Hormuz Strait Shipping: హోర్ముజ్‌ జలసంధిలో పునఃర్వైభవం కనిపిస్తుందా?

హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు మళ్లీ మందగించాయి. నౌకల సంఖ్య తగ్గడానికి కారణాలు, భద్రతా ఆందోళనలు, ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం తదితర అంశాలను తెలుసుకుందాం.

Balachander
Published on: 19 Aug 2026 10:03 AM IST
Hormuz Strait Shipping: హోర్ముజ్‌ జలసంధిలో పునఃర్వైభవం కనిపిస్తుందా?
X

Hormuz Strait Shipping: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' గుండా నౌకల ప్రయాణం మళ్లీ అనిశ్చితిలో పడింది. అంతర్జాతీయ రవాణా వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు పెరగకపోగా మరింత మందగించాయి.

తగ్గుతున్న నౌకల సంఖ్య ... క్లెప్లర్ గణాంకాలు

షిప్పింగ్ డేటా సంస్థ 'క్లెప్లర్'వెల్లడించిన సమాచారం ప్రకారం, మంగళవారం రోజున హోర్ముజ్ జలసంధిని కేవలం 6 నౌకలు మాత్రమే దాటాయి. దానికి క్రితం రోజున ఈ సంఖ్య 9గా ఉండగా, అంతకుముందు 10 రోజుల రోజువారీ సగటు 11 నౌకలుగా ఉండింది. గత సగటుతో పోలిస్తే నౌకల సంఖ్య తగ్గడం ఈ మార్గంలో నిలకడలేని పరిస్థితులకు అద్దం పడుతోంది. అయితే, నౌకలు రాకపోకలకు అనేక అడ్డంకులు ఉండటంతో రవాణా భారీ వ్యయంతో పాటు ప్రమాదకరంగా కూడా మారింది.

నౌకల రవాణా ఎందుకు మందగించింది?

ఈ మార్గంలో నౌకల ప్రయాణం వేగవంతం కాకపోవడానికి ప్రధానంగా స్పష్టత లోపమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. జలసంధి గుండా సురక్షితమైన ప్రయాణానికి సంబంధించి నౌకల యజమానులకు ఎలాంటి స్పష్టమైన సిగ్నల్స్ లేదా భద్రతా అభయం లభించడం లేదు. భద్రతా దృష్ట్యా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని అనేక నౌకాయాన సంస్థలు తమ నౌకలను ఈ మార్గంలోకి పంపడానికి వెనుకాడుతున్నాయి. ఇప్పటికే ఈ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు బయటకు వచ్చేందుకు చాలా సమయం పాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అంతేకాకుండా, కొన్న నౌకలపై దాడులు కూడా జరగడంతో ఈ మార్గంలో ప్రయాణం చేసేందుకు నౌకాయాన సంస్థలు ఆసక్తి చూపడం లేదు.

అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువులో దాదాపు ఐదో వంతు ఈ సరుకుల మార్గం గుండానే వెళ్తుంది. అందువల్ల, ఇక్కడ రవాణా నిలిచిపోవడం లేదా మందగించడం ప్రపంచ ఇంధన విపణిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికి రవాణా పుంజుకోవడానికి బదులు మరింత జాప్యం జరుగుతుండటంతో చమురు ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. అధికారులు సరైన భద్రతా మార్గదర్శకాలను విడుదల చేసి, నౌకలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తే తప్ప హోర్ముజ్ జలసంధిలో పాత వైభవం కనిపిస్తుందని చెప్పలేము.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story