Indian-Origin Pilot: పెళ్లయిన కొన్ని గంటలకే ఘోర విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి వరుడు మృతి..

Indian-Origin Pilot: అమెరికాలోని జార్జియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లయిన కొన్ని గంటలకే కేరళ మూలాలున్న భారత సంతతి వరుడు డేవ్‌ ఫిజీ (25) హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

Arun Chilukuri
Published on: 1 Jun 2026 11:04 AM IST
Indian-Origin Pilot
X

Indian-Origin Pilot: పెళ్లయిన కొన్ని గంటలకే ఘోర విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి వరుడు మృతి..

Indian-Origin Pilot: అప్పటివరకు పెళ్లి వేడుకలో బంధుమిత్రుల కోలాహలం.. నూతన వధూవరుల నవ్వులు.. అంతలోనే ఊహించని ఒక ప్రమాదం ఆ కుటుంబంలో తీరని చీకట్లను నింపింది. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే హెలికాప్టర్ ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు వరుడిని బలితీసుకుంది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానిక ప్రవాస భారతీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

అమెరికాలోని ప్రముఖ డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్న డేవ్‌ ఫిజీ (25) అట్లాంటాలో నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే ఇతడి తల్లిదండ్రులు కేరళలోని ఎర్నాకుళం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. మే 29న జార్జియాలోని డాసన్‌ విలె ప్రాంతంలో డేవ్‌ ఫిజీకి, కేరళ మూలాలున్న జెస్ని అనే యువతితో ఎంతో వైభవంగా వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు, బంధువుల సమక్షంలో పెళ్లి వేడుకలు ఎంతో సంతోషంగా ముగిశాయి.

వివాహ వేడుకలు ముగిసిన అనంతరం రాత్రి 10 గంటల సమయంలో, డాసన్‌విలెలోని మ్యారేజ్ వెన్యూ (వేదిక) నుంచి కొత్త దంపతులు ఇద్దరూ హెలికాప్టర్‌లో బయల్దేరారు. వారు అట్లాంటాలోని ఒక ప్రముఖ హోటల్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే, దురదృష్టవశాత్తూ ఆ సమయంలో వాతావరణం చాలా ప్రతికూలంగా మారింది. దట్టమైన మబ్బులు, వాతావరణ మార్పుల కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నియంత్రణ కోల్పోయిన హెలికాప్టర్.. సమీపంలోని ఒక పర్వత ప్రాంతంలో కూలిపోయింది.

ఈ ఘోర ప్రమాదంలో వరుడు డేవ్‌ ఫిజీతో పాటు హెలికాప్టర్ నడుపుతున్న పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి హెలికాప్టర్ శిథిలాల కింద వధువు జెస్ని చిక్కుకుపోయి నరకయాతన అనుభవించింది. అధికారులు తీవ్ర శ్రమించి ఆమెను ప్రాణాలతో బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.

"వాతావరణం అనుకూలంగా లేదని, ఇప్పుడు ప్రయాణించడం క్షేమం కాదని డేవ్ మొదట నాతో చెప్పాడు. కానీ ఎక్కువ ఎత్తులో వెళ్తే ప్రమాదం ఉండదనే నమ్మకంతో చివరకు హెలికాప్టర్‌లో బయల్దేరారు" అని డేవ్ తండ్రి జార్జ్ ఫిజీ కన్నీరుమున్నీరయ్యారు. కళ్లెదుటే కొడుకు ప్రాణాలు కోల్పోవడం, కోడలు జెస్ని తీవ్ర షాక్‌లోకి వెళ్లిపోవడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది.

ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అమెరికా విమానయాన అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక నివేదిక 30 రోజుల్లోగా అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story