India Russian oil imports: రష్యానుంచి భారీగా ఇంధనం..మార్చిలో మూడు రెట్లు పెరిగిన కొనుగోలు
India Russian oil imports: యుద్ధం కారణంగా ప్రపంచంలో చమురుకు తీవ్రమైన కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి.
India Russian oil imports: రష్యానుంచి భారీగా ఇంధనం..మార్చిలో మూడు రెట్లు పెరిగిన కొనుగోలు
India Russian oil imports: యుద్ధం కారణంగా ప్రపంచంలో చమురుకు తీవ్రమైన కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలను నియంత్రించేందుకు భారత్ రష్యావైపు మరింత మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో 2026 మార్చి నెలలో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న చమురు పరిమాణం ఏకంగా మూడు రెట్లు పెరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
రష్యా నుంచి భారీగా కొనుగోలు
సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) నివేదిక ప్రకారం, మార్చిలో భారత్ రష్యా నుంచి సుమారు 5.8 బిలియన్ యూరోలు విలువైన హైడ్రోకార్బన్‌లను కొనుగోలు చేసింది. ఇందులో 91 శాతం అంటే సుమారు 5.3 బిలియన్ యూరోలు ముడి చమురే కావడం గమనార్హం. మిగతా భాగంలో బొగ్గు 337 మిలియన్ యూరోలు, ఇతర చమురు ఉత్పత్తులు 178.5 మిలియన్ యూరోలు ఉన్నాయి. ఫిబ్రవరిలో ఈ మొత్తం కేవలం 1.8 బిలియన్ యూరోలు మాత్రమే. కానీ ఈ తరువాత నెలరోజుల్లోనే భారీ పెరుగుదల నమోదైంది.
అమెరికా నిర్ణయమే కారణం
ఈ అకస్మాత్తు పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా తీసుకున్న నిర్ణయం. ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరగడంతో, రష్యా చమురుపై అమెరికా తాత్కాలికంగా ఒక నెలపాటు ఆంక్షలను సడలించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న భారత్ ప్రభుత్వరంగ రిఫైనరీలు మళ్లీ భారీగా కొనుగోళ్లు ప్రారంభించాయి. ఫలితంగా రిఫైనరీల దిగుమతుల్లో 148 శాతం పెరుగుదల నమోదైంది. గతంలో కొనుగోళ్లు నిలిపివేసిన మంగళూరు, విశాఖపట్నం రిఫైనరీలు కూడా మళ్లీ చురుకుగా మారాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రష్యా చమురు కొనుగోలులో భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా 51శాతం వాటాతో మొదటి స్థానంలో, 38 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలోనూ, 6 శాతం వాటాతో తుర్కియే మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రష్యా ఎగుమతుల్లో 90శాతం చమురు చైనా, భారత్‌లకే వెళ్లడం విశేషం.
మొత్తంగా చూసుకుంటే.. యూరోపియన్ యూనియన్ నిషేధం ఉన్నప్పటికీ, రష్యా చమురు పరోక్షంగా పశ్చిమ దేశాలకు చేరుతూనే ఉంది. భారత్ వంటి దేశాలు శుద్ధి చేసిన ఇంధనాన్ని తిరిగి యూరప్, అమెరికాలకు ఎగుమతి చేస్తున్నాయి. భారత్ చమురు వ్యూహం అంతర్జాతీయ మార్కెట్‌లో కీలకంగా మారుతోంది.




