IMF Asia Economic Slowdown: భయపెడుతున్న ఏఎంఎఫ్ రిపోర్ట్...కఠినంగా వ్యవహరించకుంటే కష్టకాలమే
IMF Asia Economic Slowdown: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి.
IMF Asia Economic Slowdown
IMF Asia Economic Slowdown: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. దీని ఈ ప్రభావం అత్యధికంగా ఆసియా దేశాలపై పడుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పేర్కొంది. చమురు, గ్యాస్ దిగుమతులపై అధిక ఆధారపడటం ఆసియా ఆర్థిక వ్యవస్థలను బలహీనపరచే ప్రమాదం ఉందని తాజా నివేదిక స్పష్టం చేసింది. రాబోయే రెండేళ్లు కఠిన పరీక్షాకాలంగా మారనుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది.
ఆర్థిక గమనంలో ఆసియా స్థానం
ప్రపంచ ఆర్థిక గమనంలో ఆసియా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఆసియా దేశాల జీడీపీపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఐఎంఎఫ్ ఆసియా-పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐరోపా దేశాలతో పోలిస్తే ఆసియా దేశాలు ఇంధన దిగుమతులపై రెట్టింపు ఆధారపడుతున్నాయి. చమురు ధరలు ఏమాత్రం పెరిగినా, ఆ భారం సామాన్యుడి జేబును గుల్ల చేయడమే కాకుండా దేశాల ఆర్థిక లోటును పెంచుతుంది. ఆసియా దేశాల్లో చమురు, గ్యాస్ వినియోగం జీడీపీలో సుమారు 4% వరకు ఉంది. ఈ ప్రాంతంలో నికర ఇంధన దిగుమతులు జీడీపీలో 2.5% వరకు ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సరఫరాలో అంతరాయం కలిగితే లేదా ధరలు పెరిగితే, ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా ఒత్తిడికి గురయ్యే అవకాశముంది.
IMF Asia Economic Slowdown: భయపెడుతున్న ఏఎంఎఫ్ రిపోర్ట్...కఠినంగా వ్యవహరించకుంటే కష్టకాలమే
ఐఎంఎఫ్ అంచనా ప్రకారం, ఆసియా దేశాల వృద్ధిరేటు 2025లో 5 శాతం ఉండగా, 2026లో 4.4శాతానికి, 2027లో 4.2 శాతానికి తగ్గే అవకాశం ఉన్నట్టుగా అంచనా. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఈ విధంగానే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారుతుందని, దేశాలు ప్రమాదకరమైన స్థితిని ఎదుర్కొంటాయని ఐఎంఎఫ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో వృద్ధి 1 నుంచి 2 శాతం పాయింట్లు తగ్గవచ్చు అని హెచ్చరికలు ఉన్నాయి.
ఇంధన రంగంలో మార్పులు వచ్చి ధరలు పెరిగితే దాని ప్రభావం తయారీ రంగంపై కూడా పడే అవకాశం ఉంటుంది. గ్యాస్ కొరత, రసాయనాల ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరిగి, వినియోగదారులపై భారం పడుతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశముంది. ఆసియాలో ద్రవ్యోల్భణం 2025లో 1.4 శాతం ఉండగా 2026లో 2.6 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఐఎంఎఫ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆసియా దేశాల కేంద్ర బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కఠిన ఆర్థిక విధానాలు అమలు చేయాలని తెలియజేసింది. ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడితే ఆసియా దేశాలకు ఆర్థికంగా కష్టకాలం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కష్టకాలంలో పొదుపు మంత్రం పాటించడమే దేశాలకు శ్రీరామరక్ష. మన ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులను తట్టుకోవాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి.




