India At UN: ‘మిగిలింది పీఓకే ఒక్కటే!’: పాకిస్థాన్‌కు చెక్ పెట్టిన భారత్

India At UN: ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 23 July 2026 11:01 AM IST
India At UN: ‘మిగిలింది పీఓకే ఒక్కటే!’: పాకిస్థాన్‌కు చెక్ పెట్టిన భారత్
X

‘మిగిలింది పీఓకే ఒక్కటే!’: పాకిస్థాన్‌కు చెక్ పెట్టిన భారత్

India At UN: ఐక్యరాజ్యసమితి (UN) భద్రతా మండలి వేదికగా భారత్ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా మార్చుకున్న పాకిస్థాన్.. అసత్య ప్రచారాలతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమేనని, కశ్మీర్ విషయంలో ఇంకా మిగిలి ఉన్న ఏకైక అంశం పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) మాత్రమేనని గట్టిగా తేల్చిచెప్పింది.

ఐరాస భద్రతా మండలిలో జరిగిన ఉన్నతస్థాయి చర్చ సందర్భంగా పాకిస్థాన్ ప్రతినిధి ఉద్దేశపూర్వకంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ దాయాది దేశానికి దీటైన బదులిచ్చారు. ఐరాస వేదికగా ఇతర అంశాలను చర్చించడం తమ ఉద్దేశం కాదని.. కానీ పాక్ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడమే తమ నైతిక బాధ్యతని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమనేది చట్టపరమైన, తిరుగులేని వాస్తవమని గుర్తుచేశారు.

సింధు జలాల ఒప్పందం (Indus Water Treaty) గురించి ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో తమ విధానంలో ఎలాంటి మార్పు లేదని హరీశ్ పునరుద్ఘాటించారు. "ఏదైనా ఒప్పందం సాఫీగా సాగాలంటే పరస్పర విశ్వాసం, సత్సంకల్పం చాలా ముఖ్యం. ఒకవైపు సీమాంతర ఉగ్రదాడులకు పాల్పడుతూ, మరోవైపు ఇలాంటి దౌత్యపరమైన ఒప్పందాల నుంచి ప్రయోజనాలు పొందాలని చూస్తే కుదరదు" అని దుయ్యబట్టారు.

అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై నిరాధారమైన ఆరోపణలు చేయడం మాని, పాకిస్థాన్ ముందుగా తన సొంత దేశంలోని అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని హరీశ్ తీవ్ర స్వరంతో హితవు పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story