Hormuz Strait Crisis : హోర్ముజ్ జలసంధి మళ్లీ క్లోజ్.. పెట్రోల్ ధరలు రూ.500 దాటడం ఖాయమా?

Hormuz Strait Crisis : ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముదురుతోంది. తమ చమురు ట్యాంకర్లపై దాడులకు ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని, అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

CR Reddy
Published on: 10 May 2026 10:19 AM IST
Hormuz Strait Crisis
X

Hormuz Strait Crisis

Hormuz Strait Crisis : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తమ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని, ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై భారీ ఎత్తున విరుచుకుపడతామని ఇరాన్ నేవీ, రివల్యూషనరీ గార్డ్స్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికలతో గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. అసలేం జరిగిందంటే, ఇరాన్ ఓడరేవుల నుంచి చమురు సరఫరాను అడ్డుకునేందుకు అమెరికా సైన్యం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం రెండు ఇరాన్ చమురు ట్యాంకర్లను అమెరికా దళాలు నిర్వీర్యం చేశాయి. దీనికి ప్రతిచర్యగా హోర్ముజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన ఈ మార్గాన్ని మూసివేస్తే గ్లోబల్ మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు చుక్కలను తాకుతున్నాయి.

బహ్రెయిన్‌పై ఇరాన్ కన్ను.. 41 మంది అరెస్ట్

మరోవైపు బహ్రెయిన్ దేశానికి కూడా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. బహ్రెయిన్‌లో అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉండటమే దీనికి కారణం. అమెరికాకు మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ చీఫ్ ఇబ్రహీం అజీజీ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఇదే సమయంలో, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో బహ్రెయిన్ ప్రభుత్వం 41 మందిని అరెస్ట్ చేసింది. వీరంతా ఇరాన్ సహకారంతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ట్రంప్ హెచ్చరిక.. రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదంపై స్పందిస్తూ, ఇరాన్ గనుక అణు కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోకపోతే, హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే పూర్తి స్థాయి బాంబు దాడులు మొదలుపెడతామని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు కూడా తమ యుద్ధనౌకలను మధ్యప్రాచ్యానికి పంపుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రక్షణ కోసం హెచ్ఎంఎస్ డ్రాగన్ నౌకను మోహరిస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.

శాంతి కోసం పాక్, రష్యా ప్రయత్నాలు

మరోవైపు ఈ యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా దౌత్య ప్రయత్నాలు మొదలయ్యాయి. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అటు అమెరికాతో, ఇటు ఇరాన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. రష్యా, సౌదీ అరేబియా కూడా శాశ్వత కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఇరాన్ కొట్టిపారేసింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని స్పష్టం చేసింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story