Hormuz Crisis: హోర్ముజ్‌ ఎఫెక్ట్‌... అమెరికాలో మొదలైన చమురు కష్టాలు

హోర్ముజ్‌ జలసంధిపై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. దీంతో అమెరికాలోనూ చమురు మంటలు వ్యాపిస్తున్నాయి.

Balachander
Published on: 15 Aug 2026 12:59 PM IST
Hormuz Crisis: హోర్ముజ్‌ ఎఫెక్ట్‌... అమెరికాలో మొదలైన చమురు కష్టాలు
X

Hormuz Crisis: అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభానికి దారి తీస్తున్నాయి. ముఖ్యంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' గుండా చమురు ట్యాంకర్ల రాకపోకలు దాదాపుగా నిలిచిపోవడంతో అమెరికాలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్‌ను 'దుష్ట దేశం'గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించగా, దానికి బదులుగా అమెరికా తన ఓటమిని అంగీకరించాలని ఇరాన్ తీవ్రస్థాయిలో హెచ్చరిస్తోంది.

స్తంభించిన చమురు వాణిజ్యం... ఇరాన్ ఆధిపత్యం

శాంతి చర్చలు నిలిచిపోవడంతో ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కజెం ఘరీబాబాది స్పందిస్తూ, "అమెరికా వాస్తవాలను అంగీకరించి ఓటమిని ఒప్పుకునే వరకు ఈ జలసంధి మూసివేత కొనసాగుతుంది. ఇది కేవలం ఇరాన్ కమాండ్ కింద మాత్రమే పనిచేస్తుంది" అని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఎలక్షన్ స్పీచ్‌లతోనో, ఒక ట్వీట్‌తోనో జలసంధిని స్వాధీనం చేసుకోలేరని ఆయన అమెరికాకు చురకలంటించారు. యుద్ధానికి ముందు ప్రతిరోజూ 130 పైగా నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించేవి. కానీ శుక్రవారం నాడు కేవలం రెండు నౌకలు మాత్రమే ప్రయాణించినట్లు షిప్-ట్రాకింగ్ సంస్థ 'కేప్లర్' వెల్లడించింది. అందులో క్రూడ్ ఆయిల్ షిప్‌మెంట్ ఒక్కటి కూడా లేకపోవడం విశేషం. ఇక ఇదిలా ఉంటే, ఇరాన్ అనుమతి లేకుండా ప్రయాణించే నౌకలపై డ్రోన్, క్షిపణి దాడులు జరుగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ నౌకలపైనా దాడులు జరిగినట్లు అధికారులు ధృవీకరించారు.

అమెరికాలో పెరుగుతున్న ధరలు ... ట్రంప్ వ్యాఖ్యలు

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించడానికి ముందు ప్రపంచ చమురు ఎగుమతులలో 20% హోర్ముజ్ జలసంధి గుండానే జరిగేవి. ఇప్పుడు ఈ మార్గం దిగ్బంధనం కావడంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు డాలర్‌ చొప్పున పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఏకంగా 6% లాభాల దిశగా పయనిస్తోంది. ఇక ఇదిలా ఉంటే, అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ ప్రకారం, అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ సగటు ధర 4.08 డాలర్లకి చేరుకుంది. ఇది గత ఏడాది నమోదైన 3.16 డాలర్లతో పోలిస్తే ఏకంగా 29% అధికం. న్యూయార్క్‌లో జరిగిన రాజకీయ ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కకుండా నిరోధించాలంటే అమెరికన్లు కొంతమేర పెట్రోల్ ధరలు భరించక తప్పదని స్పష్టం చేశారు. "మేము చేస్తున్న యుద్ధం కేవలం మాకోసం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి మేలు చేస్తుంది" అని ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

ఆర్థిక ఒత్తిళ్లు ... భవిష్యత్ పరిణామాలు

ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన వ్యయాలను తగ్గించాలన్న ట్రంప్ ఎన్నికల హామీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలలో డెమోక్రాట్లు దీనిని ప్రధాన అస్త్రంగా మార్చుకుంటున్నారు. మరోవైపు ఇరాన్ కూడా భారీ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా ఆంక్షలు, పోర్టుల దిగ్బంధనమే ద్రవ్యోల్బణానికి కారణమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆరోపించారు. జూన్ నెలలో కుదిరిన తాత్కాలిక ఒప్పందం విఫలం కావడంతో, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శాంతి చర్చల ఊసే లేదు. ఇరాన్‌పై మరింత ఆర్థిక దిగ్బంధనం విధిస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ హెచ్చరించడంతో, ఈ ముడి చమురు సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story