Hormuz Strait Krishnadevaraya Era: శ్రీకృష్ణదేవరాయుల కాలంలోనే హోర్ముజ్ ప్రస్థావన... మేలుజాతి గుర్రాల దిగుమతి
Hormuz Strait Krishnadevaraya Era: పశ్చిమాసియా యుద్ధం కారణంగా అట్టుడికిపోతున్నది. ఈ ప్రాంతంలోని హోర్ముజ్ జలసంధి గుండా రవాణా స్తంభించిపోవడంతో ప్రపంచదేశాలు చమురు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Hormuz Strait Krishnadevaraya Era
Hormuz Strait Krishnadevaraya Era: పశ్చిమాసియా యుద్ధం కారణంగా అట్టుడికిపోతున్నది. ఈ ప్రాంతంలోని హోర్ముజ్ జలసంధి గుండా రవాణా స్తంభించిపోవడంతో ప్రపంచదేశాలు చమురు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా సోషల్ మీడియాలో జలసంధికి సంబంధించిన అంశాలు ట్రెండ్ అవుతున్నాయి. హోర్ముజ్ జలసంధి నేడు చమురు రవాణాకు ప్రసిద్ధి చెందగా పూర్వ కాలంలో అంటే విజయనగర సామ్రాజ్యకాలంలో మేలుజాతి గుర్రాల దిగుమతికి ప్రసిద్ధి చెందింది. తెలుగు సాహిత్యంలో ఈ జలసంధి గురించి ప్రస్థావన ఉన్నది. సుమారు 500 ఏళ్ల క్రితమే శ్రీకృష్ణదేవరాయలు తన అద్భుత కావ్యం 'ఆముక్తమాల్యద'లో ఈ ప్రాంతాన్ని 'హరుమాంజి' అని సంబోధిస్తూ అక్కడి గుర్రాల వేగాన్ని అభివర్ణించడం విశేషం.
చరిత్ర పుటల్లో 'హరుమాంజి' వ్యాపారం
నేడు హోర్ముజ్ జలసంధి నుంచి ప్రపంచానికి చమురు సరఫరా అవుతుంటే, విజయనగర కాలంలో అక్కడ నుంచి మేలుజాతి గుర్రాలు, ముత్యాలు, పన్నీరు, ఖర్జూరాలు దిగుమతి అయ్యేవి. ఆ కాలంలో ఇరాన్‌ను 'పర్షియా' అని పిలిచేవారు. శ్రీనాథ కవి సార్వభౌముడు (1355-1441 CE) తన 'హర విలాసం'లో అవచి తిప్పయ్య శెట్టి అనే వర్తకుడు 'హురుమంజి' రేవు నుంచి విలాసవంతమైన వస్తువులు తెచ్చేవారని పేర్కొన్నారు. అంటే, రాయల వారి కంటే ముందే ఈ జలసంధితో తెలుగు నేలకు వాణిజ్య సంబంధాలు ఉండేవని స్పష్టమవుతోంది. కానీ, రాయలవారి కాలంలో ఈ జలసంధి నుంచి పెద్ద ఎత్తున వ్యాపారం జరిగేదని చరిత్రను బట్టి తెలుస్తోంది.
రాయల వారి 'రాజనీతి' - గుర్రాల దిగుమతి
శ్రీకృష్ణదేవరాయల (1509-1529 CE) కాలంలో యుద్ధ తంత్రం పూర్తిగా మారిపోయింది. ఉత్తరాన బాబర్ దాడులు, చుట్టూ ఉన్న బహమనీ సుల్తానుల ముప్పును ఎదుర్కోవడానికి బలమైన అశ్వదళం అవసరమని రాయలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అత్యుత్తమ గుర్రాలను దిగుమతి చేసుకోవాలని అనుకున్నారు. అయితే, ఉత్తర భారతదేశం మీదుగా దిగుమతి క్షేమకరం కాదని భావించి, సముద్రమార్గం ద్వారా అంటే పర్షియా నుంచి ఈ హోర్ముజ్ జలసంధి ద్వారా గుర్రాలను దిగుమతి చేసుకున్నారు. దీనికోసం మోటుపల్లి, మచిలీపట్నం వంటి ఓడరేవులను అభివృద్ధి చేసి శతృవులకు దక్కకుండా మేలుజాతి గుర్రాలను కొనుగోలు చేశారు.
సాహిత్యంలో అశ్వ వేగం
రాయల వారు తన పద్యంలో గుర్రాల వేగాన్ని పలు విధాలుగా వర్ణించారు. ఆ గుర్రాలు భూమిని తాకుతున్నాయో లేదో తెలియనంత వేగంగా, ఆకాశంలో డేగలు ఎగిరినట్లుగా పరుగెత్తుతాయట. వీటి ముందు మిగతా గుర్రాలన్నీ దిగుదుడుపే. వీటి వేగాన్ని ఎవరూ అందుకోలేరిన వర్ణించారు. పర్షియన్ వ్యాపారులకు విజయనగర రాజులు భారీగా ధనం చెల్లించడంతో, వారు కూడా తమ అత్యుత్తమ గుర్రాలను హంపి రాజులకే విక్రయించేవారు. ఈ విధంగా ఈ హోర్ముజ్ జలసంధి ద్వారా రాయల కాలంలో విస్తారంగా వ్యాపారం కొనసాగింది.
మొత్తంగా చూసుకుంటే... ఏడు వందల ఏళ్ల క్రితమే తెలుగు కవులకు ఈ భౌగోళిక ప్రాంతంపై అవగాహన, మంచి పట్టు ఉన్నది. నేడు ప్రపంచ రాజకీయాలను శాసిస్తున్న 'హోర్ముజ్', నాడు విజయనగర సామ్రాజ్య రక్షణలో కీలక పాత్ర పోషించడం ఒక చారిత్రక సత్యం.




