Himalayas Climate Change: డేంజర్ జోన్‌లో హిమాలయాలు... వాతావరణ మార్పులే కారణమా?
హిమాలయాల్లో పెరుగుతున్న ప్రకృతి విపత్తులకు వాతావరణ మార్పులే కారణమా? మంచు కరగడం, గ్లేసియర్ల ప్రభావం, ఆకస్మిక వరదలతో పెరుగుతున్న పర్యావరణ ముప్పు గురించి తెలుసుకుందాం.
Himalayas Climate Change: హిమాలయ పర్వత శ్రేణులు తీవ్రమైన పర్యావరణ ముప్పును ఎదుర్కొంటున్నాయి. నేపాల్‌లోని రసువా జిల్లా పరిధిలో ప్రవహించే భోటే కోశి నదిలో ఇటీవల సంభవించిన బీభత్సమైన ప్రళయమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ విపత్తుపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇది సాధారణ వరద ఎంతమాత్రమూ కాదని, హిమపాతం, మంచు కొండలు విరిగిపడటం వల్ల సంభవించిన అసాధారణ మహా విపత్తు అని అంతర్జాతీయ వేదికలపై వ్యాఖ్యానించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు విడుదల చేస్తున్న కార్బన్ ఉద్గారాల మూలంగా చిన్న దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పెరిగిన భూ ఉష్ణోగ్రతలు .. కరిగిపోతున్న మంచు
ఈ ప్రళయం సంభవించడానికి రెండు రోజుల ముందే ఆ ప్రాంతంలో భూమి ఉష్ణోగ్రతలు గత రెండేళ్ల కాలంలోనే అత్యధిక స్థాయికి చేరుకోవడం గమనార్హం. గ్లేసియర్ సమీపంలోని సరస్సు నీటి ఉష్ణోగ్రత 2026 సంవత్సరంలోనే అత్యధిక రికార్డును నమోదు చేసింది. హిమాలయాల్లో గ్లేసియర్లు వేగంగా కరిగిపోవడం వల్ల నదులు ఉప్పొంగి నిమిషాల్లో ప్రళయాలుగా మారుతున్నాయి.
భారీ నష్టం .. అల్లకల్లోలమైన జీవనం
కొండచరియలు, ప్రవాహాల ధాటికి ఆకస్మికంగా 100 అడుగుల ఎత్తున ఉవ్వెత్తున విరుచుకుపడిన వరద నీరు గ్రామాలపైకి దూసుకొచ్చింది.ఈ భయాందోళనకర ఘటనలో ఇప్పటివరకు 900 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 4,000 మందికి పైగా జాడ తెలియకుండా పోయారు. సహాయక బృందాలు నిర్బంధ పరిస్థితిలో కొండ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి.
జల విద్యుత్ ప్రాజెక్టులపై దెబ్బ
త్రిశూలి నది పరివాహక ప్రాంతాల్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 900 మందికి పైగా కార్మికులు సొరంగాలలో చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. 'త్రిశూలి-3A' ప్రాజెక్ట్ వద్ద గాలిని పంపు చేస్తూ, కొండలను పేల్చుతూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే, సొరంగాల్లో చిక్కుకున్న కార్మికుల్లో ఎంతమంది బతికిబయటపడతారన్నది చూడాలి.
పర్యావరణ హెచ్చరిక .. అంతర్జాతీయ అత్యవసరం
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ గతంలోనే హెచ్చరించినట్లుగా, హిమాలయ పర్వత పర్యావరణ వ్యవస్థ అత్యంత సున్నితంగా మారిపోయింది. అభివృద్ధి చెందిన దేశాల పారిశ్రామిక వ్యర్థాలు, గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల శీతోష్ణస్థితిలో వస్తున్న ప్రతికూల మార్పులు హిమాలయ శ్రేణులను ప్రమాదంలోకి నెడుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ఇటువంటి ప్రాణాంతక విపత్తులు మరెన్నో సంభవించే ముప్పు పొంచి ఉంది.




