Hormuz Attack: హోర్ముజ్ దాడిపై భారత్ ఆగ్రహం.. వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే ఆపాలంటూ ఇరాన్‌కు హెచ్చరిక
Hormuz Attack: హోర్ముజ్ జలసంధిలో భారతీయ నావికుడు మృతి చెందిన ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే ఆపాలని ఇరాన్‌కు హెచ్చరించింది.
Hormuz Attack
హోర్ముజ్ జలసంధిలో రెండు వాణిజ్య చమురు ట్యాంకర్లపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఓ భారతీయ నావికుడు మృతి చెందగా, మరో ఆరుగురు భారతీయులు సహా పలువురు గాయపడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేసింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఢిల్లీలోని ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మొహమ్మద్ జవాద్ హొస్సేనీని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలు, నావికులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది.
30 మంది భారతీయులు ప్రయాణం
దాడికి గురైన ఎంటీ అల్ బహియాహ్, ఎంటీ మొంబాసా ట్యాంకర్లలో మొత్తం 46 మంది సిబ్బంది ఉండగా, వారిలో 30 మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఎంటీ అల్ బహియాహ్‌లో ఉన్న 12 మంది భారతీయుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
భారత్ తీవ్ర ఖండన
ఈ ఘటనపై విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత, సురక్షిత నౌకాయానాన్ని అడ్డుకునే దాడులు అంగీకారయోగ్యం కాదని పేర్కొంది. వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే ఆగాలని, పశ్చిమాసియాలో హింసకు ముగింపు పలికి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని భారత్ పిలుపునిచ్చింది.
పెరుగుతున్న ఆందోళన
హోర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ సముద్ర వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అధికారిక సమాచారం ప్రకారం, ఘర్షణలు తీవ్రరూపం దాల్చిన తర్వాత ఇప్పటివరకు 11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో కూడా అమెరికా దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన విషయం తెలిసిందే.




