Hiroshima Day 2026: లిటిల్‌బాయ్ నుంచి ప్రపంచం నేర్చుకుందేమిటి? 81 ఏళ్లు గడిచినా నెరవేరని లక్ష్యం
సరిగ్గా 81 ఏళ్ల క్రితం జపాన్‌లోని హిరోషిమా అనే నగరంపై లిటిల్ బాయ్ పేరుతో ప్రయోగించిన అణుబాంబు విధ్వంసం నుంచి ప్రపంచం ఇప్పటి వరకు తేరుకోలేదు. 81 సంవత్సరాల నుంచి నెరవేరని ఆ లక్ష్యం కోసం ప్రపంచం ఎదురుచూస్తున్నది.
Hiroshima Day 2026: మానవ ప్రగతి సాంకేతికత వైపు పరుగులు తీస్తున్న తరుణంలో, అదే సాంకేతికత ఏ స్థాయిలో వినాశనానికి దారితీస్తుందో చాటిచెప్పిన భయానక చారిత్రక ఘట్టం 1945 ఆగస్టు 6. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో అమెరికా వైమానిక దళానికి చెందిన ఎనోలాగే అనే బీ 29 బాంబర్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.15 గంటలకు లిటియ్ బాయ్ అనే అణుబాంబును జపాన్‌లోని హిరోషిమా అనే నగరంపై జారవిడిచింది. ఈ బాంబు సృష్టించిన విధ్వంసం నుంచి ఆ నగరం కోలుకోవడానికి అర్థశతాబ్ధానికి పైగా పట్టింది అంటే ఏ స్థాయిలో తీవ్రత ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. లిటియ్ బాయ్ నేలను తాకిన క్షణాల వ్యవధిలోనే నగరం స్మశానవాటికలా మారిపోయింది. ఈ విధ్వంసం ఒక నగరానికో లేదా ఒక దేశానికో కాదు... అసలు యుద్ధం అంటే ఏమిటి? అణ్వాయుధాల ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచానికి ప్రత్యక్షంగా చూపించింది. ఈ సంఘటన జరిగి నేటికి 81 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఆగస్టు 6న హిరోషిమా దినోత్సవాన్ని లేదా యాంటి న్యూక్లియర్ డేను జరుపుకుంటారు. యుద్ధం వద్దని కోరుకునే శాంతిదూతలు అణ్వాయుధ రహిత సమాజం కోసం గొంతెత్తుతారు.
హిరోషిమా డే ఎందుకు పాటిస్తారు?
హిరోషిమా డే అనేది ఎలాంటి వేడుక కాదు. ఇది మానవ చరిత్రలో జరిగిన అత్యంత భయానక ఘటనల్లో ఒకదాన్ని గుర్తుచేసుకునే రోజు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది అమాయకులకు నివాళి అర్పించడం, అణ్వాయుధాల వినాశకర ప్రభావాన్ని ప్రపంచానికి తెలియజేయడం, శాంతి, అహింస, అణు నిరాయుధీకరణ అవసరాన్ని మరోసారి గుర్తు చేయడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, శాంతి కార్యకర్తలు, విద్యాసంస్థలు ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. హిరోషిమాలోని పీస్ మెమోరియల్ పార్క్‌లో జరిగే సంతాప సభలకు ప్రపంచంలోని పలు దేశాల ప్రతినిధులు హాజరవుతుంటారు.
రెండో ప్రపంచ యుద్ధంలో కీలక మలుపు
1941 డిసెంబర్ 7న జపాన్, అమెరికాలోని పెర్ల్ హార్బర్ నౌకాదళ స్థావరంపై దాడి చేయడంతో అమెరికా అధికారికంగా రెండో ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించింది. దాదాపు నాలుగేళ్ల పాటు కొనసాగిన యుద్ధం చివరి దశకు చేరుకున్న సమయంలో అమెరికా అణుబాంబును ఉపయోగించాలని నిర్ణయించింది. ఆ నిర్ణయమే 1945 ఆగస్టు 6న హిరోషిమాపై "లిటిల్ బాయ్" పేలడానికి దారితీసింది. ఆ పేలుడుతో నగరం భారీ విధ్వంసానికి గురైంది. అధికారిక అంచనాల ప్రకారం సుమారు 1.30 లక్షల మంది వెంటనే లేదా కొద్ది రోజుల్లోనే మరణించారు. అదే ఏడాది చివరి నాటికి గాయాలు, కాలిన గాయాలు, రేడియేషన్ ప్రభావంతో మృతుల సంఖ్య దాదాపు 1.40 లక్షలకు చేరుకుంది.
నాగసాకిపై రెండో అణుబాంబు
ఇక్కడితో ఆగిపోలేదు... హిరోషిమా దాడి జరిగిన మూడు రోజుల తర్వాత, 1945 ఆగస్టు 9న, అమెరికా మరో అణుబాంబు "ఫ్యాట్ మ్యాన్"ను నాగసాకిపై ప్రయోగించింది. ఈ దాడిలో కూడా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వరుసగా రెండు అణుబాంబు దాడుల అనంతరం జపాన్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇలానే మొండిగా వ్యవహరిస్తే రెండు నగరాలే కాకుండా జపాన్ దేశం మొత్తం తుడుచుపెట్టుకుపోయే ప్రమాదం ఉందని గ్రహించి, 1945 ఆగస్టు 15వ తేదీన లొంగిపోతున్నట్టు ప్రకటించింది. ఈ రెండు అణుబాంబులతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. కానీ, ఆ తరువాతే అసలు కథ మొదలైంది.
