షాకింగ్: బాలిక పట్ల హ్యూమనాయిడ్ రోబో అసభ్య ప్రవర్తన.. పోలీసులు ఏం చేశారంటే?
Humanoid Robot: జర్మనీలో 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన హ్యూమనాయిడ్ రోబో. రోబోను స్వాధీనం చేసుకుని, లైవ్ స్ట్రీమింగ్ చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన కొలోన్ పోలీసులు.
షాకింగ్: బాలిక పట్ల హ్యూమనాయిడ్ రోబో అసభ్య ప్రవర్తన.. పోలీసులు ఏం చేశారంటే?
Humanoid Robot: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సరికొత్త సవాళ్లు, వింత నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జర్మనీ దేశంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే ఘటన చోటుచేసుకుంది. కొలోన్ (Cologne) నగర వీధుల్లో ఒక హ్యూమనాయిడ్ (మనిషి రూపాంతరం కలిగిన) రోబో.. 16 ఏళ్ల టీనేజ్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన కొలోన్ పోలీసులు రోబోను స్వాధీనం చేసుకోవడంతో పాటు, దాని వెనుక ఉన్న ఇద్దరు యువకులను నిందితులుగా అనుమానిస్తూ విచారణ వేగవంతం చేశారు.
జర్మనీలోని కొలోన్ నగర వీధిలోని ఒక రెస్టారెంట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న 16 ఏళ్ల బాలిక వెనుక నుంచి వచ్చిన రోబో.. ఆమెను అసభ్యకర రీతిలో తాకడంతో పాటు అనుచిత సంజ్ఞలు చేసింది.
సుమారు 4 అడుగుల ఎత్తు, ఎరుపు-బంగారు వర్ణంలో ఉన్న ఈ రోబోకు బట్టలు, స్పెక్స్ తొడిగారు. ఇద్దరు యువకులు (16 ఏళ్లు మరియు 19 ఏళ్ల వయస్సు గలవారు) ఈ రోబోను రిమోట్ ద్వారా నియంత్రిస్తూ సోషల్ మీడియాలో (టిక్టాక్) లైవ్ స్ట్రీమింగ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ఒక కారు ట్రంక్లో దాచిన రోబోను, ఆ ఇద్దరు యువకుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ రోబో ముందే ప్రోగ్రామ్ చేయబడి నడుస్తోందా? లేక యువకులు ఉద్దేశపూర్వకంగానే లైవ్లో వ్యూస్ కోసం రోబోతో మహిళలను వేధిస్తున్నారా? అనే కోణంలో డెవలపర్లు, డిజిటల్ నిపుణుల సాయంతో పోలీసులు విచారిస్తున్నారు.
"ఇలాంటి విచిత్రమైన, వినూత్న నేర ఘటనను ఎదుర్కోవడం మాకు ఇదే తొలిసారి" అని కొలోన్ పోలీస్ ప్రతినిధి క్రిస్టోఫ్ బెర్మెల్ ఏపీ (Associated Press) వార్తా సంస్థకు వెల్లడించారు.
బాధితురాలిని కించపరిచేలా నెటిజన్లు కామెంట్లు చేయడం, ఈ ఘటనను వినోదంగా భావించి వీడియోలను వైరల్ చేయడంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. బాధితుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.




