ఆరేళ్ల తర్వాత భారత్-చైనా షిప్కీ లా వాణిజ్య మార్గం ఓపెన్
ఆరేళ్ల విరామం తర్వాత హిమాచల్ షిప్కీ లా మార్గంలో భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభమైంది. సిల్క్ రూట్‌కు కొత్త ఊపు.
Shipki La reopening
Shipki La reopening : చారిత్రక సిల్క్ రూట్‌లో కీలకమైన భారత్-చైనా వాణిజ్య మార్గం మళ్లీ తెరుచుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న షిప్కీ లా పాస్ ద్వారా సరిహద్దు వాణిజ్యం శనివారం నుంచి పునఃప్రారంభమైంది. కరోనా మహమ్మారి, సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా 2020 నుంచి నిలిచిపోయిన ఈ వాణిజ్య మార్గం దాదాపు ఆరేళ్ల తర్వాత తిరిగి అందుబాటులోకి వచ్చింది.
సట్లెజ్ లోయలో సముద్ర మట్టానికి 3,930 మీటర్ల ఎత్తులో ఉన్న షిప్కీ లా పాస్ కిన్నౌర్ ప్రాంతాన్ని చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌తో అనుసంధానిస్తుంది. ఈ కాలానుగుణ వాణిజ్యం నవంబర్ 30 వరకు కొనసాగనుంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, రవాణా రంగం, పర్యాటక అభివృద్ధికి ఊతం లభించనుంది.
షిప్కీ లా వాణిజ్యంలో శతాబ్దాల నాటి వస్తు మార్పిడి విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇతర సరిహద్దు వాణిజ్య కేంద్రాలకు భిన్నంగా ఇక్కడ కరెన్సీకి బదులుగా వస్తువుల మార్పిడి పద్ధతి అమల్లో ఉంటుంది. సరిహద్దు వరకు రవాణా చేసిన సరుకులను ప్యాక్ జంతువుల ద్వారా టిబెట్ ప్రాంతంలోని నిర్ణీత మార్పిడి కేంద్రానికి తరలిస్తారు.
వ్యాపారుల రిజిస్ట్రేషన్, కస్టమ్స్ అనుమతుల కోసం కొత్తగా ఛుప్పన్ ట్రేడ్ మార్ట్‌ను ప్రారంభించారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), స్థానిక అధికారులు పర్యవేక్షణలో వ్యాపారులు అనుమతులు పొందాల్సి ఉంటుంది. లావాదేవీలు పూర్తి చేసి 72 గంటల్లోగా తిరిగి భారత్‌కు రావాల్సి ఉంటుంది.
ఈ మార్గం ద్వారా భారత్ నుంచి ఎండుద్రాక్ష, మసాలాలు, టీ, కాఫీ, ధాన్యాలు, చేనేత వస్త్రాలు, రాగి పాత్రలు, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు, స్థానిక ఔషధ మూలికలను ఎగుమతి చేయనున్నారు. టిబెట్ నుంచి పష్మీనా, ముడి ఉన్ని, యాక్ వెంట్రుకలు, గొర్రె చర్మాలు, కార్పెట్లు, చైనా మట్టి, సంప్రదాయ ఔషధ ఉత్పత్తులు దిగుమతి కానున్నాయి.
అయితే జిల్లాలో జంతు నిర్బంధ కేంద్రాల సదుపాయం లేకపోవడంతో గుర్రాలు, మేకలు, గొర్రెల వంటి జీవ జంతువుల వాణిజ్యాన్ని ప్రస్తుత సీజన్‌కు నిలిపివేశారు.
భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ఉన్నతస్థాయి చర్చల నేపథ్యంలో సరిహద్దు వాణిజ్య పునరుద్ధరణ కీలక పరిణామంగా మారింది.




