Imran Khan: పాక్ రాజకీయాల్లో 'సైఫర్' బాంబ్: ఇమ్రాన్ ఖాన్ పదవి ఊడగొట్టింది అమెరికానే..
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి ఊడటానికి అమెరికానే కారణమనే వాదనలకు బలం చేకూరుస్తూ ఒక రహస్య దౌత్య పత్రం లీకైంది.
Imran Khan: పాక్ రాజకీయాల్లో 'సైఫర్' బాంబ్: ఇమ్రాన్ ఖాన్ పదవి ఊడగొట్టింది అమెరికానే..
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించడం వెనుక అమెరికా (USA) హస్తం ఉందనే ఆరోపణలు మరోసారి అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పతనం వెనుక అమెరికా అగ్రనేతల ఒత్తిడి ఉందనే విషయాన్ని స్పష్టం చేసే అత్యంత రహస్య దౌత్య సమాచారం (Cypher) తాజాగా లీక్ అయ్యింది. ఈ వివాదానికి సంబంధించిన అసలు అధికారిక పత్రాన్ని ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ పత్రిక 'డ్రాప్ సైట్' (Dropsite) బహిర్గతం చేసింది.
లీకైన పత్రాల వివరాల ప్రకారం.. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కొద్దిరోజుల ముందు ఒక కీలక పరిణామం జరిగింది. అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్‌తో అమెరికా హోంశాఖలోని దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించి, జైల్లో పెట్టాలని.. అప్పుడే అమెరికా-పాక్ ద్వైపాక్షిక బంధం మరింత బలపడుతుందని డోనాల్డ్ లూ వ్యాఖ్యానించినట్లు ఆ దౌత్య పత్రాల ద్వారా స్పష్టమవుతోంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనకు వెళ్లడమే కాకుండా, ఈ యుద్ధంలో తటస్థ వైఖరిని అవలంబించారు. అమెరికా ఒత్తిడి తెచ్చినప్పటికీ రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఇమ్రాన్ నిరాకరించారు. ఈ మొండి వైఖరి కారణంగానే ఆయన్ను పాక్ ప్రధాని పీఠం నుంచి ఎలాగైనా తప్పించాలని అమెరికా గట్టిగా నిర్ణయించుకున్నట్లు ఈ లీకైన సమాచారం ద్వారా వెల్లడవుతోంది. ఇమ్రాన్ దిగిపోయిన వెంటనే అమెరికాకు అనుకూలుడైన షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఇక్కడ గమనార్హం.
వాస్తవానికి పాక్ రాయబారి, అమెరికా అధికారుల మధ్య భేటీ జరిగిన కొద్దిరోజులకే.. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్‌లో ఒక భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు. తన చేతిలో ఒక రహస్య పత్రాన్ని చూపిస్తూ.. తనను పదవి నుంచి తొలగించడానికి స్థానిక ప్రతిపక్ష పార్టీలు, కొందరు అధికారులతో కలిసి అమెరికా విదేశీ కుట్ర పన్నుతోందని బహిరంగంగా ఆరోపించారు. అయితే, నాడు ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను అటు అమెరికా ప్రభుత్వం, ఇటు పాక్ విపక్షాలు పూర్తిగా ఖండించాయి. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్ పదవి కోల్పోవడం, తోషాఖానా అవినీతి కేసులో ఆయనకు జైలు శిక్ష పడటం జరిగాయి. నాటి నుంచి నేటి వరకు ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మగ్గుతుండగా.. ఇప్పుడు ఈ అధికారిక పత్రాలు లీక్ అవ్వడం పాక్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.




