Human Brain:షాకింగ్‌ పరిశోధన... అంతరిక్షంలో మెదడు ఇలా ఎందుకు మారిపోతుంది

అంతరిక్షంలో శూన్య గురుత్వాకర్షణ వల్ల మానవ మెదడులో ఎలాంటి మార్పులు వస్తాయి? కొత్త పరిశోధనలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అవేంటో తెలుసుకుందాం.

Balachander
Published on: 10 July 2026 12:47 PM IST
Human Brain:షాకింగ్‌ పరిశోధన... అంతరిక్షంలో మెదడు ఇలా ఎందుకు మారిపోతుంది
X

Human Brain: భూమిపై ఉన్న 400 కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో మానవ శరీరం ఇక్కడి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా రూపుదిద్దుకుంది. అయితే, అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు శూన్య గురుత్వాకర్షణ వల్ల ఎముకలు, కండరాలు బలహీనపడతాయని మనకు తెలుసు. కానీ, అంతరిక్ష ప్రయాణం వల్ల మానవ మెదడు తన నిర్మాణాన్ని, పనితీరును స్వయంగా మార్చేసుకుంటుందని, సరికొత్తగా రీవైరింగ్ చేసుకుంటుందని బ్రిటన్‌లోని బర్క్‌బెక్ శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన కోసం అంతరిక్ష వ్యోమగాములు, భూమిపై అనుకరణ ప్రయోగాల్లో పాల్గొన్న 377 మందిపై చేసిన 15 బ్రెయిన్ ఇమేజింగ్ అధ్యయనాల డేటాను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా విశ్లేషించారు. అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ , చైనా వంటి శక్తులు రాబోయే కాలంలో చంద్రుడిపైకి, అంగారక గ్రహం పైకి మానవ సహిత యాత్రలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నివేదిక అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

మెదడులో మారుతున్న విభాగాలు

భూమిపై మనం కాఫీ కప్పు పట్టుకున్నా, నడిచినా మనకు తెలియకుండానే మెదడు ఇక్కడి గ్రావిటీని లెక్కగట్టి కండరాలను నియంత్రిస్తుంది. గర్భంలో పిండం ఎదుగుతున్నప్పుడు అది స్వీకరించే మొదటి సిగ్నల్ గురుత్వాకర్షణే. అయితే అంతరిక్షంలో గ్రావిటీ లేకపోవడంతో, శరీర సమతుల్యత, కదలికలు, శారీరక స్పృహను నియంత్రించే మెదడులోని భాగాలు భౌతికంగా మారిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా వివిధ సంకేతాలను ప్రాసెస్ చేసే ‘ఒపెర్క్యులమ్’ అనే విభాగంలో తీవ్ర మార్పులు వస్తున్నాయి.

భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు ముప్పు?

ఈ మార్పులు వ్యోమగాములకు అంతరిక్షంలో ఉన్నంతకాలం సహాయపడతాయి. కానీ, వారు తిరిగి భూమిపైకో లేదా వేరే గ్రహంపైకో మారేటప్పుడు తీవ్ర సమస్యగా మారుతుంది. గతంలో అపోలో వ్యోమగాములు చంద్రునిపై నడిచేటప్పుడు పడిపోవడానికి కారణం కేవలం వారి స్పేస్ సూట్ బరువు మాత్రమే కాదు, వారి మెదడు చంద్రుని గ్రావిటీకి అలవాటు పడకపోవడమే. దాదాపు 8 నెలల పాటు ప్రయాణించి వ్యోమగాములు అంగారక గ్రహంపై ల్యాండ్ అయినప్పుడు, అక్కడి తక్కువ గురుత్వాకర్షణ శక్తి కారణంగా వారి మెదడు తక్షణ నిర్ణయాలు తీసుకోలేక గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. భూమితో రియల్ టైమ్ కమ్యూనికేషన్ లేని ఆ సమయంలో ఇది అత్యంత ప్రమాదకరం.

సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్లు అంతరిక్ష నౌకల్లో కృత్రిమ గురుత్వాకర్షణను సృష్టించడం దీనికి ఒక పరిష్కారమే అయినా, దానికి విపరీతమైన బడ్జెట్, భారీ సాంకేతికత అవసరమవుతాయి. ప్రస్తుతానికి, మెదడులోని నిర్దిష్ట భాగాలను చిన్న విద్యుత్ ప్రవాహాల ద్వారా ప్రేరేపించి, ఈ మార్పులను తట్టుకునేలా చేసే సరికొత్త వైద్య విధానాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఈ పరిశోధన రాబోయే అంతర్జాతీయ రాజకీయాలను, అంతరిక్ష పోటీని శాసించబోతోందని నిపుణులు భావిస్తున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story