Hormuz Strait : ప్రపంచానికి ముంచుకొస్తున్న చమురు ముప్పు.. హోర్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్

Hormuz Strait : హోర్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.

CR Reddy
Published on: 12 July 2026 7:31 AM IST
Hormuz Strait
X

Hormuz Strait

Hormuz Strait : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముదిరిపోతున్నాయి. ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ ఆదివారం ఉదయం ఒక సంచలన ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిని తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు తాత్కాలికంగా పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అనుమతి లేని రూట్ గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన ఒక ఓడపై ఇరాన్ సైన్యం హెచ్చరికగా కాల్పులు జరిపిన వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధి మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది.

అమెరికా జోక్యం ఆపకుంటే ఏ ఓడను రానివ్వం

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ నివేదిక ప్రకారం.. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక జోక్యం పూర్తిగా నిలిచిపోయే వరకు హోర్ముజ్ జలసంధి ద్వారా ఏ ఒక్క అంతర్జాతీయ నౌకను కూడా వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ మిలిటరీ స్పష్టం చేసింది. ఇరాన్, ఒమన్ విదేశాంగ మంత్రుల మధ్య శనివారం జరిగిన కీలక సమావేశం తర్వాతే ఈ ప్రకటన రావడం గమనార్హం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఈ వ్యూహాత్మక జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉండాలని, ఇటుగా వెళ్లే ఓడల నుండి తాము పన్నులు వసూలు చేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఓపెన్ మార్కెట్లో ఇరాన్ డాలర్ల రూపంలో చమురు అమ్ముకునే సదుపాయాన్ని రద్దు చేసిన అమెరికా.. తమతో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు.

ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం

గత ఫిబ్రవరి 28న జరిగిన భీకర దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అయాతొల్లా అలీ ఖమేనీ దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన అంత్యక్రియలు ముగిసిన తర్వాత, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ తొలిసారిగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తన తండ్రిని పొట్టనబెట్టుకున్న శత్రువులపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, ఇది ఇరాన్ దేశ ప్రజలందరి సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఛానెల్‌లో ప్రసారమైన ఈ ప్రకటనతో ఇరాన్ పాలక యంత్రాంగం కొత్త నాయకత్వంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది.

వేల క్షిపణులు సిద్ధం

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తమపై గానీ, తమ మిత్రదేశాలపై గానీ ఇరాన్ దాడులకు దిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. "ఇరాన్‌ను టార్గెట్ చేస్తూ వేలాది అమెరికన్ క్షిపణులు ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ కనుక తన హెచ్చరికలను నిజం చేయడానికి ప్రయత్నిస్తే, క్షణాల వ్యవధిలో వారిపై క్షిపణుల వర్షం కురుస్తుంది" అని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను అంతమొందించాలంటూ ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ ప్రజలు పెద్ద ఎత్తున పోస్టర్లు ప్రదర్శించడమే ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. అమెరికా ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసినప్పటికీ, చర్చల తలుపులు తెరిచే ఉంచామని పేర్కొంది.

ఇరాన్‌పై ఆగని వైమానిక దాడులు

గడిచిన రెండు రోజులుగా ఇరాన్ భూభాగంపై గుర్తుతెలియని శక్తులు జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 17 మంది మరణించగా, 115 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ తెలిపారు. ఈ దాడులకు ఇజ్రాయెల్ బాధ్యత వహించకపోవడంతో, గల్ఫ్ అరబ్ దేశాలే ఇరాన్‌ను నియంత్రించడానికి ఈ దాడులు చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రతికారంగా ఇరాన్ సైన్యం గురువారం బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్ దేశాల సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడులకు దిగింది. అమెరికా సైన్యం, వైట్ హౌస్ అధికారులు హోర్ముజ్ జలసంధి బంద్ పై ఇంకా అధికారికంగా స్పందించనప్పటికీ, ఈ పరిణామాలు గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story