Hilton Hotel Curse: అమెరికా అధ్యక్షుల పాలిట శాపంగా మారిన హిల్టన్‌ హోటల్‌

Hilton Hotel Curse: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని హిల్టన్‌ హోటల్‌ మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఈ హోటల్‌లో అమెరికా అధ్యక్షుల భద్రతకు సవాలుగా మారింది.

Balachander
Published on: 26 April 2026 1:27 PM IST
Hilton Hotel Curse
X

Hilton Hotel Curse: అమెరికా అధ్యక్షుల పాలిట శాపంగా మారిన హిల్టన్‌ హోటల్‌

Hilton Hotel US Presidents Assassination Attempts: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని హిల్టన్‌ హోటల్‌ మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఈ హోటల్‌లో అమెరికా అధ్యక్షుల భద్రతకు సవాలుగా మారింది. 1981లో రొనాల్డ్‌ రీగన్‌పై జరిగిన కాల్పుల ఘటనను తలపిస్తూ..తాజాగా డొనాల్డ్‌ ట్రంప్‌పై కూడా అదే ప్రాంగణంలో హత్యాయత్నం జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైట్‌ హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌ సందర్భంగా డొనాల్డ్‌ ట్రంప్‌పై ఈ హత్యాయత్నం జరగడం ఆందోళన కలిగించింది.

నాడు రీగన్.. నేడు ట్రంప్: చరిత్ర పునరావృతమైందా?

అగ్రరాజ్యం అమెరికాలో భద్రతా వలయాలను ఛేదిస్తూ అధ్యక్షులపై దాడులు జరగడం చాలా అరుదు. కానీ వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్ మాత్రం ఇందుకు మినహాయింపుగా కనిపిస్తోంది. తాజాగా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు ట్రంప్‌పై ఓ దుండగుడు దాడికి యత్నించడం కలకలం రేపింది. ఈ దాడి తరువాత భద్రతా వైఫల్యాలపై అమెరికా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఆశ్చర్యకరం. ఈ ఘటనతో నాలుగు దశాబ్దాల క్రితం నాటి భయంకరమైన గుర్తులు మరోసారి అమెరికా ప్రజల కళ్లముందు కదలాడాయి.

1981 నాటి ఆ భయానక దృశ్యం

1981 మార్చి 30న, నాటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఇదే హిల్టన్ హోటల్‌లో ఒక కార్యక్రమాన్ని ముగించుకుని బయటకు వస్తుండగా, జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి తూటాల వర్షం కురిపించాడు. కేవలం 3 సెకన్ల వ్యవధిలో 6 రౌండ్లు కాల్పులు జరిపాడు. అందులో ఒక బుల్లెట్ రీగన్ ఛాతీలోకి దూసుకెళ్లి ఊపిరితిత్తుల దగ్గర ఆగింది. అప్పట్లో ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీతో పాటు మరో ముగ్గురు ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు తక్షణమే స్పందించి రీగన్‌ను ఆసుపత్రికి తరలించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన తరువాత హిల్టన్‌ హోటల్‌ భద్రతా వైఫల్యాలపై పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ హోటల్‌ ప్రాంగణంలో భద్రతను భారీ ఎత్తున పెంచారు. ఆ గురుతులు చెరిగిపోయాయి అనుకునే సమయంలో ఇప్పుడు ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం మరోసారి ఈ హోటల్‌ భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

'హింక్లీ హిల్టన్'గా మారిన పేరు

రీగన్‌పై దాడి చేసిన నిందితుడు హింక్లీని అప్పట్లోనే అరెస్ట్ చేశారు. అయితే, అతడు మానసిక అనారోగ్యంతో ఈ పని చేసినట్లు తేలడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఆ ఘటన తర్వాత స్థానికులు ఈ హోటల్‌ను 'హింక్లీ హిల్టన్' అని పిలవడం మొదలుపెట్టారు. దశాబ్దాలు గడిచినా, ఆ హోటల్ పేరు వింటేనే భద్రతా సంస్థలు వణికిపోతుంటాయి. మరోసారి డొల్లతనం బయటపడటంతో ఆందోళనలు మొదలయ్యాయి.

ఇదే హోటల్‌లో ట్రంప్‌పై దాడి జరిగినా ఆయన క్షేమంగా బయటపడ్డాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్షుడి కార్యక్రమాల్లో ఇలాంటి లోపాలు తలెత్తడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే హోటల్‌లో ఇద్దరు అధ్యక్షులపై ఇలా దాడులు జరగడం కేవలం యాదృచ్చికమా లేక భద్రతా పరంగా బలహీనంగా ఉన్నదా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. లోపాలు సరిదిద్దకుంటే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయనడంలో సందేహం లేదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story