Iran Bounty on World Leaders: తలలు కొట్టినోడికి 58 మిలియన్ డాలర్లు బహుమతి...ఇరాన్ సంచలన నిర్ణయం
అంతర్జాతీయంగా ఇరాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ అగ్రనాయత్వంపై దాడికి ప్రతిఫలంగా ట్రంప్, నెతన్యాహు తలలపై భారీ రివార్డును ప్రకటించింది.
Iran Bounty on World Leaders: అంతర్జాతీయ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంతగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పార్లమెంట్ ఒక సంచలన, ప్రమాదకరమైన బిల్లును సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 28న టెహ్రాన్‌పై జరిగిన వైమానిక దాడుల్లో తమ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ మరణించినందుకు ప్రతీకారంగా.. ట్రంప్, నెతన్యాహులను అంతం చేసిన వారికి ఏకంగా 50 మిలియన్ యూరోలు అంటేసుమారు 58 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని ఇరాన్ బహిరంగంగా ప్రకటించింది. భారత కరెన్సీ ప్రకారం చూసుకుంటే 480 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్‌లో ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతుండటం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
పార్లమెంట్‌లో అధికారిక బిల్లు.. నరకానికి పంపితేనే రివార్డ్
ఇరాన్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజీ తెలిపిన వివరాల ప్రకారం.. కౌంటర్-యాక్షన్ బై మిలిటరీ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ అనే పేరుతో ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారు. అమెరికా నేతృత్వంలోని సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ కూడా ఈ హిట్ లిస్ట్‌లో ఉన్నారు. ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు మహమూద్ నబవియాన్ మాట్లాడుతూ, ట్రంప్, నెతన్యాహులను నరకానికి పంపే వారికి ఈ 58 మిలియన్ డాలర్ల బహుమతి అధికారికంగా అందుతుంది అని స్పష్టం చేశారు.
రంగంలోకి దిగిన ఇరాన్ సైబర్ హ్యాకర్లు
ఈ భారీ బహుమతి వెనుక కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, ఇరాన్ ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ వార్‌ఫేర్ గ్రూప్ "హందాలా" కూడా ఉంది. గతంలో తమ సభ్యుల సమాచారం ఇస్తే అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించినందుకు ప్రతిగా.. ఈ హ్యాకర్ల బృందం ఏకంగా 50 మిలియన్ డాలర్ల నిధిని సమకూర్చి కిల్ ట్రంప్ పేరుతో ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ ఈ ఇద్దరు ప్రపంచ నేతలపై దాడికి దిగితే ఈ డబ్బు చెల్లిస్తామని వారు ప్రకటించారు.
అమెరికా తీవ్ర హెచ్చరిక.. అగ్నిగుండంగా పశ్చిమాసియా
ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టింది. గతంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ గనుక తనను చంపే ప్రయత్నం చేస్తే, ఆ దేశాన్ని భూప్రపంచం నుంచి పూర్తిగా తుడిచేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్ పంపిన కొత్త శాంతి ప్రతిపాదనలను కూడా అమెరికా తిరస్కరించింది. గతంలో కేవలం మతపరమైన ఫత్వాలు, ప్రచారాలకే పరిమితమైన ఇరాన్.. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్‌లో చట్టం చేసి మరీ అమెరికా, ఇజ్రాయెల్ దేశాధినేతల తలలకు వెలకట్టడం ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నెడుతోందా అనే ఆందోళన కలిగిస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి పరిణామాలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే అంశాలుగా మారుతాయనడంలో సందేహం లేదు. అంతేకాదు, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా...ఇప్పుడు ఇలాంటి వార్తలు బయటకు రావడంతో ఈ సంక్షోభం మరింత ముదిరే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




