Houthi Attacks Saudi Arabia : సౌదీపై హౌతీ దాడులు... చిక్కుల్లో పాక్‌ రక్షణ ఒప్పందం...

సౌదీ అరేబియాపై హౌతీల డ్రోన్లు, క్షిపణి దాడుల నేపథ్యంలో సౌదీ-పాక్ రక్షణ ఒప్పందం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ఎందుకు సైనిక జోక్యానికి దూరంగా ఉన్నదో తెలుసుకుందాం.

Balachander
Published on: 9 Sept 2026 12:38 PM IST
Houthi Attacks Saudi Arabia : సౌదీపై హౌతీ దాడులు... చిక్కుల్లో పాక్‌ రక్షణ ఒప్పందం...
X

Houthi Attacks Saudi Arabia : పశ్చిమాసియాలో యెమెన్‌కు చెందిన హౌతీ మూకలు సౌదీ అరేబియా చమురు మౌలిక వసతులు, అభ, జిజాన్ విమానాశ్రయాలు, ఎర్రసముద్రంలోని చమురు నౌకలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భయంకరమైన దాడులు చేశాయి. ఈ పరిణామం సౌదీ అరేబియా - పాకిస్తాన్ మధ్య కుదిరిన స్ట్రాటెజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ యొక్క ఆచరణాత్మక పాత్రపై తీవ్ర సందేహాలను లేవనెత్తింది. ఒకరిపై దాడి జరిగితే ఇరు దేశాలపై దాడి జరిగినట్లేనని ఒప్పందంలో పేర్కొన్నప్పటికీ, పాకిస్తాన్ సైన్యం సౌదీకి మద్దతుగా రంగంలోకి దిగకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

హౌతీ దాడులు ... సౌదీ ఆస్తులపై తీవ్ర ప్రభావం

హౌతీలు ఒకేసారి పదుల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడ్డారు. యాంబూ ఓడరేవు సమీపంలో సౌదీ జెండాతో వెళ్తున్న ముడిచమురు ట్యాంకర్‌పై క్షిపణి పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. అక్కడితో ఆగకుండా, అభ, జిజాన్ ప్రాంతాల్లోని ప్రాంతీయ విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడంతో పౌరులు గాయపడ్డారు, విమాన రాకపోకలకు విఘాతం కలిగింది. ఈ నేపథ్యంలో చమురు దిగ్గజ సంస్థ 'ఆరామ్‌కో'కు చెందిన కొన్ని కేంద్రాలు దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. చమురు ట్యాంకర్లు, విమానాశ్రయాలు, చమురు సంస్థలపై దాడులు జరగడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి.

మెక్కా డిఫెన్స్ ప్యాక్ట్ ఆశలు ... క్షేత్రస్థాయి యథార్థం

2025 చివరిలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల మధ్య ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అయితే, ఇటీవలే ఈ రెండు దేశాలతో పాటు ఈ కూటమిలో టర్కీకూడా చేరింది. అటాక్ ఆన్ వన్ ఈజ్ అటాక్ ఆన్ ఆల్ అనే ఈ నిబంధన ప్రకారం 80,000 మంది పాక్ బలగాలు సౌదీకి వస్తాయని అంచనా వేసినప్పటికీ, ప్రత్యక్షంగా ఎలాంటి పాక్ యుద్ధ విమానాలు గానీ, నావికాదళ యుద్ధనౌకలు గానీ రంగంలోకి దిగలేదు. ఈ ఒప్పందం కేవలం కాగితాల వరకే పరిమితం అయిందా, క్షేత్రస్థాయిలో బలగాల మోహరింపు శూన్యమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అటు ఈ అంశంపై కూటమిలో చేరిన టర్కీ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.

పాకిస్తాన్ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు?

పాకిస్తాన్ సైనిక నాయకత్వం ఈ యుద్ధంలో నేరుగా పాల్గొనకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. యెమెన్ సంక్షోభంలో పాకిస్తాన్ తటస్థంగా ఉండాలని 2015లో పాక్ పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. మక్కా, మదీనా పవిత్ర నగరాలకు ప్రత్యక్ష ముప్పు వస్తే తప్ప పాక్ దళాలు యుద్ధంలోకి దిగవు. అంతేకాదు, పాకిస్తాన్‌కు ఇరాన్‌తో 900 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ఉంది. హౌతీలకు మద్దతు ఇస్తున్న ఇరాన్‌ను కాదని దాడులు చేస్తే సరిహద్దు వద్ద నాలుగో యుద్ధ రంగాన్ని తెరవాల్సి వస్తుందని ఇస్లామాబాద్ భయపడుతోంది. అంతేకాదు, పాక్ సైన్యం ఇప్పటికే భారత్ సరిహద్దు, ఆఫ్ఘన్ సరిహద్దు, బలూచిస్తాన్‌లో తిరుగుబాట్లను ఎదుర్కొంటూ బిజీగా ఉంది. ఈ మూడు భూభాగాల నుంచి నిత్యం ఏదో విధంగా భయాన్ని ఎదుర్కొంటోంది. బలూచ్‌లో నిత్యం కాల్పులు జరుగుతున్నాయి. అటు, ఆఫ్ఘన్‌ సరిహద్దులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తుంటాయి. ఇండియా జోలికి వస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్‌కి తెలుసు. దీంతోపాటు పాకిస్తాన్‌లో హౌతీలకు మద్దతు పలికే 15 నుండి 20 శాతం ఉన్న షియా జనాభాలో అంతర్గత అశాంతి చెలరేగే అవకాశం ఉంది. ఇది ఆ దేశ రాజకీయ, భౌగోళిక అంశాల్లో కలకలం రేపే అవకాశం ఉంటుంది. అందుకే పాకిస్తాన్‌ ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, సౌదీ అరేబియా కూడా ఈ సంక్షోభాన్ని ముగించేందుకు పాక్ దళాలపై ఆధారపడకుండా, అమెరికా రక్షణ వ్యవస్థలైన పీఏసీ 3, థాడ్‌ క్షిపణి నిరోధక వ్యవస్థలు, అంతర్జాతీయ దౌత్య మార్గాలపైనే ఎక్కువ దృష్ట్యా సాధిస్తోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story