకలు, చిట్టెలుకల ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. ఎలుకల విసర్జితాలు లేదా వాటి లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినప్పుడు అది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనినే 'హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్' షార్ట్‌కట్‌లో చెప్పాలంటే హెచ్‌పీఎస్‌ అని పిలుస్తారు.

కోవిడ్-19 కి, హంటా వైరస్‌కు మధ్య తేడా ఏమిటి?

కోవిడ్ ప్రపంచాన్ని వణికించడానికి కారణం అది మనుషుల నుండి మనుషులకు గాలి ద్వారా చాలా వేగంగా వ్యాపించడం. కానీ హంటా వైరస్ విషయంలో కొన్ని ఊరట కలిగించే అంశాలు ఉన్నాయి. కోవిడ్‌ గాలి లేదా తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించింది. కానీ, హంటా వైరస్‌ అలా కాదు. మనిషి నుంచి మరో మనిషికి వ్యాపించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎలుకలు ఎక్కువగా ఉన్న ప్రాంతంల్లో ఈ వైరస్‌ ముప్పు ఉంటుంది. వైరస్‌ ముప్పు వలన మరణాల రేటు కేవలం 2 నుంచి 3 శాతం మాత్రమే ఉంటే...హంటా వైరస్‌ సోకితే మరణాల రేటు 38 శాతం వరకు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ కంటే ప్రమాదకరమైనదే అయినా... వ్యాప్తి చెందే తీరు, దాని వేగం తక్కువ. అందుచేత జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ బారిన పడకుండా ఉండొచ్చు.

హంటా వైరస్‌ కేసులు ప్రధానంగా ఆసియా, యూరప్‌, ఉత్తర మరియు దక్షిణ అమెరికా దేశాల్లో అప్పుడప్పుడు నమోదవుతూ ఉంటాయి. చైనా, కొరియా, అర్జెంటీనా, అమెరికా వంటి దేశాల్లో గతంలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఓ క్రూయిజ్‌ షిప్పులో కేసులు బయటపడటంతో మళ్లీ ఈ వైరస్ పేరు వార్తల్లోకి వచ్చింది.

హంటా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి?

సాధారణంగా వైరస్ సోకిన ఎనిమిది వారాల లోపు లక్షణాలు బయటపడతాయి. తీవ్రమైన జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు ఉండటంతో పాటు అలసట, తల తిరగడం, ఎండల్లోనూ చలిపుట్టడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి తీవ్రమైనపుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుతుంది. ఇలా జరిగితే ప్రాణాలకే ప్రమాదం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వైద్య నిపుణుల ప్రకారం, హంటా వైరస్ మరో కోవిడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అయినప్పటికీ పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో లేదా గోదాముల్లో ఎలుకలు చేరకుండా చూసుకోవాలి. ఎలుకలు తిరిగే చోట ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. చేతికి గ్లౌజులు ధరించాలి. ఇక వీటి వివర్జితాలను నేరుగా తాకకుండా ఉండాలి. ఆహార పదార్థాలపై ఎలుకలు తిరగకుండా చూసుకోవాలి. ఎలుకలు తిన్న ఆహారాన్ని అక్కడి నుంచి తీసివేయాలి. ఎవరూ ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రస్తుతానికి హంటా వైరస్ పట్ల భయపడాల్సిన పనిలేదు. ఇది కోవిడ్ లాగా ప్రపంచాన్ని దిగ్బంధించే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండేవారు, ఎలుకల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. సరైన సమయంలో వైద్య సహాయం అందితే ఈ వైరస్ నుండి కోలుకోవడం సాధ్యమే. పరిసరాలను శుబ్రంగా, పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. వైరస్‌ దరిచేరకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story