Russia Ukraine War: ట్రంప్ వల్ల కాలేదు కానీ.. రష్యా-యుక్రెయిన్ యుద్దానికి భారత్ చెక్?
నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శాంతి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
Russia Ukraine War
Russia Ukraine War: నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శాంతి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన అనేక ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, భారత్ అందించిన త్రీ ఫార్ములా శాంతి ప్రతిపాదనపై రెండు దేశాలు సానుకూలంగా స్పందించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా ఇద్దరూ భారత ప్రతిపాదన అత్యంత సమగ్రమైనదని ప్రశంసించారు.
రష్యా స్పందన.. ధన్యవాదాలు తెలిపిన క్రెమ్లిన్
క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ విలేకరులతో మాట్లాడుతూ యుక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ చూపుతున్న చొరవను స్వాగతించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాక్టికల్ పరిష్కారం దిశగా భారత్ ఇస్తున్న సూచనలకు రష్యా ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసింది. ప్రధాని మోదీ వద్ద యుద్ధాన్ని నిలిపివేసేందుకు అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇటీవల వ్యాఖ్యానించారు.
భారత్ ప్లాన్ అదిరింది
యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా మాట్లాడుతూ తమ ముందు టర్కీ, ఈజిప్ట్, అమెరికా సహా నాలుగు దేశాల శాంతి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, భారత్ ఇచ్చిన ప్రతిపాదన అత్యంత స్పష్టంగా ఉందన్నారు. ఇంధన రంగాలు, నల్లసముద్రం ద్వారా జరిగే వ్యాపారంపై దాడుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇరుదేశాలు ఒకేసారి ఈ నిబంధనలకు అంగీకరిస్తే కాల్పుల విరమణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
భారత్ ప్రతిపాదించిన ఆ 3 సూత్రాలు ఇవే
యుద్ధం వల్ల తీవ్రంగా దెబ్బతింటున్న ఆర్థిక అంశాలపై భారత్ దృష్టి సారించింది. మొదటిది రెండు దేశాలు ఒకరి ఇంధన వనరులు, పవర్ ప్లాంట్లపై దాడులు వెంటనే ఆపాలి. రెండోది నల్లసముద్రం మీదుగా ఆహార ధాన్యాలు, చమురు రవాణాను సురక్షితంగా సాగనివ్వాలి. మూడోది ఆ ప్రాంతంలో తిరిగే వాణిజ్య నౌకలపై ఎలాంటి కాల్పులు జరపకూడదు. ఈ ప్రణాళికతో యుద్ధ తీవ్రత తగ్గి శాంతి నెలకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రపంచ శాంతి స్థాపకుడిగా భారత్ ఎదుగుదల
రష్యా, యుక్రెయిన్ రెండింటితోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తున్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దౌత్య చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని భారత్ స్పష్టం చేస్తూ వచ్చింది. తుది ఒప్పందం కుదిరితే నాలుగేళ్ల ఘోరమైన యుద్ధానికి తెరపడటంతో పాటు ప్రపంచ ఆర్థిక రంగానికి, సరఫరా వ్యవస్థకు పెద్ద ఊరట లభిస్తుంది.




