Vulture Journey : భోపాల్ టు పాకిస్థాన్.. 6 రోజుల్లో 1200 కి.మీ ప్రయాణించిన రాబందు.. అసలేం జరిగిందంటే?
Vulture Journey : భోపాల్ నుంచి 1200 కిలోమీటర్లు ప్రయాణించి పాకిస్థాన్ చేరిన రాబందు. జీపీఎస్ ద్వారా గుర్తించిన అధికారులు.. పాక్‌లో గాయపడ్డ పక్షిని ఇరు దేశాల బృందాలు రక్షించాయి.
Vulture Journey : పక్షులకు దేశ సరిహద్దులతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గాలిలోకి వదిలిన ఒక రాబందు, కేవలం ఆరు రోజుల్లోనే సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు చేరుకుంది. సుమారు 1200 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన ఈ రాబందు ఉదంతం ఇప్పుడు రెండు దేశాల వన్యప్రాణి విభాగాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భోపాల్ సమీపంలోని హలాలీ డ్యామ్ ప్రాంతం నుంచి శాస్త్రవేత్తలు దీనిని ట్రాకింగ్ పరికరంతో సహా అడవిలోకి వదిలారు. దీని కదలికలను నిరంతరం గమనిస్తున్న క్రమంలో ఇది రాజస్థాన్ మీదుగా ప్రయాణిస్తూ పాక్ భూభాగంలోకి ప్రవేశించింది.
జీపీఎస్ సిగ్నల్ కట్ కావడంతో ఆందోళన
మార్చి 30, 2026న ఈ రాబందును అడవిలోకి వదిలిపెట్టారు. దానికి అమర్చిన జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఇది ఏప్రిల్ 7 వరకు సరిగ్గా సిగ్నల్స్ ఇచ్చింది. అయితే, పాకిస్థాన్‌లోని ఖానేవాల్ ప్రాంతానికి చేరుకోగానే అకస్మాత్తుగా సిగ్నల్ ఆగిపోయింది. దీంతో భారత అటవీ శాఖ, వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫెడరేషన్ (WWF) అధికారులు ఉలిక్కిపడ్డారు. ఒక ముఖ్యమైన పక్షి ఆచూకీ గాలిలో కలిసిపోవడంతో, వెంటనే భారత డబ్ల్యూడబ్ల్యూఎఫ్ బృందం పాకిస్థాన్‌లోని తమ సహచర బృందంతో, అక్కడి అటవీ అధికారులతో సంప్రదింపులు జరిపారు.
తుపానులో చిక్కుకుని గాయపడ్డ పక్షి
పాకిస్థాన్ అధికారులు తమ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అదే సమయంలో ముల్తాన్, ఖానేవాల్ ప్రాంతాల్లో విపరీతమైన వడగండ్ల వాన, తుపాను సంభవించాయి. ఈ ప్రతికూల వాతావరణం వల్ల రాబందు తీవ్రంగా గాయపడి నేలకూలింది. అదృష్టవశాత్తూ అక్కడి స్థానికులు దీనిని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. పాక్ వన్యప్రాణి అధికారులు వెంటనే స్పందించి ఆ రాబందును రక్షించి, ప్రస్తుతం ఛాంగా మాంగా వల్చర్ క్యాప్టివ్ బ్రీడింగ్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
క్రమంగా కోలుకుంటున్న రాబందు
ప్రస్తుతం ఆ రాబందు క్రమంగా కోలుకుంటోంది. వైద్యుల పర్యవేక్షణలో అది సాధారణంగా ఆహారం తీసుకుంటోందని సమాచారం. వన్యప్రాణి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాబందులు ఆహారం కోసం లేదా వలస కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించడం సహజమే. అయితే, అలసట కారణంగా లేదా దారిలో జరిగిన ప్రమాదాల వల్ల అవి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ సంఘటన ద్వారా వన్యప్రాణుల సంరక్షణలో దేశాల మధ్య సహకారం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. భోపాల్ నుంచి వెళ్ళిన ఈ రాబందు ఇప్పుడు ఇరు దేశాల స్నేహానికి ఒక ప్రతీకగా నిలిచింది.




