US-Iran Peace Deal : ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా ఇరాన్.. నేడే సూపర్ డీల్
US-Iran Peace Deal : అమెరికా, ఇరాన్ మధ్య ఆదివారం చారిత్రాత్మక శాంతి ఒప్పందం జరగనుందని, దీనితో హోర్ముజ్ జలసంధి వెంటనే తెరుచుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
US-Iran Peace Deal
US-Iran Peace Deal : అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఒక సంచలన పరిణామం చోటుచేసుకోబోతోంది. సుదీర్ఘకాలంగా బద్ధశత్రువులుగా ఉన్న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నేడు (ఆదివారం) చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరనుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. నెలల తరబడి సాగిన దౌత్యపరమైన చర్చలు, తీవ్ర ఉద్రిక్తతల తర్వాత ఎట్టకేలకు ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అందరి కోసం తెరుచుకుంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్‌కు పైసా ఇవ్వడం లేదు
ఈ చారిత్రాత్మక ఒప్పందం గురించి డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. గతంలో బరాక్ ఒబామా ప్రభుత్వం ఇరాన్‌తో చేసుకున్న JCPOA అణు ఒప్పందాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఒబామా చేసిన డీల్ ఇరాన్ సులభంగా అణు ఆయుధాలు తయారు చేసుకోవడానికి రహదారి లాంటిదని విమర్శించారు. ఆ రోజు ఇరాన్‌కు అమెరికా 1.7 బిలియన్ డాలర్ల నగదును ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు తాను కుదుర్చుకుంటున్న ఒప్పందం దానికి పూర్తిగా భిన్నమైనదని, ఇరాన్‌కు ఎలాంటి నగదు చెల్లింపులు లేదా ఆర్థిక లావాదేవీలు చేయడం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.
బీ-2 బాంబర్లతో అణు వ్యర్థాల క్లీనింగ్ ప్లాన్
ప్రస్తుత ఒప్పందం ప్రకారం ఇరాన్ ఇకపై ఎలాంటి అణు ఆయుధాలను తయారు చేయబోదని, ఆ దేశానికి అణు బాంబులు పొందే మార్గాలన్నీ మూసుకుపోయాయని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన తర్వాత అమెరికాకు చెందిన అత్యాధునిక B-2 బాంబర్ యుద్ధ విమానాలు, అనుభవజ్ఞులైన పైలట్ల సహాయంతో అమెరికా బృందం ఇరాన్‌లోకి ప్రవేశిస్తుందని చెప్పారు. ఇరాన్‌లోని గ్రానైట్ కొండల కింద, భూగర్భంలో దాగి ఉన్న అణు పదార్థాన్ని వెలికితీసి, దానిని నిర్వీర్యం చేసి పూర్తిగా నాశనం చేస్తామని ట్రంప్ ఒక సంచలన ప్రణాళికను బయటపెట్టారు.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హర్షం
మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ చర్చలు ముగింపు దశకు చేరుకోవడంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. రాబోయే 24 గంటల్లో ఈ శాంతి ఒప్పందానికి తుది రూపం రానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఇరు దేశాల మధ్య డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో సంతకాల కార్యక్రమం జరగబోతోందని, దీనివల్ల మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం ఏర్పడుతుందని ట్వీట్ చేశారు. ఈ ఒప్పందం విజయవంతం కావడానికి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి కూడా పాకిస్తాన్ చేసిన రాయబార ప్రయత్నాలను అభినందించినట్లు సమాచారం.
శాంతియుతంగా కాకపోతే చివరి అస్త్రం సిద్ధం
భవిష్యత్తులో ఇరాన్, మొత్తం మిడిల్ ఈస్ట్ దేశాలతో కలిసి పనిచేయడానికి అమెరికా ఎంతో ఆసక్తిగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ శాంతి ప్రక్రియ ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎంతో వేగంగా, సులభంగా పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఇరాన్ వైపు నుంచి ఏదైనా తేడా వస్తే, తమ వద్ద చివరి అస్త్రం కూడా సిద్ధంగా ఉందని, అయితే దానిని ఉపయోగించే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. ఈ నెల చివర్లో ఈజిప్ట్‌లో జరగబోయే ప్రాంతీయ విదేశాంగ మంత్రుల (R-4) సమావేశంలో కూడా ఈ ఒప్పందం తదుపరి సాంకేతిక అంశాలపై చర్చలు జరగనున్నాయి.




