US Iran war: హోర్ముజ్ దిగ్బంధనం జరిగితే...భారత్ పరిస్థితి ఎలా ఉండబోతుంది?
US Iran war: ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి.
US Iran war: హోర్ముజ్ దిగ్బంధనం జరిగితే...భారత్ పరిస్థితి ఎలా ఉండబోతుంది?
US Iran war: ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడం అనేది భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు పెను శాపంగా మారబోతోంది. ఇరాన్ అణు కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 15 శక్తిమంతమైన యుద్ధ నౌకలను మోహరించింది. ఈ పరిణామం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే, మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 26 నుండి రూ. 30 వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
భారత్‌పై పడనున్న ప్రభావం: గణాంకాలతో విశ్లేషణ
భారత్ తన చమురు అవసరాల్లో సుమారు 85% దిగుమతులపై ఆధారపడుతుంది. అందులో పెద్ద భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ప్రస్తుతం హోర్ముజ్ ప్రాంతంలో 15కి పైగా భారతీయ నౌకలు నిలిచిపోయాయి. మరోవైపు, గల్ఫ్ ప్రాంతంలో 150కి పైగా ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. అమెరికా నేవీ తన నియంత్రణలో నౌకల రాకపోకలను పరిమితం చేస్తే, చమురు సరఫరా ఆలస్యమవడం ఖాయం.
ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితేనే మన దగ్గర లీటరుకు రూ. 8-10 పెరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చమురు ధర 150 డాలర్లకు చేరితే, హైదరాబాద్ వంటి నగరాల్లో పెట్రోల్ ధర రూ. 135 దాటడం ఖాయం. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.107 దాటితే, ఇది మరింత భారమవుతుంది. జిల్ ధరలు పెరిగితే లారీల రవాణా ఛార్జీలు పెరుగుతాయి. తద్వారా పాలు, కూరగాయలు, బియ్యం వంటి నిత్యవసరాల ధరలు 15-20 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
సామాన్యుడి పరిస్థితి ఏమిటి?
అమెరికా ఇరాన్ యుద్ధ సంక్షోభం నేరుగా సామాన్యుడి జీవనంపై పడుతుంది. బతుకు భారంగా మారుతుంది. హైదరాబాద్‌లో ఓ ఆటోవాలా లన సంపాదనలో సుమారు 40 శాతం వరకు ఇంధనానికే పోతుంది. ధరలు పెరిగితే కుటుంబం గడవడం కష్టంగా మారుతుంది. ఎరువుల ధరలు పెరగడం వలన రైతులపై సాగుభారం రెట్టింపు అవుతుంది. అసలే రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, ప్రకృతి అనుకూలించక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ యుద్ధభారం కూడా పడితే మూలిగేనక్కపై తాటికాయ పడినట్టు అవుతుంది.
ఎలా బయటపడాలి
అమెరికా-ఇరాన్ మధ్య రగులుతున్న ఈ చిచ్చు ఎప్పుడు చల్లారుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి, సామాన్య ప్రజలు ముందు జాగ్రత్తగా కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. అనవసర ప్రయాణాలను తగ్గించుకొని ఇంధనాన్ని ఆదా చేయాలి. నిత్యావసర ధరలు పెరగకముందే పాడవ్వని వస్తువులు కొద్దిగా అదనంగా చేర్చిపెట్టుకోవడం శ్రేయస్కరం. ఎక్కడో జరుగుతున్న ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాలు, సామాన్య పౌరులు నలిగిపోతున్నారు. ఇప్పటికైనా సామాన్యులు నలిగిపోకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.