లిటిల్ బాయ్ ప్రపంచానికి నేర్పిన పాఠం
హిరోషిమాపై పడింది కేవలం ఒక బాంబు కాదు. అది మానవ నాగరికతకు పెద్ద హెచ్చరిక. అణ్వాయుధాలు యుద్ధంలో విజయం సాధించేందుకు ఉపయోగించే సాధారణ ఆయుధాలు కావని, ఒకసారి వినియోగిస్తే తరాల తరబడి దాని ప్రభావం ఉంటుందని ప్రపంచం అర్థం చేసుకుంది. పేలుడు జరిగిన వెంటనే వేలాది మంది మరణించగా, బతికి బయటపడిన వారు కూడా రేడియేషన్ ప్రభావంతో ఎన్నో సంవత్సరాలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. క్యాన్సర్, జన్యుపరమైన వ్యాధులు, శారీరక వైకల్యాలు అనేక కుటుంబాలను వెంటాడాయి. అందుకే హిరోషిమా ఘటనను మానవ చరిత్రలో అణుయుద్ధం ఎంత భయంకరమో చెప్పే అత్యంత పెద్ద ఉదాహరణగా ప్రపంచం గుర్తిస్తోంది.
81 ఏళ్లైనా నెరవేరని లక్ష్యం
హిరోషిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాంతి, అణు నిరాయుధీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చలు ప్రారంభమయ్యాయి. అనేక దేశాలు అణ్వాయుధాల నియంత్రణ కోసం ఒప్పందాలు చేసుకున్నాయి. ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ వేదికలు అణ్వస్త్రాల నిర్మూలనపై నిరంతరం పిలుపునిస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా మారలేదు. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల వద్ద వేల సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి. భద్రత, వ్యూహాత్మక అవసరాల పేరుతో అణు సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే హిరోషిమా నుంచి ప్రపంచం నేర్చుకున్న పాఠం పూర్తిగా ఆచరణలోకి రాలేదని శాంతి ఉద్యమకారులు చెబుతున్నారు. అమెరికా, రష్యా, చైనా వద్దే పెద్దమొత్తంలో అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిని భద్రత కోసం, వ్యూహాత్మక అవసరాల కోసం తయారు చేసుకున్నామని చెబుతున్నా... వాటి వలన ప్రపంచంలో ఏం జరుగుతుందోననే భయం ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నది.
తాజాగా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో కూడా యురేనియం ప్రముఖ పాత్రను పోషించింది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకుంటోందనే ఆరోపణలతో అమెరికా ఆ దేశంపై దాడి చేసింది. శుద్ది చేసిన యురేనియం ఉంటే దాని నుంచి అణ్వాయుధాలను తయారు చేసుకోవడం తేలికైన విషయం. ప్రపంచంలోని పలు ఉగ్రవాద సంస్థలతో ఇరాన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ చేతిలో అణ్వాయుధాలు ఉంటే... ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంటుందని అమెరికాతో సహా దాని మిత్రపక్షాలు వాదిస్తున్నాయి. అయితే, ఉగ్రవాదులకు అడ్డాగా ఉందని ప్రపంచ దేశాలు ఘోషిస్తున్న పాకిస్తాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. దీనిపై ప్రపంచదేశాలు నోరు మెదపడం లేదు. ఇలా ఒకరికి అనుకూలంగా, మరొకరికి వ్యతిరేకంగా ఉన్నంత వరకు అణునిరాయుధీకరణ అనే లక్ష్యం నెరవేరదు. అణునిరాయుధీకరణ ఒప్పందంపై అమెరికా ఇప్పటి వరకు సంతకం చేయలేదు అంటే... అణ్వస్త్రాలు ఆ దేశానికి ఎంత ముఖ్యమో అర్ధం చేసుకోవచ్చు.
హిరోషిమా డే సందేశం ఏమిటి?
హిరోషిమా డే మనకు ఒకే ఒక్క విషయాన్ని గుర్తు చేస్తుంది. యుద్ధంలో గెలిచేది ఎవరైనా కావచ్చు. కానీ ఓడిపోయేది మాత్రం మానవత్వమే. అణ్వాయుధాలు సమస్యలకు పరిష్కారం కాదని, సంభాషణ, దౌత్యం, పరస్పర అవగాహన ద్వారానే శాశ్వత శాంతి సాధ్యమని ఈ రోజు ప్రపంచానికి చెబుతోంది. హిరోషిమా వీధుల్లో జరిగిన విషాదం ఇప్పుడు చరిత్ర పుస్తకాల్లో మాత్రమే ఉన్న సంఘటన కాదు. భవిష్యత్ తరాలు అదే తప్పును మళ్లీ చేయకుండా ఉండేందుకు అది ఒక శాశ్వత హెచ్చరికగా నిలిచింది.
ప్రతి ఆగస్టు 6 ఎందుకు ప్రత్యేకం?
ప్రతి ఏడాది ఆగస్టు 6న హిరోషిమాలో ఉదయం 8:15 గంటలకు సంతాప ఘంటిక మోగుతుంది. బాధితుల జ్ఞాపకార్థం రెండు నిమిషాల మౌనం పాటిస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు శాంతి సందేశాలతో అక్కడికి చేరుకుంటారు. వేలాది కాగితపు కొంగలు, కొవ్వొత్తులు, పూలతో నివాళులు అర్పిస్తారు. 81 ఏళ్లు గడిచినా హిరోషిమా ప్రపంచాన్ని అడుగుతున్న ప్రశ్న మాత్రం ఇప్పటికీ అదే... శాస్త్ర విజ్ఞానం మానవాళి అభివృద్ధి కోసమా? లేక విధ్వంసం కోసమా? ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలిగిన రోజే హిరోషిమా నేర్పిన అసలైన పాఠాన్ని ప్రపంచం పూర్తిగా అర్థం చేసుకున్న రోజుగా చరిత్ర గుర్తుంచుకుంటుంది.




