Pakistan: సింధు జలాలపై పాక్‌కు కోట్లాది రూపాయల ఝలక్.. భారత్ దెబ్బకు విలవిల!
Pakistan: సింధు జలాల ఒప్పందం (Indus Water Treaty) వివాదంలో పాకిస్థాన్‌కు భారీ దెబ్బ.
Pakistan: సింధు జలాలపై పాక్‌కు కోట్లాది రూపాయల ఝలక్.. భారత్ దెబ్బకు విలవిల!
Pakistan: సింధు జలాల ఒప్పందం వివాదంలో పాకిస్థాన్‌కు అంతర్జాతీయ వేదికపై ఊహించని దౌత్య, ఆర్థిక ఎదురుదెబ్బ తగిలింది. కిషన్‌గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులపై పాక్ దాఖలు చేసిన పిటిషన్‌పై హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (PCA) వేదికగా జరుగుతున్న మధ్యవర్తిత్వ విచారణ ఖర్చుల భారం మొత్తం ఇప్పుడు పాకిస్థాన్ నెత్తినే పడింది. భారత్ ఈ విచారణ ప్రక్రియను పూర్తిగా బహిష్కరించడమే కాకుండా, ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టడంతో.. భారత్ చెల్లించాల్సిన వాటా నిధులను కూడా గత్యంతరం లేక పాకిస్థానే చెల్లిస్తోంది.
సింధు జలాల ఒప్పంద నిబంధనల ప్రకారం.. రెండు దేశాల మధ్య తలెత్తే వివాదాలపై జరిగే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ విచారణల ఖర్చులను భారత్-పాకిస్తాన్‌లు సమానంగా (50:50 నిష్పత్తిలో) పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు భారత్ పూర్తిగా దూరంగా ఉండటంతో, విచారణ ముందుకు సాగాలంటే మొత్తం నిధులు పాకిస్థానే కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
'ఎకనామిక్ టైమ్స్' కథనం ప్రకారం.. హేగ్ కోర్టులో కేసును ముందుకు తీసుకెళ్లేందుకు దివాళా అంచున ఉన్న పాకిస్థాన్ ఇప్పటికే 6 లక్షల డాలర్లకు పైగా (భారత కరెన్సీలో రూ. 5 కోట్లకు పైగా) సొంతంగా ఖర్చు చేసింది. విచారణ పొడిగించే కొద్దీ ఈ వ్యయం మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది.
2025 ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఘోర ఉగ్రదాడి అనంతరం భారత్ ఈ ఒప్పంద ప్రక్రియలో పాల్గొనడాన్ని నిలిపివేసింది. సరిహద్దు దాటి పాకిస్థాన్ సాగిస్తున్న ఉగ్రవాద చర్యలపై నమ్మకమైన, శాశ్వతమైన చర్యలు తీసుకునే వరకు సింధు ఒప్పందం అమల్లో ఉండబోదని న్యూఢిల్లీ తేల్చి చెప్పింది.
భారత భూభాగంలోని పశ్చిమ నదులపై నిర్మిస్తున్న కిషన్‌గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం ఒప్పందానికి విరుద్ధమంటూ పాకిస్థాన్ పీసీఏ (PCA)ను ఆశ్రయించింది. అయితే, ఇవి కేవలం సాంకేతిక అంశాలని, వీటిని 'న్యూట్రల్ ఎక్స్‌పర్ట్' (తటస్థ నిపుణుడు) మాత్రమే పరిశీలించాలని భారత్ వాదిస్తోంది. ఒకేసారి న్యూట్రల్ ఎక్స్‌పర్ట్‌ను మరియు ఆర్బిట్రేషన్‌ను కోరడం ఒప్పంద స్ఫూర్తికే విరుద్ధమని స్పష్టం చేసింది.
హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేశారని, ఈ కేసును విచారించే అర్హత దానికి లేదని భారత్ మొదటి నుంచీ స్పష్టం చేస్తోంది. కాబట్టి ఈ ట్రైబ్యునల్ ఇచ్చే ఎలాంటి తీర్పులనైనా భారత్ అంగీకరించబోదని ప్రకటించింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఒక పక్షం హాజరుకాకపోయినా విచారణ జరపవచ్చనే పాయింట్‌తో పీసీఏ విచారణ జరుపుతున్నప్పటికీ, భారత్ రూపాయి కూడా చెల్లించకుండా మొండిగా నిలబడటంతో పాకిస్థాన్ ఒంటరిపోరు చేస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసుకుంటోంది.




