ఒడెస్సా నౌక దాడిపై భారత్ ఆగ్రహం.. రష్యాకు జైశంకర్ హెచ్చరిక

ఒడెస్సా కార్గో నౌకపై దాడిని భారత్ ఖండించింది. భారత నావికుల భద్రతపై జైశంకర్ రష్యాకు ఆందోళన వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 July 2026 12:20 AM IST
India Condemns Odesa Ship Attack
X

India Condemns Odesa Ship Attack

ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు నుంచి బయలుదేరిన వాణిజ్య నౌక ఎంవీ గోల్డెన్ లియోపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో నలుగురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంతో భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మనీలాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశమై భారత నావికుల భద్రతపై గట్టిగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా భారత్–రష్యా ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, విజ్ఞాన సాంకేతికత, ప్రజల రాకపోకలు వంటి అంశాలతో పాటు ఉక్రెయిన్ యుద్ధం, గల్ఫ్ ప్రాంత పరిస్థితులపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించారు.

జూలై 19న ఒడెస్సా పోర్టు నుంచి బయలుదేరిన ఎంవీ గోల్డెన్ లియో నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు మృతి చెందారు. ఆ సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు.

ఈ ఘటన అనంతరం భారత్ ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖకు రష్యా ఛార్జ్ డి'అఫైర్స్ వ్లాదిమిర్ లడనోవ్‌ను పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌరుల ప్రాణనష్టం జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భారత్ స్పష్టం చేసింది.

ఇక ఈ ఏడాది మేలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా ఉక్రెయిన్, పశ్చిమాసియా పరిస్థితులతో పాటు ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి సంభాషణ, దౌత్యమే మార్గమని భారత్ తన వైఖరిని మరోసారి వెల్లడించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story