US Iran Deal : ఇరాన్ సంచలన నిర్ణయం.. అమెరికాకు 440 కిలోల యురేనియం ఇచ్చేందుకు అంగీకారం

US Iran Deal : అమెరికా ఒత్తిడికి లొంగిన ఇరాన్ తన వద్దనున్న 440 కిలోల ఎన్రిచ్డ్ యురేనియంను వదులుకోవడానికి అంగీకరించింది.

CR Reddy
Published on: 24 May 2026 9:56 AM IST
US Iran Deal
X

US Iran Deal

US Iran Deal : అంతర్జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా గల్ఫ్ రీజియన్‌లో ఎవరూ ఊహించని సరికొత్త చారిత్రాత్మక మలుపు చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అమెరికాతో తీవ్రమైన అణు యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్.. ఎట్టకేలకు ఒక అడుగు వెనక్కి వేసింది. అమెరికాతో ప్రతిపాదిత శాంతి ఒప్పందంలో భాగంగా తన వద్దనున్న అత్యంత ప్రమాదకరమైన హైలీ ఎన్రిచ్డ్ యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించిందని ప్రసిద్ధ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇరాన్ వద్ద ప్రస్తుతం దాదాపు 440 కిలోల యురేనియం నిల్వలు ఉన్నాయి. దీనిని అమెరికా ఆధీనంలోకి తీసుకురావడానికి ఇరాన్ అంగీకరించడం అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఇరాన్ లొంగుబాటుగానే రాజకీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ మధ్య సాగుతున్న ఈ చర్చల వెనుక భారీ సైనిక ఒత్తిడి దాగి ఉంది. వాస్తవానికి చర్చల మొదటి దశలో యురేనియం అంశాన్ని చేర్చడానికి ఇరాన్ నిరాకరించింది. అయితే, ఇరాన్ గనుక అణు నిల్వలను అప్పగించకపోతే చర్చల నుంచి పూర్తిగా తప్పుకుని, మళ్లీ సైనిక దాడులు ప్రారంభిస్తామని అమెరికా గట్టిగా హెచ్చరించింది. ఇందులో భాగంగానే ఇరాన్‌లోని ఇస్ఫహాన్ భూగర్భ అణు కేంద్రంపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేయడానికి, అలాగే అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త కమాండో ఆపరేషన్ల ద్వారా ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయడానికి అమెరికా సైన్యం బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఈ ఊహించని ముప్పును ముందే గ్రహించిన ఇరాన్.. చివరి నిమిషంలో అమెరికా డిమాండ్లకు తలవంచక తప్పలేదు.

అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) అంచనాల ప్రకారం.. ఇరాన్ తన వద్దనున్న యురేనియంను ఇప్పటికే 60 శాతం వరకు శుద్ధి చేసి ఉంచింది. దీనిని మరో కొద్దిగా అప్‌గ్రేడ్ చేస్తే చాలు.. కొన్ని నెలల్లోనే ఒకటి కంటే ఎక్కువ అణుబాంబులను ఇరాన్ సులభంగా తయారు చేయగలదని ఇజ్రాయెల్ నిరంతరం ఆరోపిస్తూ వస్తోంది. ఈ తీవ్రమైన ముప్పును నివారించడమే లక్ష్యంగా అమెరికా తన మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌పై సుదీర్ఘకాలంగా ఆంక్షల పర్వాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం కుదిరిన ప్రాథమిక అవగాహన ప్రకారం.. ఈ యురేనియం నిల్వలను నేరుగా అమెరికాకు అప్పగిస్తారా లేదా 2015 నాటి బరాక్ ఒబామా కాలం నాటి ఒప్పందం లాగా రష్యాకు బదిలీ చేస్తారా అనే సాంకేతిక అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది.

ఈ భారీ అణు డీల్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, కేవలం చివరి నిమిషపు సాంకేతిక అంశాల చర్చలు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ముసాయిదా ఒప్పందంలో భాగంగా రాబోయే 30 నుంచి 60 రోజుల్లో ఇరాన్ అణు కార్యక్రమంపై కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. అలాగే అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. దీనివల్ల గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌లో చమురు ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ ఒప్పందానికి బదులుగా తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, విదేశాల్లో ఫ్రీజ్ అయిన తమ నిధులను తిరిగి విడుదల చేయాలని ఇరాన్ గట్టిగా డిమాండ్ చేస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story