Hormuz Shipping Crisis: హోర్ముజ్ జలసంధిలో భారీగా పడిపోయిన రవాణా...చమురు సంక్షోభంతో అల్లాడిపోతున్న దేశాలు
హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. యుద్ధానికి ముందు వరకు ఈ మార్గంలో 140 నౌకల వరకు రవాణా సాగించగా... ఇప్పుడు కేవలం ఐదారు నౌకలు మాత్రమే ప్రయాణం సాగిస్తున్నాయి.
Hormuz Shipping Crisis: హోర్ముజ్ జలసంధిలో నిలిచిపోయిన నౌకల రాకపోకలు... రోజుకు 140 వెళ్లే చోట కేవలం 6 నౌకలే ప్రయాణం. అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం... తీవ్రమవుతున్న ప్రపంచ చమురు, గ్యాస్ సంక్షోభం. రెడ్ సీ రవాణా మార్గంపైనా ఉత్కంఠ... బాబ్ అల్-మండేబ్ వద్ద యథాతథంగా ఉన్న ఓడల ప్రయాణం.
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిలో రవాణా తీవ్రంగా పడిపోయింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు మసకబారడంతో ఈ కీలక సముద్ర మార్గంలో నౌకల ప్రయాణం దాదాపు స్తంభించిపోయింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం ముదిరి అనేక దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. తాజా షిప్పింగ్ నివేదికల ప్రకారం ఈ మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి.
గణాంకాల్లో వెల్లడైన దిగ్భ్రాంతికర నిజాలు
షిప్-ట్రాకింగ్ సంస్థ 'క్లెపర్' అందించిన తాజా డేటా ప్రకారం, సోమవారం నాడు హోర్ముజ్ జలసంధి ద్వారా కేవలం 6 వాణిజ్య నౌకలు మాత్రమే ప్రయాణించాయి. సాధారణ రోజుల్లో లేదా యుద్ధ వాతావరణం లేని సమయంలో ప్రతిరోజూ ఈ జలసంధి గుండా దాదాపు 130 నుండి 140 చమురు, సరుకు రవాణా నౌకలు ప్రయాణించేవి. అయితే, గత 10 రోజుల సగటును పరిశీలిస్తే రోజుకు కేవలం 11 నౌకలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ సోమవారం నాటికి అది ఏకంగా 6 నౌకలకు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సోమవారం ఈ సముద్ర మార్గంలోకి ప్రవేశించిన 4 నౌకలలో రెండు ఖాళీ చమురు ట్యాంకర్లు కాగా, జలసంధి నుండి బయటకు వచ్చిన రెడు నౌకలలో ఒకటి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ట్యాంకర్, మరొకటి రసాయన నిల్వల నౌక.
బాబ్ అల్-మండేబ్ జలసంధి వద్ద రవాణా పరిస్థితి
మరోవైపు, అరేబియా సముద్రంలోని ఏడెన్ సింధుశాఖను ఎర్రసముద్రంతో అనుసంధానించే బాబ్ అల్-మండేబ్ జలసంధిలో మాత్రం రవాణా పెద్దగా మారలేదు. సోమవారం ఈ మార్గం గుండా 25 వాణిజ్య నౌకలు ప్రయాణించాయి. గత 10 రోజుల సగటున ఇక్కడ నమోదవుతున్న 24 నౌకల రవాణా సంఖ్యతో పోలిస్తే ఇది స్థిరంగానే ఉంది. హోర్ముజ్ జలసంధి మూతపడే దిశగా సాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో దౌత్య చర్చలు మళ్లీ పట్టాలెక్కితే తప్ప ఈ ఇంధన రవాణా సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదని రవాణా నిపుణులు భావిస్తున్నారు.




