Hormuz Strait Scam: హోర్ముజ్‌ జలసంధిలో మోసగాళ్లు... కోట్లాది రూపాయలకు గాలం

Hormuz Strait Scam: ప్రపంచ చమురు రవాణాకు వెన్నెముక వంటి హోర్ముజ్ జలసంధి ఇప్పుడు యుద్ధ భయంతోనే కాదు, అంతకు మించిన సైబర్ కేటుగాళ్ల మోసాలతో వణికిపోతోంది.

Balachander
Updated on: 22 April 2026 10:56 AM IST
Hormuz Strait Scam
X

Hormuz Strait Scam

Hormuz Strait Scam: ప్రపంచ చమురు రవాణాకు వెన్నెముక వంటి హోర్ముజ్ జలసంధి ఇప్పుడు యుద్ధ భయంతోనే కాదు, అంతకు మించిన సైబర్ కేటుగాళ్ల మోసాలతో వణికిపోతోంది. యుద్ధ వాతావరణం వల్ల ఎక్కడికక్కడ నిలిచిపోయిన నౌకలను ఆసరాగా చేసుకుని, కొందరు అంతర్జాతీయ మోసగాళ్లు కోట్లాది రూపాయల క్రిప్టో కరెన్సీని దోచుకుంటున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

జలసంధిలో గందరగోళం:

ప్రస్తుతం ఈ ప్రాంతం ఇరాన్ ప్రాదేశిక జలాల పరిధిలో ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు రాకుండా ఇరాన్ ఇక్కడ మెరైన్ మైన్స్ అమర్చింది. స్పీడ్ బోట్ల ద్వారా అమర్చిన ఈ బాంబులు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. కేవలం ఇరాన్ నేవీ అధికారుల సమన్వయం ఉంటేనే నౌకలు క్షేమంగా బయటపడగలవు. ఈ క్లిష్ట పరిస్థితినే కేటుగాళ్లు తమ పెట్టుబడిగా మార్చుకున్నారు.

మోసం జరుగుతోంది ఇలా..

తాము ఇరాన్ నేవీ అధికారులమని చెబుతూ నకిలీ పత్రాలతో నౌకల యజమానులకు గాలం వేస్తున్నారు. "మాకు బిట్‌కాయిన్, టెథర్ లేదా ఇతర క్రిప్టో కరెన్సీ రూపంలో భారీగా నగదు చెల్లిస్తే, బాంబులు లేని సురక్షిత మార్గంలో మీ నౌకను దాటిస్తాం" అని నమ్మిస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఈ మాయలో పడి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాయి.

నిపుణుల హెచ్చరిక

ఈ మోసాల నేపథ్యంలో గ్రీక్ మ్యారిటైమ్ రిస్క్ మేనేజ్‌మెంట్ సంస్థ 'మార్కిన్క్స్' షిప్పింగ్ యజమానులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ నేవీ అధికారులు ఎప్పుడూ క్రిప్టో కరెన్సీలో డబ్బులు అడగరని గుర్తుంచుకోవాలి. నకిలీ ఏజెంట్ల మాటలు నమ్మి విలువైన వస్తువులను, డబ్బును పణంగా పెట్టొద్దని హెచ్చరించింది. జలసంధి దాటిన తర్వాత కూడా అమెరికా నేవీ ఆంక్షలు ఉంటాయని, కాబట్టి ప్రస్తుతానికి వేచి చూడటమే ఉత్తమమని సూచిస్తున్నారు. అయితే, ఎక్కువ సమయం షిప్పులు పోర్టుల్లోనే నిలిచిపోతే చమురు రవాణాకు అంతరాయం కలుగుతుంది. బయటకు వస్తే ఇబ్బందులు ఎదురౌతాయి.

ఈ నేపథ్యంలో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది షిప్పింగ్ సంస్థల పరిస్థితి. జలసంధిలో ఆగితే ఖర్చులు భారం, కదిలితే బాంబులు లేదా మోసగాళ్ల ముప్పు! ఈ సంక్షోభం చమురు ధరలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. సామాన్యుడికి భారం పెరగకముందే అంతర్జాతీయ యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story